Friday, September 30, 2022
Friday, September 30, 2022

తీరని సొంతింటి కల

. ఆరేళ్లయినా అందని ద్రాక్షే
. పీఎం ఆవాస్‌ యోజన లోపభూయిష్టం
. లబ్ధిదారుల ఎంపికలో వివక్ష
. కొంపముంచుతున్న రాజకీయ జోక్యం

అమరావతి: ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పీఎంఏవై) లోపభూయిష్టంగా ఉంది. దేశంలో ఇళ్లు లేని పేదలు ఉండకూడదని, అందరికీ ఇళ్లు నిర్మించి తీరతామని మోదీ సర్కారు ప్రగల్భాలు పలికింది. ఆ మేరకు ప్రచారాన్ని ఊదరగొట్టింది. పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్న సామెతలో పేదవాడికి సొంతింటి కల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా తయారైంది. ఆరేళ్లు అయినా గానీ పథకం కింద అర్హత సాధించిన వారి సొంతింటి కల నెరవేరలేదు. లబ్ధిదారుల ఎంపికలోనూ వివక్ష, రాజకీయ ప్రేరేపిత విధానాల అమలుతో పేదలకు సొంతిల్లు అన్నది అందని ద్రాక్షగా మారింది. మోదీ ప్రభుత్వం పీఎం ఆవాస్‌ యోజన పథకాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకువచ్చింది. ఇల్లు లేని ఒక్కరూ దేశంలో ఉండబోరని గొప్పలు పోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రధాని మోదీ హిందీలో ఓ ట్వీట్‌ చేశారు. ఈ పథకం కింద మూడు కోట్ల ఇళ్లు కేటాయించినట్లు తెలిపారు. కనీస వసతులతో కూడిన ఈ ఇళ్లు నేటి మహిళా సాధికారతకు చిహ్నమని చెప్పుకొచ్చారు. అవి నిజంగానే మహిళా సాధికారత చిహ్నాలా అన్నది ప్రశ్నార్థకం.
2021 నవంబరుకు 2.77 కోట్లకుపైగా ఇళ్లు సిద్ధం కాగా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలకు 50.99 లక్షల ఇళ్ల లక్ష్యాన్ని మాత్రమే కేంద్రం ఇచ్చింది. ఈ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపులో ఎదురయ్యే అడ్డంకులకు పరిష్కారం ఇప్పటికీ లభించలేదు. ఎన్ని లోపాలు ఉన్నా, వివక్ష చూపినా అర్హుల ఎంపిక బాధ్యత గ్రామ పంచాయతీలపైనే ఉంది. 2016 ఏప్రిల్‌లో పీఎంఏవైజి (గ్రామీణ్‌)ను ప్రారంభించారు. దీనికింద రూ.70వేల రుణ సౌకర్యం కల్పించారు. మైదానాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.1.2లక్షలు, గిరి ప్రాంతాల్లో రూ.1.3లక్షలు చొప్పున సాయం అందిస్తామన్నారు. అయితే ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా ఈ పథకం కోసం కేటాయించిన ఆర్థిక సాయంపై తక్షణ సమీక్ష అవసరమని స్థాయిసంఘం తాజాగా సిఫార్సు చేసింది. ప్రస్తుత ధరసూచీ ఆధారంగా యూనిట్‌కిచ్చే ఆర్థిక సాయాన్ని పెంచాలని సూచించింది. అందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ససేమిరా అన్నది. ఇలాంటివి కుదరవని చెప్పింది. యూనిట్‌ సాయాన్ని పెంచకుండా పీఎంఏవైజీ కార్యాచరణను కొనసాగించాలని ఆర్థికశాఖ సిఫార్సు చేసినట్లు తెలిపింది. ఈ సమాధానం స్థాయి సంఘానికి కోపం తెప్పించింది. సమాజంలో అణగారిన వర్గాల లబ్ధిదారులపై గ్రామీణాభివృద్ధి శాఖకు సానుభూతి లేదని వ్యాఖ్యానించింది. సిమెంటు, స్టీలు, పెయింట్లు, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు భారీగా పెరిగాయని, ఇళ్ల నిర్మాణానికి రూ.70వేల రుణసాయం అక్కరకు రాదని చెప్పింది. కానీ ఆర్థిక శాఖ మాత్రం రుణ వసతులను పెంచే డిమాండ్లను సమీక్షించేందుకు విముఖత చూపింది.
గ్రామీణాభివృద్ధి శాఖ కసరత్తుల తర్వాత 4,27,975 మంది భూమి లేని లబ్ధిదారులలో 65.26శాతం అంటే 2,79,321 మందికి భూములు కేటాయించలేదని స్థాయి సంఘం 16వ నివేదిక పేర్కొంది. భూమిలేని లబ్ధిదారుల సంఖ్య మహారాష్ట్రలో 81,193గా ఉంటే ఒడిశాలో 52,731, తమిళనాడులో 43,718, అసోంలో 29,591 ఉంది. ఇతర రాష్ట్రాల వివరాలు తెలియాల్సి ఉంది. భూమిలేని లబ్ధిదారులకు భూములు కేటాయించడానికి ప్రాముఖ్యత ఇవ్వాలని సూచనలు చేసినట్లు తెలుపుతూ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలపై నెపం నెట్టే ప్రయత్నాన్ని గ్రామీణాభివృద్ధి శాఖ చేసింది. దీంతో స్థాయిసంఘం అసంతృప్తి వ్యక్తంచేసింది. ఈ సమస్య పరిష్కారానికి సరైన యంత్రాంగాల అవసరాన్ని సూచించింది. మంత్రిత్వశాఖ వైఖరి షరామామూలేనని, తక్కువ కాలంలో అనుకున్న ఫలితాలు సాధించేలా పటిష్ఠ చర్యలు లోపించాయని పేర్కొంది. 2018 నుంచి రాష్ట్రాలు పంపిన అనేక లేఖల ఆధారంగా కావాల్సిన పరిష్కారం ఇప్పటివరకు లభించలేదని తెలిపింది. దేశంలో భూమి లేని లబ్ధిదారులకు భూములు కేటాయిచేందుకు కొత్త పద్ధతులు అనుసరణీయమని స్థాయిసంఘం నివేదిక సూచన చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img