Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

మున్సిపల్‌ కార్మికుల
ఆరోగ్యభత్యం చెల్లింపుపై అస్పష్టత

రూ.6 వేలు చెల్లించనున్నట్లు ఉత్తర్వులు జారీ
అమలు ఎప్పటినుంచో జీవో 109లో కానరాని వైనం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: మున్సిపాలిటీల్లో పని చేసే పారిశుధ్య కార్మికులకు ఓహెచ్‌ఏ (ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్సు) రూ.6 వేల చెల్లింపులకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. మున్సిపల్‌ కార్మికులకు ప్రస్తుతం అందజేస్తున్న నెలకు రూ.15 వేల వేతనానికి అదనంగా ఇకపై రూ.6 వేలు ఓహెచ్‌ఏను కలిపి రూ.21 వేల జీతం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు శుక్రవారం అర్థరాత్రి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి జీవో 109 విడుదల చేశారు. అయితే ఈ చెల్లింపులు ఎప్పటి నుంచి అమలుకు నోచుకుంటాయో జీవోలో స్పష్టత లేకపోవడం గందరగోళానికి దారితీస్తోంది. మున్సిపల్‌ కార్మికుల వేతనాల పెంపుపై గతంలో హామీ ఇచ్చిన సీఎం జగన్‌, వాటిని సంవత్సరాల తరబడి అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. దీనిపై మున్సిపల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ దశల వారీ ఆందోళనలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈనెల 11వ తేదీ నుంచి మున్సిపల్‌ కార్మికుల అన్ని సంఘాలు కలిపి జేఏసీగా ఏర్పడి నిరవధిక ఆందోళనకు దిగాయి. తొమ్మిది ప్రధాన డిమాండ్లపై కార్మికులు సమ్మె చేపట్టారు. ఆరోగ్య భత్యం బకాయిలతో సహా చెల్లించాలని, 11వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం నెల జీతం రూ.20 వేలు, కరవు భత్యం ఇవ్వాలని, మున్సిపల్‌ పారిశుధ్య ఇంజనీరింగ్‌ కార్మికులను క్రమబద్ధీకరించాలని, పట్టణాల విస్తరణ మేరకు కార్మికులు, సిబ్బంది సంఖ్యను పెంచాలని, ఆప్కాస్‌ ద్వారా ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు ఆర్థిక ప్రయోజనాలు, వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని, రిటైరయిన వారికి గ్రాట్యుటీ, పెన్షన్‌ చెల్లించాలని, ఇంజనీరింగ్‌ కార్మికులకు జీవో 30 ప్రకారం నైపుణ్య, నైపుణ్యేతర జీతాలివ్వాలని, శాశ్వత ఉద్యోగులకు ఆర్జిత సెలవు, జీపీఎఫ్‌ ఖాతాలు తెరవడంతో పాటు హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని, ఎన్‌ఎంఆర్‌లకు టైమ్‌ స్కేల్‌, కరవు భత్యం, పాఠశాలల్లోని ఆయాలకు కనీస వేతనం చెల్లించాలనే డిమాండ్ల పరిష్కారానికి కార్మికులు పట్టుబట్టారు. వీటిని పరిష్కరించేంతవరకు ఉద్యమం కొనసాగుతుందని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిచెత్త అక్కడ పేరుకుపోవడంతో దిగొచ్చిన ప్రభుత్వం తొలిరోజే జేఏసీ నేతలను చర్చలకు ఆహ్వానించింది. సీఎం సానుకూలంగా ఉన్నారని, సమస్యలు పరిష్కరిస్తామని, సమ్మె విరమించాలని కోరారు. లిఖిత పూర్వక హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని, లేనిపక్షంలో కొనసాగుతుందని నేతలు స్పష్టం చేశారు. దీనిపై సీఎం జగన్‌ స్పందిస్తూ మున్సిపల్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రి ఆదిమూలపు సురేశ్‌ను ఆదేశించడం, ఆ తర్వాత మంత్రుల కమిటీ సమావేశంలో వేతనానికి అదనంగా ఓహెచ్‌ఏ రూ.6 వేలు చెల్లించాలని నిర్ణయించారు. మిగిలిన సమస్యల పరిష్కారానికి కూడా తక్షణ చర్యలు తీసుకుంటామని, సమ్మె విరమించాలని మంత్రి సురేశ్‌ విజ్ఞప్తి చేశారు. దీంతో మున్సిపల్‌ జేఏసీ తాత్కాలికంగా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటన చేయగా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ పై ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img