Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

కరువుపైజగన్‌ నిర్లక్ష్యం

. పట్టించుకోని మంత్రులు, ప్రజాప్రతినిధులు
. రామకృష్ణ విమర్శ
. 20, 21న విజయవాడలో ఆందోళన

విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు:రాష్ట్రంలో నెలకొన్న కరువు దుర్భిక్ష పరిస్థితులను వైసీపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇందుకు నిరసనగా సీపీఐ, ఏపీ రైతుసంఘం అధ్వర్యంలో నవంబరు 20, 21 తేదీలలో విజయవాడలో 30 గంటల ఆందోళనకు పిలుపునిచ్చామని సీపీఐ రాష్ట్రకార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. సీఆర్‌ భవన్‌లో మంగళవారం జరిగిన సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశానికి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 440 మండలాలు కరువుతో విలవిల్లాడుతున్నాయని చెప్పారు. కరువు పీడిత ప్రాంతాల్లో జగన్‌ ప్రభుత్వం పర్యటించలేదని, అసలు కరువుపై మాట్లాడేందుకు ముఖ్యమంత్రి జగన్‌ ఇష్టపడకపోవడం దారుణమని విమర్శించారు. కర్నాటకలో సిద్దరామయ్య ప్రభుత్వం సెప్టంబరు 26న కరువు తాలుకాలను ప్రకటించడమే కాకుండా కేంద్ర కరువు బృందాలను పిలిపించి నివేదిక సమర్పించిందని గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వం 103 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకుందని, మంత్రులు, ప్రజాప్రతినిధులు కరువు ప్రాంతాల్లో పర్యటించలేదన్నారు. రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కరువుపై చర్చించపోవడం జగన్‌ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. నీరు లేక ఎల్‌ఎల్‌సీ, హెచ్‌ఎల్‌సీ, కేసీ కెనాల్‌, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్‌ వెలవెల పోతున్నాయన్నారు. ప్రభుత్వం కరువు సహాయ చర్యలు చేపట్టే వరకు రాష్ట్రస్థాయిలో ఉద్యమాలకు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఎన్నికలలో లబ్ధి పొందడానికి మోడీ సర్కారు కృష్ణా జలాల వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిందని, దీనిద్వారా ఏపీకి అన్యాయం చేయాలని చూస్తున్నదని విమర్శించారు. కర్నాటక ఎన్నికల సమయంలోనూ ఎగువభద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడమే కాకుండా రూ.5300 కోట్లు కేటాయించిందని మండిపడ్డారు. బీజేపీ విధానాల కారణంగా ఏపీకి తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర కార్మికసంఘాలు, రైతుసంఘాల అధ్వర్యంలో విజయవాడలో నవంబరు 27, 28 తేదీలలో జరిగే ఆందోళనల్లో రైతు, కార్మికసంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కరువు సహాయక చర్యల కోసం 20,21 తేదీలలో సీపీఐ, ఏపీ రైతుసంఘం నిర్వహించే 30 గంటల ఆందోళనకు సీపీఐ, ఏపీ రైతుసంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. సమావేశంలో సీపీఐ రాష్ట్రకార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, సహాయ కార్యదర్శులు ఎస్‌ఎన్‌ రసూల్‌, ఎస్‌.మునెప్ప, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్‌.లెనిన్‌బాబు, సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img