Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

బోగస్‌ ఓట్ల రగడ

. సీఈసీకి టీడీపీ, వైసీపీ పోటాపోటీ ఫిర్యాదులు
. 15 లక్షల ఓట్లు తారుమారు చేశారన్న చంద్రబాబు
. టీడీపీ హయాంలోనే దొంగ ఓట్లు చేర్చారన్న వైసీపీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో బోగస్‌ ఓట్ల వివాదం దిల్లీకి చేరింది. ఈ అంశంపై సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీలు పోటాపోటీగా భారత ఎన్నికల ప్రధాన కమి షన్‌ను కలిసి ఫిర్యాదులు చేశారు. తొలుత చంద్రబాబు కలిసి సాక్ష్యాధారాలతో కూడిన సీడీని సీఈసీకి అందజేశారు. సుమారు గంట సేపు అయిన ఈ భేటీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ఓట్ల అక్రమాలను వివరించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ సీఈసీతో పాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లను, ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్‌లను ఏపీలో పర్యటించాలని కోరామని వెల్లడిరచారు. రాష్ట్రంలో ఓట్ల అవకతవకలపై ఉన్నతస్థాయి కమిటీ నియమించాలని విజ్ఞప్తి చేశామ న్నారు. నిబంధనలు ఉల్లంఘించే పార్టీలను రద్దు చేసే అధికారం ఈసీకి ఉందని చంద్రబాబు తెలిపారు. ఏపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొందని, కేవలం ఒక పార్టీకి చెందిన ఓట్లను తొలగించే ఆలోచన రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరికీ రాలేదని అన్నారు. ఓటర్ల తొలగింపుపై సాక్ష్యాధారాలతో సహా చాలాసార్లు పోరాడా మని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాలుగు న్నరేళ్లలో నాలుగైదు ఎన్నికలు జరిగాయని, అన్నింటి లోనూ పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్నారు. ఒక పార్లమెంటు ఉప ఎన్నిక జరిగితే పెద్ద సంఖ్యలో బోగస్‌ ఓటరు కార్డులు ముద్రించారని ఆరోపించారు. ఎక్కడి కక్కడ ఇష్టానుసారం ఓట్లేస్తుంటే రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకు న్నామని, అయినప్పటికీ చర్యలు తీసుకోలేకపోయారని పేర్కొన్నారు. సచివాలయం అనే ఒక వ్యవస్థను తీసుకు వచ్చారని, దీనిలో నియమించకున్న లక్షా 30 వేల మందికి బీఎల్వో విధులు, ఎన్నికల విధులు కేటాయి స్తున్నారని ఆరోపించారు. ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున నియమించిన వలంటీర్ల సాయంతో డేటా సేకరించి ప్రైవేటు ఏజెన్సీకి పంపిస్తున్నారని చెప్పారు. ఆ సేకరించిన సమాచారం ద్వారా టీడీపీ, ఇతర పార్టీల ఓటర్లను గుర్తించి తొలగిస్తున్నా రని మండిపడ్డారు. వీటన్నింటినీ ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని, బీఎల్వోలు ఇంటింటికి వెళ్లకుండా వలంటీర్లే ఇంటింటికీ వెళ్లి ఓటర్ల గణన చేపడుతున్నారని చెప్పారు. దొంగ ఓట్లు చేర్చడం, ఉన్న ఓట్లు తొలగించడం, చనిపోయినవారిని జాబితాలో చేర్చడం, ఇలా 15 లక్షల ఓట్లను తారుమారు చేసినట్టు సాక్ష్యాధారాలతో సహా ఓ సీడీ రూపంలో ఈసీకి అందజేశామని వివరించారు. ఉరవకొండలో పీఏసీ చైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ గట్టిగా పోరాడటంతో ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేశారని, ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసినంత మాత్రాన ఓట్ల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావించడం లేదని, ఎన్నికలకు ముందే ఈ అక్రమాలను సరిదిద్దాలని కోరామని తెలిపారు.
టీడీపీ హయాంలోనే దొంగ ఓట్లు: విజయసాయిరెడ్డి
రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి అధ్వర్యంలో వైసీపీ ప్రతినిధులు కూడా చంద్రబాబు భేటీ తర్వాత సీఈసీని కలిశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2015 నుండి చంద్రబాబు దొంగ ఓట్లు చేర్చారని ఆరోపించారు. ఈసీ రూల్స్‌ను తుంగలో తొక్కారని, ఇంటి నెంబర్లు, పేర్లను టీడీపీ హయాంలో ఎలా మేనేజ్‌ చేశారో ఈసీకి వివరించామని చెప్పారు. సేవా మిత్ర, మై టీడీపీ యాప్‌ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఈసీకి అందజేసినట్లు వెల్లడిరచారు. ఓటర్‌ ప్రొఫైలింగ్‌కు పాల్పడ్డారని, ఇది నేరపూరిత చర్య అన్నారు. ఆధార్‌ కార్డుకు ఓటర్‌ కార్డు లింక్‌ చేస్తున్నారనేదే చంద్రబాబు బాధ అన్నారు. ఒలింపిక్స్‌లో దొంగ ఓట్ల పోటీ పెడితే చంద్రబాబు కచ్చితంగా విజయం సాధిస్తారని ఎద్దేవా చేశారు. ఒక వ్యక్తికి ఒక చోటే ఓటు ఉండాలని, పారదర్శకంగా ఉండాలనేదే వైసీపీ విధానమని స్పష్టం చేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు తమ ఓట్లను ఎలా తొలగించారో, మోసపూరిత ఓట్లను ఎలా చేర్చారో కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించామన్నారు. 2019లో 3,98,34,776 మంది ఓటర్లుండగా ప్రస్తుతం 3,97,96, 678 ఓట్లు ఉన్నాయని, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని, ప్రతి ఓటును ఆధార్‌కార్డుకు జత చేయాలని, ఎన్నికలు నిష్పాక్షింగా జరిపేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img