Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

16, 17 తేదీల్లో పోలవరం ముంపు ప్రాంతాలకు అఖిలపక్షం

సెప్టెంబర్‌లో దీక్షలు: రామకృష్ణ
ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తశుద్ధి చూపాలి
సీపీఐ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: పోలవరం వరద ముంపు ప్రాంతాల్లో అఖిలపక్షం ఈనెల 16, 17 తేదీల్లో పర్యటించాలని, సెప్టెంబర్‌లో పోలవరంలో దీక్షలు చేపట్టాలని రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్ణయించింది. విజయవాడ దాసరిభవన్‌లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వాసితుల సమస్యల పరిష్కారంపై సీపీఐ రాష్ట్ర సమితి సోమవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి అఖిలపక్ష నేతలు, ఆంధ్రా, తెలంగాణలోని పోలవరం ముంపు మండలాల బాధితులు హాజరయ్యారు. రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం బాధితులకు పునరావాస ప్యాకేజీ (ఆర్‌ అండ్‌ ఆర్‌) ఇవ్వకుండా ప్రాజెక్టును నిర్మించడం వల్లే సమస్యలు తలెత్తాయన్నారు. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు. సీఎం జగన్‌ తన మూడేళ్ల కాలంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదన్నారు. మోదీ ప్రభుత్వానికి జగన్‌ అన్ని విధాలా సహకరిస్తున్నారని, అదేసమయంలో రాష్ట్రానికి రావాల్సిన హక్కులపై మౌనం వహిస్తున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం నిధులు, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీపై మోదీని జగన్‌ నిలదీయలేకపోతున్నారన్నారు. ముంపు బాధితులకు పరిహారం అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వరద బాధితులకు రూ.10వేల చొప్పున ఇస్తే…జగన్‌ ప్రభుత్వం రూ.2వేలే ఇచ్చి చేతులు దులుపుకున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు కేవలం 22 శాతమే నిర్వాసితులకు సాయమందించిందని, మిగిలిన వారికి ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర్రంలోని అన్ని ప్రాంతాలకు పోలవరం ఉపయోగపడుతోందన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు పి.మధు మాట్లాడుతూ పోలవరం బాధితుల సమస్యను తీర్చి, ఆ తర్వాత ప్రాజెక్టు నిర్మిస్తే, ఇవాళ ఇన్ని సమస్యలు వచ్చేవి కాదన్నారు. పోలవరం నిర్వాసిత బాధితులు డెంగ్యూ, టైఫాయిడ్‌ వ్యాధులతో చనిపోతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వారికి పునరావాస, వైద్యసౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. పునరావాస ప్యాకేజీ ఇచ్చాకే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు. ఖమ్మం జిల్లా పరిషత్‌ మాజీ జెడ్పీ చైర్మన్‌ చందా లింగయ్య మాట్లాడుతూ పోలవరం కోసం భూములు త్యాగం చేసిన వారికి పునరావాసం కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దగా చేస్తున్నాయన్నారు. బాధితులకు పునరావాస ప్యాకేజీ, పోలవరం సత్వర నిర్మాణంపై అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకుని జాతీయస్థాయిలో ఉద్యమించాలన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలవరంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయన్నారు. పోలవరం నిర్మాణం కోసం జరిగిన ఉద్యమంలో సీపీఐ క్రియాశీలకంగా నిలిచిందన్నారు. కేంద్రం మెడలు వం చేలా అక్టోబరు తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. ఏఐకేఎస్‌ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య మాట్లాడుతూ పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టని, దీనిపై మొదటి నుంచి కేంద్రం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. నూటికి నూరు శాతం నిధులిచ్చి పోలవరాన్ని పూర్తి చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కేంద్రంపై సీఎం జగన్‌ ఒత్తిడి చేయనందునే పోలవరానికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. వైఎస్‌ రాజశేఖ రరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి, దిల్లీకి తీసుకెళ్లారని వివరిం చారు. జగన్‌ కూడా తండ్రి మార్గాన్ని అనుసరించాలని సూచించారు. జగన్‌ అఖిలపక్షం వేయకపోయినా..మిగిలిన పార్టీలన్నీ అఖిలపక్షంగా దిల్లీకి వెళ్లాల్సిన అవసరముందని అభిప్రా యపడ్డారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు మాట్లాడుతూ పాలకులు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ పోలవరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. డీపీఆర్‌2ను కేంద్రం అంగీకరించనందున ఇప్పట్లో పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు కన్పించడం లేదన్నారు. రాష్ట్రీయ ప్రజాకాంగ్రెస్‌(ఆర్‌పీఐ) నాయకులు మేడా శ్రీనివాస్‌, ఏపీ కాంగ్రెస్‌ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ జట్టి గురునాథం మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీ, ప్రాజెక్టు పూర్తి కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. రైతుసంఘం నాయకులు ఆళ్ల గోపాలకృష్ణ, ముర్రాపు సూర్యనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్‌ రివర్స్‌ టెండరింగ్‌ విధానంతో పోలవరం మరింత జాప్యమైందన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి స్వర్ణ మాట్లాడుతూ వరదలకు మట్టి ఇళ్లల్లోకి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. సీఎం జగన్‌ ముంపు ప్రాంతాలకు వచ్చి 41.5 కాంటూరు వారికే పరిహారం ఇస్తామనడం దారుణమన్నారు. లోక్‌సత్తా రాష్ట్ర నాయకుడు బి.వెంకటరమణ(బాబు) మాట్లాడుతూ పోలవరంపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు దొంగాటాడుతున్నాయన్నారు. ఎంసీపీఐ(యూ) నాయకులు ఖాదర్‌ భాషా మాట్లాడుతూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం జగన్‌ ఒత్తిడి చేయడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.దుర్గాభవాని మాట్లాడుతూ పోలవరం బాధితులకు పరిహారం, ప్రాజెక్టు పూర్తిపై చాలా ఉద్యమాలు చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదన్నారు. తెలంగాణకు చెందిన పోలవరం ముంపు ప్రాంతాల నుంచి సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు ఆకోజు సునీల్‌కుమార్‌, కల్లూరి వెంకటేశ్వరరావు, లంకపల్లి విశ్వనాథ్‌, మైసాక్షి వెంకటాంబకుక్కునూరు, లంకపల్లి విశ్వనాథ్‌, తణుకు నివాసి మనోరమ, భద్రాచలం నుంచి సునీల్‌, వెంకటాచార్యులు, జె.కుమార్‌, సంగీత తదితరులు ప్రసంగించారు. బాధితుల బాధలను వర్ణించారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్‌, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, సీపీఐ తెలంగాణ నాయకుడు ఆర్‌.రామ్‌ప్రసాద్‌, సీపీఐ గుంటూరు, కృష్ణా జిల్లాల కార్యదర్శులు జంగాల అజయ్‌కుమార్‌, నార్ల వెంకటేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రనాథ్‌, ఉప ప్రధాన కార్యదర్శి ఎస్‌.వెంకట సుబ్బయ్య, చేతివృత్తిదారుల రాష్ట్ర కన్వీనర్‌ కె.రామాంజనేయులు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ సుబ్బారావు, డీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బుట్టి రాయప్ప, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి పి.రాణి, రిటైర్డ్‌ లెక్చరర్‌ ఎస్‌.మనోరమ, వివిధ పార్టీలు, ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ వందన సమర్పణ చేశారు. తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రానాయక్‌ అభ్యుదయ గీతాలు ఆలపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img