ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గ్రామ సర్పంచ్‌ల ప్రమేయం లేకుండా పంచాయతీ నిధులను ఇతర ఖాతాలకు మళ్లించారన్న ఆరోపణలపై రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం హైకోర్టు ఆదేశించింది. సర్పంచ్‌ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలకు మళ్లించిందంటూ హైకోర్టులో ఏపీ సర్పంచ్‌ల సంఘం గౌరవ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. సర్పంచ్‌ల ప్రమేయం లేకుండా నిధులను ప్రభుత్వం నేరుగా తమ ఖాతాలోకి మళ్లించుకుందని పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది వీరారెడ్డి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ అంశంపై కోర్టు స్పందిస్తూ రెండు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
హైకోర్టును ఆశ్రయించిన ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల యాజమాన్యాలు
ఫీజు నియంత్రణ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలను పాటించడం లేదంటూ ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఒకపక్క నిర్వహణ ఖర్చులు పెరుగుతుండగా, ప్రభుత్వం ఏటా ఫీజులు తగ్గిస్తోందని కళాశాలల తరపున న్యాయవాది శ్రీవిజయ్ వాదనలు వినిపించారు. రెగ్యులేటరీ కమిషన్ తరపున సుదేశ్ ఆనంద్ వాదనలు వినిపించారు. దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం కమిషన్… విద్యాసంస్థలకు ముందస్తు అవకాశం ఇచ్చిందో, లేదో చెప్పాలని, అప్పటివరకు ఫీజులపై నోటిఫికేషన్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.