నాలుగు పేజీల లేఖ పంపిన మదన్‌మోహన్
విజయసాయి, సుభాష్‌రెడ్డికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని డిమాండ్
వారిపై ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని అభ్యర్థన
దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, ఆమె భర్త మదన్‌మోహన్ వివాదం రాష్ట్రపతికి చేరింది. మొన్న ఢిల్లీ వెళ్లిన మదన్‌మోహన్.. నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌లకు లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు. అగ్రకులానికి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, ప్రభుత్వ మాజీ న్యాయవాది సుభాష్‌రెడ్డి తమ అధికార, ధన, కండబలాన్ని ఉపయోగించి తన భార్యను లోబరుచుకొని ఆమెతో సంబంధం పెట్టుకొని చట్ట వ్యతిరేకంగా బిడ్డను కన్నారని ఆరోపిస్తూ నాలుగు పేజీల లేఖను వారికి పంపారు.
తన భార్యతో సంబంధం పెట్టుకోవడం ద్వారా ఎస్టీగా తన హక్కులను హరించారని మదన్‌మోహన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. తన వైవాహిక జీవితాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వారా తన హక్కులను హరించిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, వారికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి తన భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రెవరో తేల్చాలని డిమాండ్ చేశారు.
వారి అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన తనను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని, తన భార్య శాంతి కూడా తనను బెదిరిస్తోందని మదన్ ఆరోపించారు. ఆమెకు బ్యూరోక్రాట్లతోపాటు అసాంఘిక శక్తులతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తన భార్య, విజయసాయిరెడ్డి, సుభాష్‌రెడ్డి ముగ్గురూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటున్నారని, కాబట్టి వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అధికారం తాడేపల్లి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోకు ఉందని, కాబట్టి ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలని మదన్‌మోహన్ ఆ లేఖలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కోరారు.