అమెరికాలోని హవాయిలో అడవులు దహించుకుని పోతున్నాయి. ద్వీపంలో చెలరేగిన దావానలంలో మరణించిన వారి సంఖ్య 67కు చేరుకున్నది. ఇంకా వందల సంఖ్యలో జనం మిస్సైనట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ దహన కాండను భారీ విపత్తుగా అక్కడ ప్రభుత్వం ప్రకటించింది.లహైనా పట్టణం దాదాపు చాలా వరకు కాలిపోయింది. అయితే ప్రజలు శుక్రవారం మళ్లీ ఆ పట్టణానికి రావడం ప్రారంభించారు. రాత్రి పూట ఆ పట్టణంలో కర్ఫ్యూ విధించారు. కొన్ని ప్రాంతాలకు మాత్రం కేవలం సెర్చ్, రెస్క్యూ బృందాలను మాత్రమే అనుమతిస్తున్నారు. లహైనాకు ఇంకా నీటి, విద్యుత్తు సరఫరా జరగడం లేదు. మంటల్లో అన్నీ కోల్పోయిన బాధితుల కోసం అన్వేషణ జరుగుతోంది. పట్టణంలో ఉన్న హార్బర్ వద్ద నీటిలో దాచుకున్న 17 మందిని ప్రాణాలతో రక్షించారు. కార్చిచ్చు వల్ల లహైనా పట్టణంలో దాదాపు వెయ్యికిపైగా ఇండ్లు కాలిపోయాయి.