Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

ఓపీఎస్‌, సీపీఎస్‌ముగిసిన అధ్యాయం

. ‘స్కిల్‌’ కేసులో చంద్రబాబు దొరికిపోయారు
. మంత్రి బొత్స సత్యనారాయణ

విశాలాంధ్రబ్యూరో-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ నైపుణ్యాభివృద్ధి సంస్థ (స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని విధాలా దొరికిపోయారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విజయవాడలో శనివారం ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. చంద్రబాబు అరెస్టును తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఖండిరచడాన్ని బొత్స తప్పుబట్టారు. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న ఒక నాయకుడు అలా మాట్లాడొచ్చా? అందుకే మేము పోచారం మాటలను ఖండిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి కార్యక్రమాలపై చర్యలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా జీవితంలో ఉన్న వారు, పరిపాలన చేసే వాళ్లు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరముందని సూచించారు. చంద్రబాబు అనేక సందర్భాల్లో వాటన్నింటినీ అతిక్రమించారని, ఎప్పుడూ దొరకలేదన్నారు. ఇప్పుడు దొరికిపోవడంతో బేలగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సీమెన్స్‌ కంపెనీతో ముందు చేసుకున్న ఒప్పందం ఏమైంది?, ఆ కంపెనీ ఎందుకు పెట్టుబడి పెట్టలేదని మాత్రమే మేం అడుగుతున్నామన్నారు. తమ ప్రభుత్వం ఎక్కడా అవినీతికి తావు లేకుండా, చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు. స్కిల్‌ కుంభకోణంలో అధికారుల ప్రమేయం ఉంటే.. వారిపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కేబినెట్‌ నిర్ణయం ఒక సమష్టి బాధ్యత అని, అయితే ఆ నిర్ణయం వెనక జరిగే లావాదేవీలు… ఆ నిర్ణయం అమలులో అవకతవకలు, అందులో జరిగే అవినీతికి మంత్రివర్గం బాధ్యత వహించబోదన్నారు. ఎవరు అందులో భాగస్వాములుగా ఉంటే, వారే పూర్తిగా బాధ్యులవుతారని, ఇదీ నియమమని నొక్కిచెప్పారు. రాష్ట్రంలో అవసరమైన మేరకు టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తున్నామని, సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌కు అనుగుణంగా నియామకాలు చేపడుతున్నామని వెల్లడిరచారు. సీపీఎస్‌ స్థానంలో జీపీఎస్‌ తెచ్చామని, అవకాశం ఉన్నంత మేరకు ఉద్యోగులకు మేలు జరిగేలా చూశామన్నారు. ఓపీఎస్‌, సీపీఎస్‌ రెండూ ముగిసిపోయిన అంశాలని… ఇప్పుడున్నదల్లా జీపీఎస్‌ ఒక్కటేనని స్పష్టంచేశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి, తన ఉనికి కోసమే మద్యం విక్రయాలపై మాట్లాడుతున్నారంటూ మంత్రి బొత్స ఎద్దేవా చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img