. దేశంలోనే అత్యధిక ధరలు
. పార్లమెంటు సాక్షిగా కేంద్రం ప్రకటన
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఏపీలో పెట్రోలు, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. దేశంలోనే అత్యధిక ధరలకు ఇక్కడ విక్రయిస్తున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా వెల్లడిరచింది. పెట్రోలు, డీజిల్ ఇతర పెట్రోలియం ఉత్పత్తులను దేశమంతా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉందా ? అని రాజస్థాన్‌కు చెందిన ఎంపీ రాహుల్ కశ్వాన్ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్‌దీప్ సింగ్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. దేశవ్యాప్తంగా చమురు ధరల విధానం ఇప్పటివరకు ఒకేలా లేదని, రాష్ట్రాల్లో పన్నుల ఆధారంగా రకరకాల రేట్లు అమలవుతున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా జులై 18వ తేదీ వరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల రాజధాని నగరాలు, ముఖ్యపట్టణాల్లో ఉన్న పెట్రోలు, డీజిల్ ధరల వివరాలను వెల్లడిరచారు. ఏపీలో రిఫరెన్స్ సిటీగా అమరావతిని పేర్కొంటూ ధరలు సేకరించింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా పెట్రోలు, డీజిల్ ధరలను మంత్రి సభ ముందుంచారు. దాని ప్రకారం అమరావతిలో లీటరు పెట్రోలు ధర రూ.111.87 పైసలుండగా, డీజిల్ ధర రూ.99.61గా ఉన్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉండటం విశేషం. డీజిల్ ధరల్లో మాత్రం లక్షద్వీప్ లీటరు రూ.103.08పైసలతో తొలిస్థానంలో నిలవగా, ఏపీ రూ.99.61పైసలతో రెండో స్థానంలో ఉంది. రూ.98.53పైసలతో కేరళ తృతీయ, రూ.97.82పైసలతో తెలంగాణ రాష్ట్రం నాల్గవస్థానంలో ఉన్నాయి. అలాగే పెట్రోలు ధరలో ఏపీ ప్రథమస్థానంలో ఉండగా, రూ.109.73పైసలతో కేరళ ద్వితీయ, రూ.109.66 పైసలతో తెలంగాణ తృతీయ, రూ.108.65పైసలతో మధ్యప్రదేశ్ నాల్గవస్థానంలో ఉన్నాయి. పెట్రోలు అత్యల్పంగా కేంద్రపాలిత ప్రాంతమైన అండమాన్, నికోబార్ దీవుల్లో రూ.84 ఉండగా, మిజోరాం రాష్ట్రంలో లీటరు రూ.95.88పైసలకు విక్రయిస్తున్నారు. డీజిల్ కూడా దేశంలో అతి తక్కువ ధరలతో అరుణాచల్ ప్రదేశ్ రూ.82.2పైసలు, మిజోరాం రూ.82.27పైసలకు విక్రయిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు.