Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా..

వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సంచలన ప్రదర్శన నమోదు చేశాడు. రోజు రోజుకీ మెరుగవుతూ మరో గొప్ప ఘనత సొంతం చేసుకున్నాడు. ఆదివారం ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో 88.17 మీటర్ల త్రో విసిరి పురుషుల జావెలిన్ త్రో విన్నర్‌గా నిలిచాడు. దీంతో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు.పాకిస్థాన్‌ త్రోయర్ అర్షద్ నదీమ్ 87.82 మీటర్ల దూరం బల్లెం విసిరి రజతం సొంతం చేసుకున్నాడు. చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన వద్లేచ్ 88.67 మీటర్లు నమోదు చేసి కాంస్య పతకం దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో తొలి ప్రయత్నంలో ఫౌల్ చేశాడు చోప్రా. అయితే రెండో త్రో ద్వారానే స్వర్ణం ఖాయం చేసుకున్నాడు. రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను 88.17 మీటర్ల దూరం విసిరాడు. మూడో సారి 86.32 మీటర్లు, నాలుగో ప్రయత్నంలో 84.64 మీటర్లు, ఆ తర్వాత వరుసగా 87.73, 83.98 మీటర్లు త్రో విసిరాడు. రెండో ప్రయత్నంలో విసిరిన త్రో(88.17)తోనే గోల్డ్ మెడల్ సాధించాడు. నీరజ్ చోప్రాతో పాటు భారత్ నుంచి పాల్గొన్న మరో ఇద్దరు త్రోయర్లు ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. కిశోర్ జెనా (84.77మీటర్లు) ఐదో ప్లేసు, మను (84.14 మీటర్లు) ఆరో ప్లేసులో నిలిచారు.

నీరజ్ సాధించి స్వర్ణంతో కలిపి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ సాధించిన పతకాల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటివరకు 18 సార్లు పోటీలు జరగ్గా.. భారత్‌కు వచ్చినవి రెండు పతకాలు మాత్రమే. మహిళల లాంగ్ జంప్‌లో అంజూ బాబీ జార్జ్ 2005లో కాంస్యం, గతేడాది ఛాంపియన్ షిప్స్‌లో నీరజ్ రజతం సాధించాడు. ఈ సారి మరో అడుగు ముందుకేసి పసిడిని పట్టేశాడు. ఫలితంగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ తరఫున కొత్త శకానికి నాంది పలికాడు 25 ఏళ్ల నీరజ్ చోప్రా.

నీరజ్ చోప్రా గాయాలను సైతం దాటుకొని ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో స్వర్ణం సాధించాడు. గతేడాది ఇదే టోర్నీలో నీరజ్ భుజానికి గాయమైంది. దీంతో కామన్వెల్త్ పోటీలకు దూరమయ్యాడు. ఈ సీజన్‌లో ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌తో పాటు.. ఆసియా గేమ్స్ ఉండటంతో ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేశాడు. ప్రణాళిక ప్రకారం తనను తాను సిద్ధం చేసుకున్నాడు. మేలో జరిగిన దోహా డైమండ్ లీగ్‌లో 88.67 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తన ప్రతిభతో జావెలిన్ త్రో ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నెంబర్ వన్‌గా అవతరించాడు. తాజాగా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్‌లో నీరజ్ చోప్రా పసిడి పతకం గెలవడం పట్ల ఇండియన్ ఆర్మీ అభినందనలు తెలిపింది. నీరజ్ మరోసారి దేశం గర్వించేలా చేశాడన్న ఆర్మీ.. సైన్యంలో సుబేదార్‌గా పని చేస్తున్న నీరజ్ చోప్రాను అభినందిస్తూ ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img