ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు వర్ష సూచన
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడి
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో గత పక్షం రోజులుగా మండే ఎండలు, దానికి తోడు ఉక్కపోతకు గురవుతున్న ప్రజలకు వాతావరణశాఖ ఉపశమనం కల్పించే వార్త అందించింది. వర్షాధారిత పంటలు పండిరచే రైతులకు ఇది శుభవార్తే. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణతో పాటు, ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది. గురువారం సాయంత్రం వాతావరణం మారింది. అక్కడక్కడా వర్షాలు పడ్డాయి. పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. శుక్రవారం శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడిరచింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ఏడాది బంగాళాఖాతంలో అల్పపీడనాలకు అనువైన వాతావరణం లేకపోవడంతో పాటు నైరుతి రుతుపవనాలు బలహీనపడటం వల్ల రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దానివల్లే పశ్చిమ వాయువ్యం నుంచి గాలులు వీస్తుండటంతో పొడి వాతావరణం నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతుపవనాలు బలహీనంగా మారాయి. కొన్ని జిల్లాల్లో ఆగస్టులో ఒక్కరోజు కూడా చినుకు పడలేదు. పగలు మూడు నుంచి ఆరు డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈనెల 18వ తేదీన ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.