Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఫిషింగ్‌ హార్బర్‌లో 40పైగా బోట్లు బూడిద చితికిన బతుకులు

. రూ.లక్షల విలువైన మత్స్య సంపద అగ్నికి ఆహుతి
. ప్రభుత్వం నష్ట పరిహారం ఇవ్వాలని బాధితుల ఆందోళన
. సమగ్ర విచారణ జరిపి మత్స్యకారులకు న్యాయం చేయాలని విపక్షాల డిమాండ్‌

పగలు, రాత్రి సమయం తెలియకుండా ఇళ్లు వదిలి, రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా సముద్రంలోకి వెళ్లి మత్స్య కారులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ప్రాణాలకు గ్యారెంటీ లేని మత్స్యకారుల జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం… ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మత్స్యకారులు బతుకులను చిదిమేసింది.

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : పగలు, రాత్రి సమయం తెలియకుండా ఇళ్లు వదిలి, రోజుల తరబడి కుటుంబాలకు దూరంగా సముద్రంలోకి వెళ్లి మత్స్య కారులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ప్రాణాలకు గ్యారెంటీ లేని మత్స్యకారుల జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. కానీ విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదం… ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మత్స్యకారులు బతుకులను చిదిమేసింది. క్షణాల వ్యవధిలో వ్యాపించిన మంటలు.. మత్స్య కారుల జీవనాధారమైన బోట్లు, ఇతర సామగ్రిని బుగ్గి చేశాయి. ఆదివారం అర్ధరాత్రి వేళ విశాఖలో ఫిషింగ్‌ హార్బర్‌ భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ఒడ్డున ఉన్న బోట్లన్నీ దహనమయ్యాయి. మునుపెన్నడూ లేని విధంగా సుమారు 40మెకనైజ్డ్‌ బోట్లు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత ఒక బోటులో ఎగిసిన మంటలు చుట్టు పక్కల వాటికి కూడా వ్యాపించినట్టు అక్కడి మత్స్యకారులు చెబుతున్నారు. సోమవారం మార్కెట్‌ కోసం మూడ్రోజుల క్రితం వేటకు వెళ్లొచ్చిన వారంతా మత్స్య సంపదను అవే బోట్లలో నిల్వ చేశారని, ఆ సరుకు కూడా అగ్నికి ఆహుతైందంటున్నారు జాలర్లు. అప్రమత్తమైన స్థానికంగా ఉన్న వారు అగ్నిమాపక, పోలీస్‌, మత్స్య శాఖ, పోర్ట్‌ అధికార యంత్రాంగానికి సమాచారమిచ్చారు. స్థానికులంతా మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ సోమవారం తెల్లవారు జాము వరకు మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి.
న్యాయం చేయాలని బాధితులు ఆందోళన
అగ్నిప్రమాదంలో నష్ట పోయిన బాధితులకు న్యాయం చేయాలంటూ మత్స్యకార నాయకులు నిరసన చేపట్టారు. ఫిషింగ్‌ హార్బర్‌ వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ సాయంత్రంలోపు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి తమకు న్యాయం చేయాలన్నారు. బోటుకు రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. సీపీఐ, సీపీఎం, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రమాద స్థలాన్ని సందర్శించి వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదానికి కారకులైన వారిని కఠినంగా శిక్షించి బాధితులకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు.
మత్స్యకారులకు అండగా ప్రభుత్వం: మంత్రి సీదిరి
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఫిషింగ్‌ హార్బర్‌ లో కాలిపోయిన బోట్లను మంత్రి అప్పలరాజు, మాజీ మంత్రి అవంతి, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున్‌, పోలీస్‌ కమిషనర్‌ రవిశంకర్‌, మత్స్యశాఖ అధికారులు పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ కొంతమంది ఆకతాయిలు చేసిన పనికి, మత్స్యకార కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. 36 బోట్లు పూర్తిగా, 9 పాక్షింగా దెబ్బతిన్నాయని తెలిపారు. బోటు విలువ బట్టి 80 శాతం నష్టపరిహారం చెల్లిస్తామని స్పష్టం చేశారు. ప్రమాదానికి కారణమైనవారిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, వారికి కఠిన శిక్షలు తప్పవన్నారు. దెబ్బతిన్న ప్రతి బోటు యజమానికి, మత్స్యకారులందరికీ న్యాయం చేయమని సీఎం జగన్‌ చెప్పారని తెలిపారు. హార్బర్‌లో ఫైర్‌ సేఫ్టీ, అవుట్‌ పోస్ట్‌ కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో తొమ్మిది మంది
విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లోఅగ్ని ప్రమాద ఘటనకు కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒక బోటుపై మద్యం తాగుతూ పార్టీ చేసుకుంటున్న వారికి కావాల్సిన వంటకాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పార్టీ చేసుకున్న వారు ఎవరు? అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 9 మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. పార్టీలో ఒక యూట్యూబర్‌ కూడా పాల్గొన్నట్లు సమాచారం. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 60కి పైగా మరబోట్లు దగ్ధమైనట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. రాత్రి 11.30 గంటలు దాటిన తరువాత జీరో నంబరు జట్టీలో మంటలు రేగాయి. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించాయి. సాధారణంగా మత్స్యకారులు తమ బోట్లన్నింటినీ హార్బర్‌లోనే లంగరు వేసి ఉంచుతారు. మూడు రోజుల క్రితం సముద్రంపైకి వేటకు వెళ్లిన బోట్లు కూడా ఆదివారం సాయంత్రానికి తీరానికిచేరాయి. వాటిలో రూ.లక్షల విలువ చేసే మత్స్య సంపద బోట్లలోనే ఉంది. ఉదయం వాటిని వేలం వేసి విక్రయించాల్సి ఉంది. ఒక్కో బోటులో సుమారు రూ.5 నుంచి రూ.6 లక్షల విలువైన చేపలున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలి: రామకృష్ణ
విశాలాంధ్ర`విజయవాడ: విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్ని ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరపాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్‌ చేశారు. అగ్ని ప్రమాదంలో 53 నుంచి 60 బోట్లు వరకు దగ్ధం కావడంపై విచారం వ్యక్తం చేశారు. మత్స్యకారులకు బోట్లే జీవనాధారమని ఫిషింగ్‌ హార్బర్‌ ద్వారా కోట్లాది రూపాయల ఆదాయం ప్రభుత్వాలకు అందుతున్నప్పటికీ కనీస సౌకర్యాలు చేపట్టకపోవడం సరైందికాదన్నారు. బోట్లు దగ్ధమయిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని, ఒక్కో బోటుకు రూ. 50 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, బోట్ల మీద ఆధారపడి జీవిస్తున్న మత్స్య కార్మికులకు 6 నెలల పాటు జీవనోపాధిని కల్పించాలని డిమాండ్‌ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇప్పటికైనా ఫిషింగ్‌ హార్బర్‌లో అగ్నిమాపక పరికరాలతోపాటు తగు సిబ్బందిని కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
హార్బర్‌లో రక్షణ, భద్రతా చర్యలు చేపట్టాలి: జేవీఎస్‌ మూర్తి
విశాలాంధ్ర-విశాఖ: అగ్ని ప్రమాదంలో బోట్లు దగ్ధమై నష్టపోయిన బోట్ల యజమానులకు.., వాటిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కళాశీలు ఉపాధి కోల్పోయినందు వల్ల వారికీ నష్టపరిహారం చెల్లించాలని సిపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్‌ చేశారు. ప్రమాద స్థలాన్ని ఆయన సందర్శించి, బాధితులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ… ఆస్తులు అమ్మి, అప్పులు చేసి బోట్లను సమకూర్చుకున్న మత్స్యకారులు ఈ ప్రమాదంలో తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఒక్కోబోటు 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. వారిని పూర్తిస్థాయిలో ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోట్లాది రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ హార్బర్‌ లో రక్షణ, భద్రత పరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కనీసం సీసీ కెమెరాలు కూడా లేవన్నారు. పారాదీప్‌ పోర్టులో అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే అదుపులోకి తెచ్చేందుకు వాటర్‌ పైప్‌లైన్‌ వ్యవస్థ ఉందని మత్స్యకారులు చెబుతున్నారని, పెద్ద సంఖ్యలో బోట్లు ఉన్న విశాఖ ఫిషింగ్‌ హార్బర్లో అటువంటి వ్యవస్థ లేకపోవడం విచారకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, మత్స్యకార్మిక సంఘం నేతలు పి.చంద్రశేఖర్‌, నాగభూషణం, కూడా వజ్రం, వంక గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img