విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం విచారించే అవకాశం ఉంది. ఈనెల 22న హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను తిరస్క రించింది. సెక్షన్ 482 కింద దాఖలైన నేపథ్యంలో మినీట్రయల్ నిర్వహించలేమని పేర్కొంది. స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్న సీమెన్స్‌కు నిధుల విడుదలకు చంద్రబాబు సిఫార్సులపై స్పష్టత లేదని, దీనిపై నిపుణులతో చర్చ అవసరమని తెలిపింది. సీఐడీ దర్యాప్తు తుది దశలో ఉన్నందున జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ క్వాష్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో న్యాయవాది ప్రమోద్ కుమార్ 23వ తేదీన దాఖలు చేశారు. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా… భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్ ఎదుట ఈ కేసు ఉంచారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షాలను అణచివేస్తున్నారని సీజేఐ దృష్టికి తీసుకెళ్లారు. ఈనెల 8న చంద్రబాబు అరెస్ట్ అయినట్లు తెలిపారు.మంగళవారం మెన్షన్ లిస్ట్ ద్వారా రావాలని సిద్ధార్థ లూథ్రాకు సీజేఐ సూచించారు. చంద్ర బాబు క్వాష్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని, ఆయనను అన్యా యంగా రిమాండ్‌లో ఉంచారని న్యాయవాది విజ్ఞప్తి చేయగా అన్ని విషయాలు మంగళవారం వివరించేలా సీజేఐ సూచనలు చేశారు. ఏపీ ప్రభుత్వం తరపున హైకోర్టులో వాదించిన ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహత్గీ, సీఐడీ తరపున వాదించిన రంజిత్‌కుమార్ కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యారు.