అధిక ముప్పు కేటగిరీలో 77 మంది వ్యక్తులు
కేరళలో నిఫా వైరస్ ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో వ్యక్తికి ఈ వైరస్ నిర్దారణ అయినట్టు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ బుధవారం ధ్రువీకరించారు. కోజికోడ్‌లో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలోని ఆరోగ్య కార్యకర్తకు నిపా వైరస్ సోకినట్టు తెలిపారు. దీంతో ఆ రాష్ట్రంలో నిఫా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది. బాధితులతో కాంటాక్ట్ అయిన 706 మందిని ఇప్పటి వరకూ గుర్తించారు. వీరిలో 77 మంది హై-రిస్క్ కేటగిరీలో ఉండగా.. 153 మంది హెల్త్ వర్కర్లు ఉన్నారు. హై-రిస్క్ కేటగిరీలో ఉన్నవారిలో ప్రస్తుతం ఎటువంటి లక్షణాలు లేవని అధికారులు తెలిపారు. 13 మంది ప్రస్తుతం ఆస్పత్రిలో అబ్జర్వేషన్‌లో ఉన్నారని, వీరికి తలనొప్పి వంటి స్వల్ప లక్షణాలున్నాయని చెప్పారు. హై-రిస్క్ కాంటాక్ట్ ఉన్న వ్యక్తులు మాత్రం ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశించారు. కాగా, వైరస్ నియంత్రణకు చేపట్టిన చర్యలను సమన్వయం కోసం కేరళ ప్రభుత్వం 19 కోర్ కమిటీలను ఏర్పాటు చేసింది. ఐసోలేషన్‌లో ఉన్న వారికి నిత్యావసరాలను అందించడంలో సహాయపడేందుకు స్థానిక ప్రభుత్వం ద్వారా వాలంటీర్ బృందాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ కేరళలో నిపా వైరస్‌తో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. కోజికోడ్ జిల్లాలోని 7 పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ముందు జాగ్రత్తగా అక్కడి బ్యాంకులు, పాఠశాలతోపాటు ఇతర విద్యాసంస్థలను మూసివేశారు. ప్రస్తుతం వెలుగు చూసిన నిఫా వైరస్ బంగ్లాదేశ్ వేరియంట్ అని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కంటెయిన్‌మెంట్ జోన్లలోని విద్యార్థులకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని అధికారులను విద్యా శాఖ మంత్రి వి శివన్‌కుట్టీ ఆదేశించారు. ఇది మనుషుల మధ్య వ్యాపించగలదని, వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ మరణాల రేటు అధికమని చెప్పారు. మరణాల రేటు అధికంగా ఉండే ఈ వైరస్ నిర్ధారణను వేగవంతంగా చేపట్టేందుకు గాను పుణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ నిపుణులు కేరళకు చేరుకున్నారు.