Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాజకీయ కక్షసాధింపు

అధికార దుర్వినియోగం ఆపండి
పార్లమెంటు సహా దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ శ్రేణుల నిరసనలు
కొన్నిచోట్ల ఉద్రిక్తత: రాస్తా`రైల్‌రోకోలు
జంతర్‌మంతర్‌ వద్ద తోపులాట
ఏఐసీసీ, సీడబ్ల్యూసీ సభ్యుల సామూహిక అరెస్టులు
బెదిరింపులకు తలొగ్గబోమని నాయకుల స్పష్టీకరణ

న్యూదిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్‌ అభియోగాలపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారించడాన్ని ఆ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రతీకార చర్యలకు దిగిందంటూ ఆరోపించింది. కాంగ్రెస్‌ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ‘ఈడీ దుర్వినియోగాన్ని ఆపండి’ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. దేశవ్యాప్తంగానూ కాంగ్రెస్‌ శ్రేణులు భారీస్థాయిలో నిరసనలు, రాస్తారోకాలు, రైల్‌రోకోలు చేపట్టారు. కొన్నిచోట్ల వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దిల్లీ ఏఐసీసీ కార్యాలయం పోలీసు కంటోన్మెంట్‌ను తలపించింది. జంతర్‌ మంతర్‌ వద్ద పోలీసులకు, కాంగ్రెస్‌ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలు బారికేడ్లను ధ్వంసం చేశారు. నిరసనల కు దిగిన కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పవన్‌ ఖేరా, పి.చిదంబరం, జైరాం రమేశ్‌, వివేక్‌ తంఖా, అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌, శశి థరూర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. తమను పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళుతున్నారని, మరో రెండు బస్సులను ఎంపీలు, పార్టీ సహచరులతో నింపారని, ప్రభుత్వం అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని, నిరంకుశంగా వ్యవహరిస్తోందని శశిథరూర్‌ మండిపడ్డారు. దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు దుర్వినియోగం చేస్తోందని, ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు నశించిందని సచిన్‌ పైలట్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. విపక్షాన్ని లక్ష్యంగా చేసుకొని కేంద్రం నెగ్గలేదని చెప్పారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలంతా సోనియాగాంధీ పక్షానే ఉన్నారని, కేంద్రం ఎంత ప్రయత్నించినా వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించలేదన్నారు. కాంగ్రెస్‌ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకే ఈడీ విచారణ అని, ప్రతిపక్షాల గళాన్ని అణచివేసేందుకు, ప్రజల వ్యక్తిత్వాన్ని ఖూనీ చేయడమే కేంద్రం లక్ష్యమని దుయ్యబట్టారు. రాజకీయంగానే కాకుండా ప్రజాపోరాటాలు చేస్తామని, కేంద్రప్రభుత్వ బాగోతాలను బట్టబయలు చేస్తామని పైలట్‌ అన్నారు. ఎలాంటి ఎఫ్‌ఐఆర్‌లు, నేరాలు లేవు.. లావాదేవీలు జరగలేదు.. మరి లాండరింగ్‌ కేసు ఎలా? అంటూ ప్రశ్నించారు. ‘వాళ్లు పోలీసు కంటోన్మెంట్‌ను సృష్టించారు. బలప్రయోగం చేస్తున్నారు. అధికారాన్ని దుర్వినియోగిస్తున్నారు’ అని కాంగ్రెస్‌ కేంద్రకార్యాలయం చుట్టూ పోలీసుల మోహరింపును ఉద్దేశించి పైలట్‌ అన్నారు. ఇది ఒక పార్టీ లేక ఒక నేతకు సంబంధించినది కాదు.. మొత్తం ప్రజాస్వామిక వ్యవస్థలకు సంబంధించినది..వాటిని నిర్వీర్యం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
సోనియాగాంధీకి సంఫీుభావంగా పార్టీ ఎంపీలు, సీడబ్ల్యూసీ సభ్యులు గురువారం ఏఐసీసీ కేంద్ర కార్యాలయం వద్ద సామూహిక అరెస్టు అయ్యారని జైరాం రమేశ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడిరచారు. మల్లికార్జున ఖర్గే స్పందిస్తూ అనేక ఒడిదుడుకులను సోనియాగాంధీ ధైర్యంగా ఎదుర్కొన్నారని, ఈ పోరాటంలోనూ విజేతగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. మోదీ ప్రభుత్వం ఆమెను భయపెట్టలేదని ట్వీట్‌ చేశారు. దేశంలో శాంతియుత సత్యాగ్రహంపైనా నిషేధం ఉందని వివేక్‌ తంఖా వ్యాఖ్యానించారు. తనతో పాటు అరెస్టు అయిన నేతలు బస్సులో ఉన్న ఫొటోను పోస్టు చేశారు. దిల్లీ పోలీసులు ఉదయం నుంచి కేంద్ర హోంశాఖ ఆదేశాలను అమలు చేస్తున్నారని, కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలోకి మీడియాను అనుమతించడం లేదని, ఇటువంటి నిరంకుశత్వాన్ని మోదీ సర్కార్‌ నుంచే ఆశించవచ్చని జైరాం రమేశ్‌ మరొక ట్వీట్‌లో పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కంటే ఈడీ ఉన్నతమైనది కాదని పి.చిదంబరం అన్నారు. ఈడీ కోరుకునే దర్యాప్తును సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోదన్నారు. ఇటువంటి బెదిరింపులకు కాంగ్రెస్‌ తలొగ్గబోదన్నారు. తమను ఇరుకున పెట్టారని భావించిన ప్రతీసారి దర్యాప్తు సంస్థల అస్త్రాన్ని కేంద్రప్రభుత్వం ప్రయోగిస్తుందని పవన్‌ ఖేరా విమర్శించారు. విపక్ష రహిత దేశమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పార్టీ నాయకత్వం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే వీరి లక్ష్యం, మునుపెన్నడూ ఒక నేతను ఐదు రోజుల పాటు విచారించలేదని రాహుల్‌ను ఈడీ విచారించడాన్ని ఉద్దేశించి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. దేశంలో రెండు చట్టాలు ఉన్నాయని, అందులో ఒకటి బీజేపీకి…మరొకటి విపక్షాల కోసమని వ్యాఖ్యానించారు. దీనికంటే చవకబారు చర్యలు, సిగ్గుచేటు ఏమీ ఉండదని విమర్శించారు.
మోదీ సర్కార్‌పై పోరు ఉధృతం: 13 విపక్షాల ఐక్యప్రకటన
దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై కఠినమైన ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని 13 ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. ప్రజావ్యతిరేక మోదీ సర్కార్‌పై పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని సీపీఐ, సీపీఎం, డీఎంకే, ఎన్‌సీ, టీఆర్‌ఎస్‌, ఎండీఎంకే, ఎన్‌సీపీ, శివసేన, ఐయూఎంఎల్‌, జేకేఎన్‌సీ, వీసీకే, ఆర్జేడీ, ఆర్‌ఎస్‌పీ ఐక్యంగా ప్రకటించాయి. మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ పార్టీల ప్రముఖ నేతలను ఉద్దేశపూర్వకంగా వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించాయి. ‘మోదీ సర్కార్‌ తన రాజకీయ ప్రత్యర్థులు, విమర్శకులపై దర్యాప్తు సంస్థలను అస్త్రంగా వాడుతూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోంది. పార్టీల నేతలను లక్ష్యంగా చేసుకొని వేధిస్తోంది. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. సమసమాజ నిర్మాణాన్ని నాశనం చేస్తున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. ప్రజలు, రైతులు, రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేపడుతున్న చర్యలను ఐక్యంగా ప్రతిఘటిస్తాం’ అని ప్రతిపక్షాల ఉమ్మడి ప్రకటన పేర్కొంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో విపక్షాల నేతల భేటీ అనంతరం ఈ ప్రకటన వెలువడిరది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img