Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

ఇంకా అందని పాఠ్యపుస్తకాలు

ఇంటర్‌ విద్యార్థుల ఇక్కట్లు
నిలిచిన ‘మధ్యాహ్న భోజనం’
అలంకార ప్రాయం… ఇంటర్‌ బోర్డు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో విద్యాప్రమాణాలు పెంచడానికి అద్భుత స్కంరణలు తీసుకొస్తున్నట్లు జగన్‌ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇంటర్‌ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాల సరఫరా లేదు. మధ్యాహ్న భోజనం అరకొరగా సాగుతోంది. దీంతో ఇంటర్‌ చదువుతున్న పేద విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇంటర్మీడియట్‌ బోర్డు నిధులను నాడు-నేడు, జగనన్న ఆణిముత్యాలకు ప్రభుత్వం మళ్లిస్తోంది. దీంతో ఇంటర్‌ పాఠ్యపుస్తకాల పంపిణీ నిలిచిపోయింది. పేద, బడుగు, బహీనవర్గాల విద్యార్థులకు ప్రభుత్వ విద్య దూరమవుతోంది. రాష్ట్రంలో 439 ప్రభుత్వ, 131 ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలున్నాయి. ప్రతి మండలానికి రెండు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు నీటి మూటలుగా మారనున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో మౌలిక సదుపాయాలు లేవు. ఉన్న కాలేజీలను చక్కదిద్దకుండా…మండలానికో రెండు జూనియర్‌ కళాశాలల వల్ల ప్రయోజనమేమిటని తల్లిదండ్రులు నిలదీస్తున్నారు. ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు పథకం ప్రకారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల నిర్వీర్యానికి కుట్ర చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేయడమే ఇందుకు నిదర్శనం. ఐఐటీ, నీట్‌ లాంటి పోటీ పరీక్షలకు శిక్షణపై దృష్టి పెట్టలేదు.
45 రోజులైనా పాఠ్యపుస్తకాలేవి?
ఈ ఏడాది విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఉచితంగా ఇవ్వలేమని ఇంటర్‌బోర్డు అధికారులు చెప్పేశారు. విద్యాసంవత్సరం ప్రారంభమై 45 రోజులైనా ఇంతవరకు ప్రభుత్వ జూనియర్‌, ఎయిడెడ్‌ కళాశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సరఫరా చేయలేదు. ఇంటర్‌ బోర్డులో ఉన్న రూ.126 కోట్లను నాడు-నేడు పనులకు, జగనన్న ఆణిముత్యాలకు దారిమళ్లించినట్లు ప్రచారం జరుగుతోంది. కేవలం రూ.16 కోట్లతో ఇంటర్‌ విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు ఇచ్చే అవకాశమున్నా, ప్రభుత్వం ముందుకు రావడంలేదు. గతేడాది ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన హైస్కూల్‌ ప్లస్‌ (ఇంటర్‌) విద్యకు సంబంధించిన ఆలోచన విఫలమైంది. పాఠపుస్తకాలు, గ్రంథాలయాలు, ప్రయోగశాలలకు మౌలిక సౌకర్యాల కల్పన, బోధనా సిబ్బంది భర్తీ లేకపోవడంతో 70శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాలేదు. 100 హైస్కూల్‌ ప్లస్‌లో జీరో ఉత్తీర్ణతా శాతం నమోదైంది. విద్యార్థులకు తాగునీరు, ఆట స్థలం, మరుగుదొడ్ల సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా బాలికల పరిస్థితి దయనీయంగా మారింది. ఖాళీ లెక్చరర్‌ పోస్టుల భర్తీతోపాటు ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉంది.
జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్‌ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపైనా, ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ నిలిపివేతపై సీఎం జగన్‌ ఆరా తీయకపోవడాన్ని తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు. నిత్యం సమీక్షలలో నిమగ్నమయ్యే సీఎంకు, జూనియర్‌ కళాశాలల పరిస్థితి కన్పించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంటర్‌ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో పూర్తిగా వివక్ష జరుగుతోంది. విద్యార్థుల ప్రవేశాలు, పరీక్షల రుసుం, సప్లిమెంటరీ రుసుం, ప్రైవేట్‌ కళాశాల నూతన ప్రారంభ గుర్తింపు, రెన్యువల్‌ అనుమతులు, ఆర్థిక లావాదేవీలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలను పరోక్షంగా ప్రోత్సహించడం, ప్రభుత్వ కాలేజీలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌ జూనియర్‌ కళాశాలలలో చదువుతున్న దళిత, గిరిజన, వెనుకబడిన, మైనార్టీ, అగ్రవర్ణాలలో పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యాసంస్థలలో ఎంట్రీ ఫీజులు, పరీక్ష ఫీజులు వసూలు చేయకుండా ఉచితంగా పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, నోట్‌ బుక్స్‌, బస్‌పాస్‌ ఇవ్వాల్సిన అవసరముంది. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని, ఉపకార వేతనాలను అమలు చేయాలి. జగన్‌ ప్రభుత్వం కార్పొరేట్‌ విద్యాసంస్థలను నియంత్రించడంలో విఫలమైంది. ప్రభుత్వ నిబంధనలు, ప్రమాణాలు పాటించకుండా గుర్తింపు లేకుండా, అనధికారికంగా కళాశాలలు, వసతి గృహాలు నిర్వహిస్తున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ, ఎయిడెడ్‌ కళాశాలల్లో ఇంటర్‌ విద్య బలోపేతానికి, సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు, మేధావులు, విద్యార్థిసంఘాల నాయకులు సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img