Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేసిన లోక్‌సభ

ఆరేళ్ల పాటు పోటీ చేసేందుకు కూడా నో ఛాన్స్!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో ఝలక్. ఆయన ఎంపీ కొనసాగడానికి అనర్హుడని లోక్ సభ ప్రకటించింది. పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడ్డ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేస్తూ లోక్ సభ సెక్రటేరియట్ శుక్రవారం (మార్చి 24) ప్రకటన విడుదల చేసింది. దీంతో పాటు రాహుల్ ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోతారు. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. త్వరలో జరగనున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ.. రాహుల్ గాంధీని కావాలనే చిక్కుల్లో పడేశారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నేడు సాయంత్రం 4 గంటలకు పార్టీ ముఖ్య నేతలందరూ సమావేశం కానున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్‌లోని అమేథి, కేరళలోని వయనాడ్‌ నియోజకవర్గం నుంచి లోక్‌ సభకు పోటీ చేసిన రాహుల్ గాంధీ.. అమేథిలో స్మృతి ఇరానీ చేతిలో ఓటమి పాలయ్యారు. వయనాడ్ నుంచి గెలుపొంది ఇంతకాలం ఎంపీగా కొనసాగారు. అనర్హత వేటు వార్తల మధ్యే రాహుల్ నేడు ఉదయం పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగిన పార్టీ ఎంపీల సమావేశానికి హజరయ్యారు. అనంతరం లోక్‌సభ ప్రారంభం కాగానే ఆ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత కాసేపటికే ఈ ప్రకటన వచ్చింది.

ఏమిటీ కేసు?
2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కర్ణాటకలోని కోలార్‌లో నిర్వహించిన సభలో రాహుల్‌ గాంధీ ప్రసంగిస్తూ దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో.. అని వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ.. సూరత్‌ న్యాయస్థానంలో దీనిపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై నాలుగేళ్లుగా విచారణ జరిపిన న్యాయస్థానం.. గురువారం ఆయణ్ని దోషిగా తేల్చి, శిక్ష విధించింది.

రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఇదే సమయంలో, ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు అవకాశం కూడా ఇచ్చింది. ఈ మేరకు శిక్ష తక్షణం అమల్లోకి రాకుండా 30 రోజుల పాటు నిలుపుదల చేసింది.ప్రజాప్రాతినిధ్య చట్టం – 1951 ప్రకారం.. పార్లమెంటు సభ్యులు ఏదైనా కేసులో దోషిగా తేలి, కనీసం రెండేళ్ల శిక్ష పడితే అనర్హతకు గురవుతారు. ఈ నేపథ్యంలో సూరత్‌ కోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకొని లోక్‌సభ సెక్రెటేరియట్‌ రాహుల్‌ గాంధీపై అనర్హత వేటు వేసే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే, ఆయనకు అప్పీలు చేసుకునేందుకు నెల రోజుల సమయం ఉండటంతో ఈ నిర్ణయం వెంటనే తీసుకోకపోవచ్చని అనుకున్నారు. కానీ, సూరత్ కోర్టు తీర్పు వెలువరించి 24 గంటలు గడవక ముందే లోక్ సభ సెక్రటేరియట్ నుంచి ప్రకటన రావడం కాంగ్రెస్ పార్టీని షాక్‌కు గురిచేసింది.

ఇది ప్రణాళిక ప్రకారమే జరిగిందనే వార్తలను బీజేపీ నేతలు ఖండించారు. నేర నిరూపణ అయితే, ఎంపీలు తమ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుందని సుప్రీం కోర్టు గతంలో తీర్పు చెప్పిందని గుర్తు చేస్తున్నారు. ఈ ఏడాది ఇలా అనర్హత వేటుకు గురైంది రాహుల్ గాంధీ ఒక్కరే కాదని, లక్షద్వీప్‌కు చెందిన ఎన్‌సీపీ ఎంపీ మొహమ్మద్‌ ఫైజల్‌ కూడా ఇలాగే అనర్హతకు గురయ్యారని చెబుతున్నారు. ఓ హత్యాయత్నం కేసులో మొహమ్మద్‌ ఫైజల్‌‌ను స్థానిక కోర్టు దోషిగా తేల్చిన నేపథ్యంలో.. ఆయణ్ని అనర్హుడిగా ప్రకటిస్తూ లోక్‌సభ సెక్రెటేరియట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, సెషన్స్‌ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎంపీ ఫైజల్‌.. కేరళ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆ తీర్పు అమలును నిలిపివేసింది. దీంతో ఆయన ఎంపీ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర న్యాయశాఖ సిఫార్సు చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img