Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

సీఐడీ కాదు… జేపీఎస్‌

. మార్చేసిన జగన్‌
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ

విశాలాంద్ర – తిరుపతి సిటీ: సాక్షాత్తు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, జడ్‌ ప్లస్‌ భద్రత కలిగిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే రాష్ట్ర విచారణ సంస్థగా ఉండాల్సిన సీఐడీ పోలీసు విభాగం పూర్తిగా జగన్‌ ప్రైవేట్‌ సైన్యం (జేపీఎస్‌)గా మారిందా? అనే అనుమానం కలుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఆదివారం ఉదయం ఆయన తిరుపతిలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఎ.రామా నాయుడు తదితరులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. రామకృష్ణ మాట్లా డుతూ రాష్ట్రంలో సాగుతున్న నియంత పాలనా పోకడలు, ప్రజాకంటక విధానాలపై మరింత ఉదృతంగా పోరాటాలు చేసేందుకు సమాయత్తం అవుతున్నామని తెలిపారు. నియంత పోకడలకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయ నేతల అరెస్టుల విషయాలు నిదర్శనాలు అన్నారు. అదే కడప జిల్లాలో ఎంపీ, జగన్‌ తమ్ముడైన అవినాశ్‌ రెడ్డిని అరెస్టు చేసేందుకు వచ్చిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్ర పోలీసు యంత్రాంగం సహకరించకుండా, శాంతి,భద్రతల సాకుతో డ్రామాలు ఆడిన తీరును ప్రజలు మరువలేదన్నారు. అదే కర్నూలు జిల్లాలో ఒక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర సంస్థల భద్రత కలిగిన చంద్రబాబు నాయుడు విషయంలో రాష్ట్ర పోలీసు విభాగాలు వ్యవహరించిన పక్షపాత ధోరణితో రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా? అని అనుమానం కలుగుతోందని రామకృష్ణ అన్నారు. ప్రజలు పొరపాటున అధికారం ఇస్తే అడుగడు గునా దుర్వినియోగ పద్ధతులు అనుసరిసూ, ప్రశ్నించే పార్టీల గొంతుకలను అణగదొక్కుతారా అని నిలదీశారు. పాలనలోని తప్పులను ఎత్తి చూపితే మీడియా, పారిశ్రామిక వేత్తలు, పార్టీల నేతలను బెదిరింపులకు గురి చేయడం జగన్‌కి తగదని హితవు పలికారు. లోకేశ్‌ పాదయాత్ర చేస్తే రాక్షసంగా అడ్డుకునే కుట్రలు చేస్తున్న జగన్‌ కూడా 2019కి ముందు ఇలాగే చేసి ఉంటే పాదయాత్ర చేసి ఉండే వారా అని ప్రశ్నించారు. పోలీసు అధికారులు, సిబ్బందిలో కొందరి వింత విధానాలు చూస్తుంటే రక్షణ విభాగాల పరువు తీస్తున్నారని చెప్ప్డారు. జగన్‌ నిజమైన నాయకుడే అయి ఉంటే విదేశాలకువెళ్లి ఇలా కక్షసాధింపు చర్యలకు ఉసిగొల్పరన్నారు. చంద్రబాబును కలిసి సంఫీుభావం చెప్పేందుకు వస్తున్న మరో విపక్ష నేత అయిన పవన్‌ కల్యాణ్‌ ను పోలీసులు పైశాచికంగా అడ్డుకోవడం దుర్మార్గం అన్నారు. ఎన్నో కేసుల్లో నిందితునిగా ఉన్న జగన్‌కి మిగిలిన అందరూ కూడా నిందితులుగా మారాలన్న పిచ్చి తప్ప మరొకటి కాదని విమర్శించారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మురళి, నాయకులు చిన్నం పెంచలయ్య, కె.రాధాకృష్ణ, నగర కార్యదర్శి జె.విశ్వనాథ్‌, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img