7-10 తేదీల్లో నిరసనలకు లెఫ్ట్ పిలుపు
న్యూదిల్లీ: పాలస్తీనియన్లపై మారణహోమాన్ని తక్షణం ఆపాలని వామపక్ష పార్టీలు విజ్ఞప్తి చేశాయి. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి, అమెరికా తక్షణ కాల్పుల విరమణను ప్రకటించాలని పలస్తీనియన్లపై ఇజ్రాయిల్ రక్షణ దళాల మారణహోమానికి ఆర్థిక సహాయం, ఆయుధాలు మద్దతును నిలిపివేయాలని డిమాండ్ చేశాయి. ఈ మేరకు సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఏఐఎఫ్‌బీ ప్రధానకార్యదర్శి జి దేవరాజన్, సీపీఐఎంఎల్ లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఆర్‌ఎస్‌పీ ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. భారత రక్షణ విదేశాంగ మంత్రులతో 2G2 మంత్రుల చర్చలకు హాజరయ్యేందుకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ భారతదేశానికి రానున్న నేపథ్యంలో ఈ నెల 7
10 తేదీల మధ్య నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. పలస్తీనియన్లపై అమెరికా-ఇజ్రాయిల్ మారణహోమానికి వంతపాడడం మానేయాలనీ, తక్షణ కాల్పుల విరమణ కోసం కృషిచేయాలని వామపక్షాలు మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. నిరసన కార్యక్రమాల ఏ రూపంలో నిర్వహించాలో వామపక్ష పార్టీల ఆయా రాష్ట్రాల శాఖలు నిర్ణయిస్తాయని తెలిపారు.