టీడీపీ ప్రభుత్వ తప్పిదాల వల్లే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందన్న అంబటి
భారీ వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి మట్టం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టును ఏపీ ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్, డ్యామ్ దగ్గర వరదపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అంబటి మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పోలవరం ప్రాజెక్టును గజిబిజిగా మార్చి, సరైన రీతిలో నిర్మాణం చేపట్టకుండా గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించిందని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. తాము చాలా చిత్తశుద్ధి, పూర్తి పారదర్శకతతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నామని పేర్కొన్నారు. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు, అప్పటి జలవనరుల శాఖ మంత్రి నేరానికి పాల్పడ్డారని విమర్శించారు. ప్రాజెక్టు ఆలస్యం కావడానికి, ఇప్పటికీ ముందుకు సాగకపోవడానికి చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాలే కారణమని అంబటి రాంబాబు ఆరోపించారు.పోలవరం ప్రాజెక్టును టీడీపీ ప్రభుత్వం ప్రొటోకాల్‌కు విరుద్దంగా పనులు చేపట్టిందన్న అంబటి రాంబాబు.. పనులు ఎందుకు పూర్తి చేయలేకపోయింది.. అంటూ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని తెలిపారు.