బాంగ్లాదేశ్ లో ఏర్పడిన సంక్షోభం కారణంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి..భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. అవామీ లీగ్ ప్రభుత్వం గద్దెదిగినా కూడా పరిస్థితులు అదుపులోకి రావటం లేదు. అల్లరిమూకల స్వైరవిహారంతో కేవలం 72గంటల వ్యవధిలోనే 232మంది చనిపోయారు. కోటాకు వ్యతిరేకంగా 20రోజులపాటు జరిగిన అల్లర్లలో కలిపి ఇప్పటివరకు 560 మంది మృతి చెందారు. మరోవైపు ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరిగిన వెంటనే మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తారని ఆమె కుమారుడు తెలిపారు. నోబెల్ బహుమతి గ్రహీత మొహమ్మద్ యూనుస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉన్న హసీనా కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ మాట్లాడుతూ.. తన తల్లి ప్రస్తుతం ఇండియాలో ఉన్నదని, ఎన్నికలు నిర్వహించేందుకు ఎప్పుడు కొత్త సర్కారు సిద్ధంగా ఉంటే అప్పుడు ఆమె స్వదేశం వెళ్తుందన్నారు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన సర్కారులో హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ సభ్యులు ఎవరూ లేరు. ప్రస్తుతం హసీనా ఢిల్లీలో ఓ సురక్షితమైన ఇంట్లో ఉంటున్నారు. బ్రిటన్‌లో ఆశ్రయం పొందాలని ఆమె భావించినా, ఆమె అభ్యర్థనను ఆ దేశం తిరస్కరించినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ విషయం గురించి బ్రిటన్ సర్కారుతో మాట్లాడినట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. అయితే ఆయన పూర్తి వివరాలను వెల్లడించలేదు.