Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

కరువుపై నిర్లక్ష్యం

. పట్టించుకోని జగన్‌ సర్కారు
. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలి
. నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించాలి
. సీపీఐ 30 గంటల నిరసన దీక్ష ప్రారంభంలో రామకృష్ణ
. సంఫీుభావం తెలిపిన కాంగ్రెస్‌, తదితర పార్టీలు

విశాలాంధ్ర – విజయవాడ : రాష్ట్రంలో తీవ్ర వర్షాభావంతో కరువు విలయతాండవం చేస్తున్నందున రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే కరువు సహాయ చర్యలు చేపట్టాలని సీపీఐ, ఇతర రాజకీయ పార్టీల, ప్రజాసంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కరువుతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వలసల నివారణకు చర్యలు చేపట్టాలని, కృష్ణాజలాల పున:పంపిణీకై కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి అధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్‌లో సోమవారం 30 గంటల నిరసన దీక్ష ప్రారంభమైంది. దీక్షను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ప్రారంభించారు.
రామకృష్ణ మాట్లాడుతూ కరువుతో ప్రజలు అల్లాడిపోతుంటే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పంటల పరిశీలన, రైతాంగం, కరువు గురించి సీఎం జగన్‌ మాట్లాడటం లేదని ధ్వజమెత్తారు. కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నోరెత్తటం లేదన్నారు. రాష్ట్రంలో 18 జిల్లాల్లో 440 పైచిలుకు మండలాల్లో కరువు సంభవించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం కరువు ప్రాంతాలను పరిశీలించి కరువు మండలాలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. గ్రామాన్ని యూనిట్‌గా తీసుకొని కామన్‌కోడ్‌ అమలు చేయాలన్నారు. ప్రతి ఎకరానికి నష్ట పరిహారం ఇవ్వాలని, రైతులు తీసుకున్న అన్ని రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. వలసపోతున్న ప్రజల కోసం తక్షణం గ్రామీణ ఉపాధి హామీ పనులు ప్రారంభించి…ఉపాధి కల్పించాలన్నారు. రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటి సౌకర్యాల కల్పనకు యుద్ధప్రతిపాదిన చర్యలు చేపట్టాలన్నారు. కరువు కారణంగా పశువులకు ఆహారం లభించటం లేదన్నారు. పశుగ్రాసాన్ని ప్రభుత్వం ఉచితంగా అందించాలన్నారు. ఎక్కడైనా బోర్లు, బావుల్లో నీరు ఉంటే అక్కడ 24 గంటలు కరెంటు సరఫరా చేయాలన్నారు. విద్యుత్‌ స్మార్ట్‌మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కర్నాటక ఎన్నికలో లబ్ధిపొందేందుకు ఎగువభద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు కేటాయించిన మోదీ ప్రభుత్వం…ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో లబ్ధిపొందటం కోసం కృష్ణా జలాల పున:పంపిణీ అంశాన్ని తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఇప్పటికే సాగునీరు రాక పంటలు వేసుకోలేని పరిస్థితి ఉంటే కాస్తోకూస్తో వచ్చే కృష్ణా నీటిని కూడా అడ్డుకునేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదన్నారు. కృష్ణా జలాల పున:పంపిణీ కోసం కేంద్రం విడుదల చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ చేపట్టిన ఉద్యమానికి రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు కలిసి రావాలని కోరారు.
కరువు బృందాలను పంపాలి: రావుల వెంకయ్య
ఆంధ్రప్రదేశ్‌లో కనీవిని ఎరుగని రీతిలో ఈ ఏడాది కరువు వచ్చిందని ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య చెప్పారు. సహజంగా కరువు ఉండే రాయలసీమతో పాటు కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు కూడా కరువుబారిన పడ్డాయన్నారు. రాష్ట్రాల్లో ఏ చిన్న సంఘటన జరిగినా కేంద్ర బృందాలను పంపించే మోదీ ప్రభుత్వానికి…ఏపీలో కరువు కనపించటం లేదా అని నిలదీశారు. ప్రధాని మోదీ కేంద్ర బృందాలను ఏపీకి పంపించి ఇక్కడి పరిస్థితిని పరిశీలించాలని డిమాండ్‌ చేశారు. రైతాంగానికి మేలు జరిగేందుకు ఈ వేదిక నుంచే సమరశంఖం పూరించాలని సూచించారు.
రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: గిడుగు రుద్రరాజు
రెండు నెలలుగా రాష్ట్రంలో కరువు తీవ్రస్థాయిలో ఉంటే ముఖ్యమంత్రి స్పందించటం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆరోపించారు. వేరుశనగ రైతు ఎకరాకు రూ.45 వేల పెట్టుబడి పెడితే పంట చేతికిరాక పూర్తిగా నష్టపోయాడని తెలిపారు. పల్నాడు జిల్లా వెలుర్తి మండలంలో దళిత రైతు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న ఉదంతాన్ని గుర్తుచేశారు. రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విజయనగరంలో 50 వేల ఎకరాల్లో పంటలు వేస్తే ప్రభుత్వ రికార్డుల్లో కేవలం 10 వేల ఎకరాలు మాత్రమే చూపిస్తున్నారని చెప్పారు. వలసల నివారణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీపీఐ చేసే పోరాటాల్లో కాంగ్రెస్‌ పార్టీ పాల్గొంటుందని స్పష్టం చేశారు. సీపీఐ నిరసన దీక్షకు సంఫీుభావం ప్రకటించారు.
ఏపీపై కేంద్రం కుట్ర: కాటం నాగభూషణం
కృష్ణా జలాల పున:పంపిణీ కోసం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చిన మోదీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందకుండా కుట్ర చేస్తున్నదని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదన్నారు. 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించేందుకు చర్యలు చేపట్టిందని మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదన్నారు. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయటానికి కేంద్రం చర్యలు తీసుకోవటం లేదన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై సీపీఐ చేపట్టిన 30 గంటల నిరసన దీక్షకు తమ మద్దతు ఉంటుందన్నారు.
దీక్షల ప్రారంభ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ నీటి యాజమాన్య అంశంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. 122 ఏళ్ల నాటి కరువు పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నట్లు ప్రభుత్వ రికార్డుల ద్వారా తెలుస్తున్నదన్నారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులను గుర్తించిన మొదటి రాజకీయ పార్టీ సీపీఐ మాత్రమేనన్నారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, గుజ్జుల ఈశ్వరయ్య, కేవీవీ ప్రసాద్‌ తదితరులు ప్రసంగించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌, పి.హరనాథరెడ్డి, అక్కినేని వనజ, డి.జగదీశ్‌, పి.రామచంద్రయ్య, జంగాల అజయ్‌కుమార్‌, డేగా ప్రభాకర్‌, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు రావులపల్లి రవీంద్రనాథ్‌, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సీహెచ్‌ కోటేశ్వరరావు, ఆవుల శేఖర్‌, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎ.విమల, పెన్మెత్స దుర్గాభవానీ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర పద్మశ్రీ, నాయకుడు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పరుచూరి రాజేంద్రబాబు, నక్కి లెనిన్‌బాబు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.జాన్సన్‌బాబు, కె శివారెడ్డి, ఏఐపీఎస్‌ఓ రాష్ట్ర కన్వీనర్‌ మహంకాళి సుబ్బారావు, కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు, సీపీఐ విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లాల కార్యదర్శులు సి.జాఫర్‌, ఎం.వేమయ్య, ఒమ్మి రమణ, ఎం.కృష్ణచైతన్య, ఎ.మారుతీ వరప్రసాద్‌తోపాటు 26 జిల్లాలకు చెందిన సీపీఐ నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఏపీ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రనాయక్‌, చిన్నం పెంచలయ్య బృందం అభ్యుదయ గీతాలు ఆలపించింది. ఎండిన మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, మిర్చి తదితర పంటలను దీక్షా శిబిరంలో ప్రదర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img