Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

మునేరు మహోగ్రం

. రెండోరోజూ హైవేపై రాకపోకలు బంద్‌
. ప్రకాశం బ్యారేజీకి రెండున్నర లక్షల వరద ప్రవాహం
. 26 గంటల తర్వాత వాహన రాకపోకలు ప్రారంభం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మునేరు మహోగ్ర రూపం దాల్చింది. ప్రమాదస్థాయిని మించి పరవళ్లు తొక్కుతోంది. ఎన్‌టీఆర్‌ జిల్లా కీసర వంతెన సమీపంలో ఐతవరం గ్రామం వద్ద వరద నీరు రోడ్డుపైకి రావడంతో విజయవాడ- హైదరాబాద్‌ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మునేరు రెండు అడుగుల ఎత్తున పొంగుతోంది. దీంతో గురువారం సాయంత్రం 4.30 గంటల నుంచి వాహన రాకపోకలను నిలిపివేశారు. లారీలు, బస్సులు, భారీ వాహనాలు రోడ్డుకి రెండువైపులా కిలోమీటర్ల పొడవునా నిల్చిపోయాయి. కార్లు మాత్రం మధిర నుంచి విజయవాడకు చేరుకున్నాయి. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్‌ వెళ్లే వాహనాలను కంచికచర్ల, ఎర్రుపాలెం, మధిర మీదుగా మళ్లించారు. భారీ వాహనాలను ఇబ్రహీంపట్నం, తిరువూరు, కల్లూరు రూటుకు మళ్లించారు. తెలంగాణ ఆర్టీసీ మాత్రం గుంటూరు, పిడుగురాళ్ల మీదుగా విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళుతున్నాయి. ప్రయాణికులు ఇబ్బందికి గురికాకుండా తెలంగాణ ఆర్టీసీ చర్యలు తీసుకున్నది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మునేరుకు తీవ్రస్థాయిలో వరద రావడంతో వాహనదారులు, బస్సుల్లో ప్రయాణించేవారు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ముఖ్యంగా తీర ప్రాంత ప్రజలు ఎక్కువగా నష్టపోయారు. ఏటికి రెండు వైపులా ఉన్న అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. నందిగామ మండలం కంచల గ్రామాన్ని వరద పూర్తిస్థాయిలో చుట్టుముట్టింది. కీసర వద్ద మునేరుకు కట్టలేరు, వైరా ఏరులు తోడవడంతో వరద ఉధృతి మరింత పెరిగింది. ఇక మునేరుతో పాటు పులిచింతల దిగువున ఉన్న చిన్నపాటి వాగులన్నీ పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టాన్ని నిల్వ చేస్తూ అదనపు నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. డెల్టా కాలువలకు పూర్తిస్థాయిలో నీటి సరఫరాని అధికారులు నిలిపివేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మొత్తం 70 గేట్లు ఉండగా, 40 గేట్లు 6 అడుగులు మేర ఎత్తగా, 30 గేట్లను 7 అడుగుల మేర ఎత్తి 2.70 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ దిగువున ఉన్న లంక గ్రామస్తులను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. వరద ప్రాంతాన్ని శుక్రవారం విజయవాడ సిటీ పోలీసు కమిషనర్‌ క్రాంతి రాణా టాటా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారిపై వరద నీరు అతివేగంగా ప్రవహిస్తున్నందున ప్రమాదాన్ని నివారించేందుకు వాహనాలు నిలిపివేశామని తెలిపారు. ఇందుకు వాహనదారులు, ప్రజలు అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఎవరూ ఆ వరదల్లో వెళ్లడానికి సాహసించవద్దన్నారు. వరద ఉధృతి తగ్గిన తర్వాత వాహనరాకపోకలు సాధ్యమైనంత త్వరగా పునరుద్ధరిస్తామని చెప్పారు. ఎటువంటి ప్రమాదాలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసు వ్యవస్థ గత రాత్రి నుండి రోడ్లపై నిద్రిస్తూ ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

వరద తగ్గుముఖంవాహన రాకపోకలు పునరుద్ధరణ

శుక్రవారం సాయంత్రానికి మునేరు కొంత శాంతించింది. వరద క్రమేపీ తగ్గుముఖం పట్టడంతో విజయవాడహైదరాబాద్‌ రూటులో వాహనరాకపోకలను పునరుద్ధరించారు. మొదట హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లే వాహనాలను అనుమతించారు. ఆ తర్వాత హైదరాబాద్‌ వైపు వెళ్లే వాహనాలను పంపించారు. పోలీసులు దగ్గరుండి ఒక్కొక్క వాహనాన్ని జాగ్రత్తగా వరద పారే ప్రాంతాన్ని దాటించారు. దాదాపు 26 గంటల తర్వాత నిత్యం రద్దీగా ఉండే విజయవాడ `హైదరాబాద్‌ హైవేపై వాహన రాకపోకలు పునరుద్ధరించడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img