Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాజధానిపై అసెంబ్లీకే నిర్ణయాధికారం

రాజ్యాంగ సవరణ కోరుతూ రాజ్యసభలో వైసీపీ బిల్లు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: అమరావతి విధ్వంసమే లక్ష్యంగా చరిత్రలో ఎక్కడా లేనివిధంగా మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన వైసీపీ ప్రభుత్వం…తన పంతం నెగ్గించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పినా…జగన్‌ సర్కార్‌ మాత్రం దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై నిత్యాన్వేషణ కొనసాగిస్తోంది. ఇందుకోసం తాజాగా రాజ్యసభను వేదికగా ఎంచుకుంది. రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర శాసనసభకు విస్పష్ట అధికారం ఉండాలని, దీనికి రాజ్యాంగ సవరణ చేపట్టాలని కోరింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి శుక్రవారం ఈ మేరకు రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఒకటి, అంతకంటే ఎక్కువ రాజధానులు ఏర్పాటు చేసే అధికారం వాస్తవానికి ఆయా రాష్ట్ర శాసన వ్యవస్థకే ఉందని, అయితే దీనిపై మరింత స్పష్టత కోరుతూ ఈ ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా తిరుగులేని అధికారం కల్పించే ఉద్దేశంతో ఆర్టికల్‌ 3ఏని చేరుస్తూ రాజ్యాంగ సవరణ చేపట్టడం ఈ బిల్లు ఉద్దేశంగా ఆయన పేర్కొన్నారు. ఏదైనా కేసులో విచారణ ఎదుర్కొంటూ కస్టడీలో ఉన్నా లేదా అరెస్ట్‌ అయినా పార్లమెంట్‌, అసెంబ్లీ సభ్యుడు, రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించాలని, వార్తా చానళ్లు, డిజిటల్‌ న్యూస్‌ ప్లాట్‌ఫారాల్లో వెల్లువెత్తుతున్న నకిలీ వార్తలను కట్టడి చేస్తూ వార్తా ప్రసారాల్లో ఆయా సంస్థలు పారదర్శకతను, నైతిక బాధ్యతను వహించేలా నియంత్రించే అధికారం ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు కట్టబెట్టేలా చట్ట సవరణ చేయాలని విజయసాయిరెడ్డి మరో రెండు బిల్లులు ప్రవేశపెట్టారు.
వ్యవసాయ పరిశోధనకు కేటాయింపులేవి ?
వ్యవసాయ పరిశోధనకు బడ్జెట్‌లో కేటాయింపులను ఎందుకు పెంచడం లేదని విజయసాయిరెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా వ్యవసాయమంత్రికి అనుబంధ ప్రశ్న వేశారు. 2021-22లో సవరించిన బడ్జెట్‌ అంచనాల ప్రకారం వ్యవసాయ పరిశోధనకు రూ.8,514 కోట్ల కేటాయింపులు జరిగాయి. 2022-23 బడ్జెట్‌లో సైతం అంతే మొత్తం కేటాయించారు. వ్యవసాయ పరిశోధనకు ఒక్క రూపాయి కూడా అదనంగా కేటాయించలేదు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పుల కారణంగా సంభవిస్తున్న అకాలవర్షాల వంటి సమస్యలతో ఏటా పంటలు నష్టపోతూ రైతాంగం కష్టాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని నిలబడే వంగడాలను అభివృద్ధి చేసేందుకు వ్యవసాయ పరిశోధనపై భారీగా ఖర్చు చేయవలసిన అవసరం ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడుతోందో వివరించాలని ఆయన ప్రశ్నించారు.
దీనికి మంత్రి కైలాశ్‌ చౌదరి సమాధానమిస్తూ వ్యవసాయ పరిశోధనను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలోను విస్మరించబోదని చెప్పారు. పరిశోధనకు మరిన్ని నిధులు కావాలని ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చి (ఐసీఏఆర్‌) కోరితే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. కొన్నేళ్లుగా వ్యవసాయ పరిశోధన ద్వారా 1957 కొత్త వంగడాలు, వాతావరణ మార్పులను తట్టుకోగల 286 కొత్త వంగడాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆవిష్కరించారని మంత్రి వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img