. 1400 ఎకరాలు అదానీకి…. రూ.1400 కోట్లు జగన్‌కు
. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి ఎసరు పెట్టేందుకే అదానీతో జగన్ భేటి
. బీజేపీతో కలిసే విషయంపై చంద్రబాబు, పవన్ ఆలోచించాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విశాలాంధ్ర – విజయవాడ : విశాఖపట్నంలో 19,703 ఎకరాల్లో విస్తరించి ఉన్న విశాఖ స్టీల్ ప్యాక్టరీలో 1400 ఎకరాలు అమ్మాలని కేంద్రం నిర్ణయించిందని, దాన్ని దక్కించుకోవటానికే అదానీ సీఎం జగన్‌తో భేటీ అయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. ఇక్కడి దాసరి భవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్లాంట్‌లో ఉన్న భూములను విక్రయించాలని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ అమిత్‌గుప్తాకు కేంద్రం బాధ్యతలు ఇచ్చిందన్నారు. ఆ భూములను దక్కించుకోవటానికి అదానీ సీఎం జగన్‌తో సమావేశం అయ్యారన్నారు. ఈ వ్యవహారంలో భారీ దోపిడీ జరుగుతోందని విమర్శించారు. అదానీ, జగన్ భేటి సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రిగాని, అధికారులుగాని లేరన్నారు. పక్కా దోపిడీ వ్యవహారం కావటంతో ఆ భేటీ వివరాలను రహస్యంగా ఉంచుతున్నారని స్పష్టం చేశారు. భూములు తీసుకున్న అదానీ క్విడ్‌ప్రోకో ద్వారా జగన్‌మోహన్‌రెడ్డికి రూ.1400 కోట్లు ఇవ్వనున్నారని ఆరోపణలొస్తున్నాయన్నారు. సింగిల్ డీల్‌తో పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుని, వాటితో ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం జగన్ సిద్ధమవుతున్నారని చెప్పారు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేయటానికే ప్రైవేటీకరణ వాయిదా వేయించినట్లు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించటం ‘దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగిన’ చందంగా ఉందన్నారు. వెయ్యి రోజుల నుంచి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ ఉద్యమం జరుగుతుంటే ఇన్నాళ్లూ జీవీఎల్ చోద్యం చూశారా? అని ప్రశ్నించారు. జగన్, అదానీ మధ్యలో జీవీఎల్ రహస్య భేటీలో ఉన్నారని పేర్కొన్నారు. విండ్ పవర్, సోలార్ పవర్, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు అన్నీ అదానీకి దోచిపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ, అమిత్ షా, అదానీ, జగన్ కలిసి ఈ దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు.
స్మార్ట్ మీటర్లు ధరపై సీఎం సమాధానం చెప్పాలి
రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిదన్నారు. ఈ స్మార్ట్‌మీటర్ల ధర చండీగఢ్‌లో రూ.7,100, మద్యప్రదేశ్‌లో రూ.7,900 ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో రూ.36,970 ఎలా అయ్యిందని నిలదీశారు. ఈ ధరలపై విద్యుత్ శాఖ మంత్రి, అధికారులు ఎవరూ సమాధానం చెప్పటం లేదన్నారు. కడపలో తన బినామీ కంపెనీ అయిన షిర్టిసాయి ఎలక్ట్రికల్స్ అదాని కంపెనీతో ఒప్పందం చేసుకుని వారి ద్వారా దోచుకున్న డబ్బును తాడేపల్లి ప్యాలెస్‌కు తరలించేందుకు చూస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ధరపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్‌ను సాగనంపటమే లక్ష్యం:
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లౌకిక రాజ్యానికి విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదన్నారు. అంగన్‌వాడీల నుంచి ప్రజాసంఘాల నాయకులు, ప్రతిపక్ష నేతల గొంతు నొక్కేస్తున్నారని చెప్పారు. ఈ అంశాలపై రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు స్పందించాలని కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రంలో మోదీని ఇంటికి పంపించటం, రాష్ట్రంలో జగన్‌ను సాగనంపటమే లక్ష్యంగా సీపీఐ ముందుకు వెళుతుందన్నారు. మోదీ, అమిత్ షా సహకారం లేనిదే చంద్రబాబును అరెస్టు చేయటం జరగదన్నారు. కేంద్రం సహకారం లేకుండా బెయిల్‌పై ఉన్న సీఎం జగన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేయించలేరని చెప్పారు. కమ్యూనిస్టులు అమ్ముడుబోయారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన సొంత ఆలోచన కాదని వాళ్ల మాస్టర్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్లుగానే తాము భావిస్తున్నామన్నారు. బీజేపీతో కలిసి వెళ్లాలని భావిస్తున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ మరోసారి ఆలోచించాలని సూచించారు. బీజేపీతో కలిసి వెళ్లే ఏ పార్టీని రాష్ట్ర ప్రజలు ఆదరించరని రామకృష్ణ స్పష్టం చేశారు. కేంద్రంలోని మోదీని, రాష్ట్రంలో జగన్‌ను గద్దెదించే లక్ష్యంతో పని చేస్తున్న తమతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకుని ముందుకెళతామని చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, గుజ్జుల ఈశ్వరయ్య, అక్కినేని వనజ పాల్గొన్నారు.