Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

మహాకూటమికి ముందడుగు

. మరో ఎనిమిది పార్టీల మద్దతు బ 23కి చేరిన సంఖ్యా బలం
. బీజేపీని గద్దె దించడమే లక్ష్యం

న్యూదిల్లీ/జమ్ము : కేంద్రంలో మోదీ నేతృత్వంలోని ప్రజా వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల, మతతత్వ, నియం తృత్వ పోకడల బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘మహా కూటమి’ ఏర్పాటులో విపక్ష పార్టీలు ముందడుగు వేశాయి. ఇప్పటికే బీహార్‌ కేంద్రంగా విపక్ష నేతలు భేటీ అయి కేంద్రం విధానాలను తూర్పారపడుతూ ఐక్యతను చాటారు. మరో ముందడుగుగా, బెంగళూరులో జరిగే విపక్షాల మహాకూటమిలో చేరేందుకు కొత్తగా ఎనిమిదికి పైగా పార్టీలు ముందుకు వచ్చాయి. ఈ పార్టీలన్నీ బీజేపీ వ్యతిరేక కూటమి వెంట ఉంటామంటూ మద్దతు ప్రకటించాయి. విపక్షాల మహాకూటమికి కొత్తగా మద్దతు ప్రకటించిన పార్టీలలో మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం, కొంగు దేశ మక్కల్‌ కట్చి, విడుదలై చిరుతైగళ్‌ కట్చి, రివల్యూషనరీ సోషలిస్ట్‌ పార్టీ, ఆల్‌ ఇండియా ఫార్వాడ్‌ బ్లాక్‌, కేరళ కాంగ్రెస్‌ (జోసెఫ్‌), కేరళ కాంగ్రెస్‌ (మణి), ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ ఉన్నాయి. ఎన్‌సీ నేత ఒమర్‌ అబ్దుల్లా ప్రతిపక్ష నేతల తదుపరి సమావేశానికి హాజరవుతున్నట్లు ప్రకటించారు. కాగా, గత జూన్‌లో బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ సారథ్యంలో పాట్నాలో జరిగిన విపక్షాల సమావేశంలో 15 పార్టీలు పాల్గొనగా, కాంగ్రెస్‌ పార్టీ సారథ్యంలో ఈనెల 17,18 తేదీల్లో బెంగళూరులో తలపెట్టిన విపక్షాల సమావేశంలో 23 పార్టీలు పాల్గొంటాయని అంచనా వేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై కలిసికట్టు పోరాటంలో భాగంగా ప్రతిపక్షాల ఐక్య కూటమి కోసం బెంగళూరులో జరగనున్న ఐక్యతా సమావేశంలో పాల్గొనాలని ప్రతిపక్ష పార్టీ నేతలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖడ్గే మంగళవారం ఆహ్వానించారు. ఈ మేరకు విపక్ష నేతలకు ఆయన లేఖ రాశారు. జూన్‌ 23న నితీశ్‌ నేతృత్వంలో పాట్నాలో జరిగిన సమావేశంలో విపక్ష నేతలు పాల్గొన్న విషయాన్ని ఈ లేఖలో ఆయన గుర్తు చేశారు. ‘ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమిస్తున్న అనేక అంశాలతో పాటు ఇతర కీలక విషయాలను సమావేశంలో చర్చించాం. రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఐక్యంగా ఎదుర్కోవాలని ఏకగ్రీవంగా తీర్మానించడం ద్వారా పాట్నా సమావేశం విజయవంతమైంది’ అని ఆ లేఖలో ఖడ్గే పేర్కొన్నారు. జులైలో మరోసారి సమావేశం కావాలని కూడా నిర్ణయించిన విషయాన్ని విపక్ష నేతలకు ఆయన గుర్తు చేశారు. ఈ చర్చలు కొనసాగించడం, దీనికి ఒక ఊపు తీసుకురావడం ముఖ్యమని, దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఒక పరిష్కారాన్ని కనుగొనేందుకు సమష్టిగా పని చేయవలసిన అవసరం ఉందని ఖడ్గే అన్నారు. ఇందుకు అనుగుణంగా బెంగళూరులో జులై 17వ తేదీ సాయంత్రం 6 గంటలకు సమావేశం, అనంతరం డిన్నర్‌ ఉంటుందని, జులై 18వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకు తిరిగి సమావేశం కొనసాగుతుందని ఖడ్గే వివరించారు. బెంగళూరులో జరిగే సమావేశాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పాట్నాలో జరిపిన విపక్షాల తొలి సమావేశానికి ఖడ్గే, సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌ తదితరులు పాల్గొన్నారు. బీజేపీని ఓడిరచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించగా, బెంగళూరులో జరిగే రెండు రోజుల సమావేశంలో ఇందుకు సంబంధించి ఒక కార్యచరణ రూపొందించనున్నట్లు తెలుస్తోంది.
బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహం: ఒమర్‌ అబ్దుల్లా
బెంగళూరులో జరిగే ప్రతిపక్ష నేతల తదుపరి సమావేశానికి తమ పార్టీ హాజరవుతుందని నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా మంగళవారం తెలిపారు. ‘నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూక్‌ అబ్దుల్లాకు (జులై 17-18 తేదీల్లో జరిగే బెంగళూరు సమావేశానికి) ఆహ్వానం అందింది. దానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నాము. ఈ సమావేశంలో పార్టీ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారనేది ఇంకా నిర్ణయించలేదు’ అని అబ్దుల్లా ఇక్కడ విలేకరులతో అన్నారు. జూన్‌ 23న పాట్నాలో జరిగిన ప్రతిపక్ష పార్టీ నేతల సమావేశాన్ని ప్రస్తావిస్తూ… వచ్చే ఏడాది జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహం రచించాలన్నారు. జమ్ముకశ్మీర్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల మధ్య ఐక్యత ఏర్పడే అవకాశంపై వ్యాఖ్యానించడానికి అబ్దుల్లా నిరాకరించారు. ‘రాష్ట్ర స్థాయిలో వ్యూహం ఎలా అమలవుతుందో మాకు వదిలివేయాలి. పరిస్థితి ఎలా అభివృద్ధి చెందుతుందో, ఏమి చేయాలో మేము చూస్తాము. ఎన్నికల (జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల కోసం) బగల్‌ మోగలేదు. మీరు మా వ్యూహాన్ని ముందుగానే బహిరంగపరచాలని మీరు కోరుకుంటారు’ అని ఆయన అన్నారు. సమయం వచ్చినప్పుడు ఆ వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img