Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

గర్భ విచ్ఛిత్తికి సుప్రీం అనుమతి

అత్యాచారం వల్ల తల్లవడం మాయని గాయమేనని వ్యాఖ్య
గుజరాత్‌ హైకోర్టు తీర్పుపై మండిపాటు

న్యూదిల్లీ: సామూహిక అత్యాచారానికి గురైన బాధిత మహిళ గర్భ విచ్ఛిత్తికి సంబంధించి గుజరాత్‌ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. వైవాహిక బంధానికి వెలుపల తన సమ్మతి లేకుండా బలవంతంగా గర్భం దాల్చడం కోలుకోలేని గాయం లాంటిదేనని, ఆ పరిస్థితి తీవ్ర మనోవేదనకు గురిచేస్తుందని వ్యాఖ్యానించింది. సామూహిక అత్యాచారానికి గురై, గర్భం దాల్చిన మహిళ తన 27 వారాల గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతించింది. ఈ సందర్భంగా బాధిత మహిళ కేసులో గుజరాత్‌ హైకోర్టు వ్యవహరించిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. మన వివాహ వ్యవస్థలో ఓ మహిళ తల్లి కావడమనేది ఆ దంపతులకే కాదు…వారి కుటుంబసభ్యులకూ అత్యంత సంతోషకరమైన విషయమని, కానీ, వివాహ బంధానికి వెలుపల తన సమ్మతి లేకుండా గర్భం దాల్చడం…ఆ మహిళ జీవితానికి హానికరమని సుప్రీం స్పష్టంచేసింది. ముఖ్యంగా అత్యాచారం కారణంగా గర్భం రావడం బాధిత మహిళను తీవ్ర వేదనకు గురిచేస్తుందని, ఇది ఆమె శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపింది. ఓ మహిళ లైంగిక దాడిని ఎదుర్కోవడమే అత్యంత బాధాకరమైతే… దాని ఫలితంగా ఆమె గర్భం దాల్చడం కోలుకోలేని గాయమే అవుతుందని జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో బాధిత మహిళ గర్భ విచ్ఛిత్తికి గుజరాత్‌ హైకోర్టు అనుమతించకపోవడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వెలిబుచ్చింది. బాధిత మహిళ వ్యథ, వైద్య రిపోర్టులను పరిగణనలోకి తీసుకుని ఆమె తన 27 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. మంగళవారమే ఆమె ఆసుపత్రిలో చేరాలని ఆదేశించింది. ఒకవేళ, విచ్ఛిత్తి ప్రక్రియ సమయంలో పిండం సజీవంగా ఉంటే… ఇంక్యుబేషన్‌లో పెట్టి సంరక్షించాలని సూచించింది. ఆ తర్వాత చట్టప్రకారం ఆ చిన్నారి సంరక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని స్పష్టంచేసింది.
బాధిత మహిళ తొలుత తన గర్భాన్ని విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతినివ్వాలని కోరుతూ ఈ నెల 7న గుజరాత్‌ హైకోర్టును ఆశ్రయించారు. 8న కోర్టు విచారణకు స్వీకరించి…వైద్య నివేదికకు ఆదేశించింది. 10న నివేదిక వచ్చింది. 11న నివేదిక అందినట్లు ధ్రువీకరించి కేసును 12 రోజులకు అంటే 23కు హైకోర్టు వాయిదా వేసింది. దీంతో బాధితురాలు సుప్రీంకోర్టుకు వెళ్లగా…గుజరాత్‌ హైకోర్టు తీరుపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌ను పెండిరగ్‌లో పెట్టడం ద్వారా విలువైన సమయం వృథా అయిందని సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై సోమవారం విచారణ చేపడతామని తెలిపింది. అయితే ఈ లోగానే, గత శనివారం గుజరాత్‌ హైకోర్టు విచారణ జరిపి మహిళ పిటిషన్‌ను కొట్టేసింది. దీనిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గుజరాత్‌ హైకోర్టులో ఏం జరుగుతోందని నిలదీసింది. అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులకు వ్యతిరేకంగా దేశంలో ఏ కోర్టూ తీర్పులు ఇవ్వకూడదని, ఇది రాజ్యాంగ ఫిలాసఫీకి విరుద్ధమని ధర్మాసనం ఘాటుగా స్పందించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img