Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

నితీశ్‌ రాజీనామా

మహాకూటమి నేతగా ఎన్నిక
ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నరుకు విజ్ఞప్తి
కొత్త ప్రభుత్వానికి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతు
ఎన్‌డీఏకి జేడీయూ గుడ్‌బై
శరవేగంగా మారిన బీహార్‌ పరిణామాలు

పాట్నా: బీహార్‌లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ తన పదవికి మంగళవారం రాజీనామా చేశారు. ఎన్‌డీఏ నుంచి జేడీయూ బయటికి వచ్చింది. ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాలతో కలిసి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. బీహార్‌లో బీజేపీ కుట్రలను నితీశ్‌కుమార్‌ ఒక్కొక్కటీ బహిర్గతం చేశారు. మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా గవర్నరు ఫాగు చౌహాన్‌కు నితీశ్‌కుమార్‌ విజ్ఞప్తి చేశారు. తమకు కావాల్సిన సంఖ్యాబలం ఉందని గవర్నరుకు స్పష్టం చేశారు. మరోవైపు, నితీశ్‌కుమార్‌ నిర్ణయాన్ని ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్‌ (లిబరేషన్‌) స్వాగతించాయి. నితీశ్‌ నేతృత్వంలో మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకారం తెలిపాయి. మరోవైపు, నితీశ్‌పై బీజేపీ మండిపడిరది. బీజేపీకి, రాష్ట్ర ప్రజలకు నితీశ్‌ నమ్మకద్రోహం చేశారని ఆరోపించింది. మంగళవారం ఒక్క రోజే గవర్నరు ఫాగు చౌహాన్‌ను నితీశ్‌ రెండుసార్లు కలిశారు. ఎన్‌డీఏ ముఖ్యమంత్రిగా తాను రాజీనామా చేస్తున్నట్లు గవర్నరుకు లేఖ అందజేశారు. ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాకూటమి నేతగా ఎన్నికైన తర్వాత మళ్లీ గవర్నరును కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటునకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. 164 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నరుకు నితీశ్‌ అందజేశారు. ప్రమాణ స్వీకారానికి పిలవడంపై గవర్నరు నిర్ణయం తీసుకుంటారని నితీశ్‌కుమార్‌ చెప్పారు. 2017లో మహాకూటమి నుంచి ఎన్‌డీఏలో చేరేందుకు ఎంత వేగంగా అడుగులు పడ్డాయో…అంతకన్నా మరింత వేగంతో నితీశ్‌ అడుగులు వేశారు. 9 ఏళ్ల కాలంలో నితీశ్‌కుమార్‌ బీజేపీతో తెగతెంపులు చేసుకోవడం ఇది రెండోసారి. ముందుగా గవర్నరు చౌహాన్‌తో సమావేశమైనప్పుడు..ఎన్‌డీఏ నుంచి బయటికి రావాలని తమ పార్టీ జేడీయూ నిర్ణయం తీసుకుందని నితీశ్‌ తెలిపారు. గవర్నరుతో సమావేశం అనంతరం ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి నితీశ్‌కుమార్‌ నేరుగా మాజీ సీఎం రబ్రీదేవి నివాసానికి వెళ్లారు. మహాకూటమి పక్ష నేతగా నితీశ్‌కుమార్‌ను ఎన్నుకున్నారు. ఆ తర్వాత గవర్నరును కలిసి ఆర్‌జేడీ, కాంగ్రెస్‌, వామపక్షాల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికి చేరుకున్న నితీశ్‌కుమార్‌..అక్కడ పెద్దసంఖ్యలో గుమికూడిన విలేకరులతో మాట్లాడుతూ ఎన్‌డీఏ నుంచి బయటికి రావాలని పార్టీ సమావేశం నిర్ణయం తీసుకుందని చెప్పారు. అందువల్ల ఎన్‌డీఏ ముఖ్యమంత్రిగా తాను రాజీనామా చేశానన్నారు. కాగా నేడో, రేపో నితీశ్‌కుమార్‌ దిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నారు. నరేంద్రమోదీని ఎన్‌డీఏ ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంతో 2013లో ఆ కూటమికి నితీశ్‌ దూరమయ్యారు.
అంతకుముందు ఉదయం జేడీయూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నితీశ్‌కుమార్‌ సమావేశమయ్యారు. బీజేపీతో తెగతెంపులపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్‌డీఏ నుంచి బయటికి రావడానికి గల కారణాలు వివరించారు. అందుకు అందరి మద్దతు తీసుకున్నారు. దీనిపై జేడీయూ నేత ఉపేంద్ర కుశ్వాహా ట్వీట్‌ చేస్తూ కొత్త రూపంలో నూతన సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించనున్న నితీశ్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు. ఆర్‌జేడీతో కలిసి మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. రబ్రీదేవి నివాసంలో ఆర్‌జేడీ నేతృత్వంలోని మహాకూటమి సమావేశమైంది. ఆర్‌జేడీ, జేడీయూ, వామపక్షాలు, కాంగ్రెస్‌ నాయకులు హాజరయ్యారు. బీహార్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ఆధారంగా 121 మంది సభ్యుల అవసరం ఉంది. మహాకూటమికి దాదాపు 160 మంది సభ్యుల బలం ఉంది. అసెంబ్లీలో పార్టీ బలాబలాలను పరిశీలిస్తే..ఆర్‌జేడీకి అత్యధికంగా 79 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 77, జేడీయూకి 44, కాంగ్రెస్‌కు 19, సీపీఐ ఎంఎల్‌(ఎల్‌)కు 12, సీపీఐ, సీపీఎంలకు చెరో రెండు, జితన్‌ రామ్‌ మాంజీ పార్టీకి నలుగురు, ఒక ఇండిపెండెంట్‌ ఉన్నారు. అసదుద్దీన్‌ నేతృత్వంలోని ఎంఐఎంకు ఒక సభ్యుడు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img