Sunday, September 24, 2023
Sunday, September 24, 2023

పాతపింఛను పునరుద్ధరించాలి

. ఎంతటి పోరాటానికైనా సిద్ధం
. సీపీఎస్‌, జీపీఎస్‌ వద్దు
. సీఎం జగన్‌ ఇచ్చిన హామీ నెరవేర్చాలి
. ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) పునరుద్ధరించేంత వరకు తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పేర్కొంది. కాంట్రి బ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌ ), లేదా గ్యారెంటీ పెన్షన్‌ స్కీమ్‌ (జీపీఎస్‌)కు తాము అంగీకరించబోమని పునరుద్ఘాటించింది. విజయవాడ ఎస్టీయూ -ఏపీ కార్యాలయంలో బుధవారం నాలుగు ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షప్రధాన కార్యదర్శులు ఎల్‌ సాయి శ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న, యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌. వెంకటేశ్వర్లు, కేఎస్‌ఎస్‌ ప్రసాద్‌, ఏపీటీఎఫ్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జీ హృదయ రాజు, ఎన్‌ చిరంజీవి, ఆప్టా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ గణపతిరావు, కే ప్రకాశరావు మాట్లాడారు. జీపీఎస్‌ పై ఈనెల 29వ తేదీన మంత్రివర్గ ఉప సంఘం, ఉద్యోగ సంఘాలతో నిర్వహించిన చర్చల్లో ఎలాంటి పురోగతి లేనందున ఉద్యోగుల ఆశలు ఆవిరి అయ్యాయన్నారు. సీపీఎస్‌ ఉద్యోగులను ఈ ప్రభుత్వం నిలువునా ముంచేసిందని ఉపాధ్యాయ సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. జీపీఎస్‌ విధానాలు ఏమిటో చెప్పకుండా, కేవలం 50 శాతం పెన్షన్‌, దానిపై ఇచ్చే డియర్‌ నెస్‌ రిలీఫ్‌ చుట్టూనే మొత్తం చర్చ నడిపారన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ అనంతరం వారికి ఇవ్వాల్సిన 60 శాతం పెన్షన్‌ ఫండ్‌ ను చెల్లించకుండా, దానినే మదుపు చేసి 50 శాతం పెన్షన్‌ ఇస్తామని చెప్పడం ద్వారా జీపీఎస్‌ ముసుగును ప్రభుత్వం తొలగించిందన్నారు. జీపీఎస్‌ విధానం సీపీఎస్‌ కు ప్రతిరూపమే తప్ప, వేరేమీ కాదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్న మాటలు మరోసారి రుజువయ్యాయని తెలిపారు. ఇటీవల రోసా రూల్స్‌, రాష్ట్రపతి ఉత్తర్వులు 2023పై నిర్ణయాలు చేసేటప్పుడు ముసాయిదా ఇచ్చి… దానిని అధ్యయనం చేయడానికి కొంత సమయం ఇచ్చి… ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాల్ని ప్రభుత్వం తీసుకుందని గుర్తు చేశారు. జీపీఎస్‌ పై ఆర్డినెన్స్‌కు వెళ్తూ కనీసం ముసాయిదా కూడా ఇవ్వకుండా అమలు చేసేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేంద్రప్రభుత్వ ఆదేశాల ప్రకారం 2004కు ముందు నియామకపు ప్రక్రియ పూర్తయిన 11వేలమందికి పాత పెన్షన్‌ విధానం అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. జీపీఎస్‌ విధానమే అంత గొప్పదైతే, ఉద్యోగులకు మేలు కలిగించేదైతే, దేశానికంతటికీ ఆదర్శవంతమైనదైతే… ప్రభుత్వం ఎందుకు ముసాయిదా విడుదల చేసి దానిపై చర్చించడం లేదని సూటిగా ప్రశ్నించారు. ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని, ఇచ్చిన హామీకి కట్టుబడి… పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేసి సీఎం జగన్‌ తన విశ్వనీయతను ఎందుకు నిరూపించుకోవడం
లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రకటిస్తున్న ఈ గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌ కు గ్యారంటీ ఏమిటని ప్రశ్నించారు. కొన్ని ఉద్యోగ సంఘాల నేతల వైఖరి తగదని, వారు సీపీఎస్‌ ఉద్యోగుల ఆవేదన గమనించకుండా ప్రభుత్వానికి వంతపాడటంతోపొటు ఓపీఎస్‌ కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న ఉపాధ్యాయ సంఘాలపై బురద చల్లడం సబబు కాదని సూచించారు. పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ కోసం జరిగే పోరాటంలో అందరూ కలిసి రావాలన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు లక్షలమంది సీపీఎస్‌ ఉద్యోగులంతా పాత పెన్షన్‌ విధానాన్నే కోరుతున్నారని స్పష్టం చేశారు. తక్షణమే సీపీఎస్‌ను రద్దు చేసి… పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలనేదే తమ డిమాండని, అందుకోసం ఎంతటి పోరాటానికైనా వెనుకాడబోమని నాలుగు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img