ట్రంప్ ఎదురుదాడి చేసినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దీటుగా బదులిచ్చిన కమలా
అమెరికా అధ్యక్ష ఎన్నికలపై డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య తొలిసారి హోరాహోరి చర్చ జరిగింది. పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా ఈ తొలి డిబేట్ వాడీ వేడిగా కొనసాగింది. ఇరువురు అధ్యక్ష అభ్యర్థులు పరస్పర విమర్శలతో చర్చను రక్తికట్టించారు. ఈ క్రమంలో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ తనపై పోటీ చేస్తున్న రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ప్రస్తుతం పోటీలో వున్నది అధ్యక్షుడు జో బైడెన్ కాదని గుర్తు చేయడం హైలైట్‌గా నిలిచింది. మీరు జో బైడెన్‌పై పోటీ చేయడం లేదు. నాపై పోటీ చేస్తున్నారు. ఈమేరకు మాజీ అధ్యక్షుడికి గుర్తు చేయడం చాలా ముఖ్యం అని ఏబీసీ చర్చలో కమల అన్నారు. జులైలో జరిగిన చర్చలో ట్రంప్ ముందు బైడెన్ తేలిపోయిన విషయం తెలిసిందే. కానీ కమలా మాత్రం ఆయనకు దీటుగా బదులిచ్చారు. ఇక తొలి డిబేట్‌లో అంతగా ప్రభావం చూపని అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి మధ్యలోనే తప్పుకున్నారు. ఆ రోజు బైడెన్‌పై ట్రంప్ పైచేయి సాధించారు. అదే స్ట్రాటజీతో ఇవాళ్టి చర్చలోనూ హ్యారిస్‌పై ట్రంప్ ఎదురుదాడి చేసినప్పటికీ, ఆమె ఏమాత్రం తగ్గలేదు. ట్రంప్, హ్యారిస్ కరచాలనంతో చర్చ ప్రారంభమైంది. ఆ వెంటనే వారిద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలతో విరుచుకుపడ్డారు. అమెరికా చరిత్రలో బైడెన్‌ను అత్యంత చెత్త అధ్యక్షుడిగా, కమలాను అత్యంత చెత్త ఉపాధ్యక్షురాలిగా ట్రంప్ అభివర్ణించారు. దాంతో ట్రంప్‌పై కమలా హ్యారిస్ ఎదురుదాడికి దిగారు. స్పష్టంగా చెబుతున్నా నేను జో బైడెన్ కాదు, అలాగే కచ్చితంగా డొనాల్డ్ ట్రంప్ కాదు. నేను మన దేశానికి అందించేది కొత్త తరం నాయకత్వాన్ని. సాధ్యమయ్యే వాటిని విశ్వసించే వ్యక్తిని. మనం ప్రజలకు ఏమి చేయగలం అనే దానిపై ఆశావాద భావాన్ని కలిగించే వ్యక్తి ఎప్పుడూ అమెరికన్ ప్రజలను కించపరచడం జరగదు అని ఆమె అన్నారు. అనంతరం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలో జో బైడెన్ అనుసరించిన విధానాన్ని మాజీ అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. తాను ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆ యుద్ధం ముగుస్తుందని నొక్కి చెప్పారు. దీనిపై కమలా హ్యారిస్ స్పందిస్తూ, ట్రంప్ ఉక్రెయిన్‌ను రష్యాకు వదిలేస్తారు. వ్లాదిమిర్ పుతిన్ లంచ్‌లో ట్రంప్‌ను మింగేస్తారుఁ అని చెప్పారు. అటు మిడిల్ ఈస్ట్ సంక్షోభంపై, ఇజ్రాయెల్- పాలస్తీనా సమస్య పరిష్కారానికి హ్యారిస్ మద్దతు పలికారు. అదే సమయంలో ట్రంప్ మాట్లాడుతూ డెమొక్రాట్‌లు ఇజ్రాయెల్‌ను ద్వేషిస్తున్నారని అన్నారు. అయితే తాను ఎన్నికైతే యుద్ధాన్ని ముగించేందుకు ఏం చేస్తానో మీరే చూస్తారంటూ దాటవేసే సమాధానం చెప్పారు. ఇలా అమెరికా ఆర్థిక వ్యవస్థ, వలసవాదులు, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం, రష్యా-ఉక్రెయిన్ పోరాటంపై ఇరువురి మధ్య గట్టి చర్చ జరిగింది. అలాగే కమలా హ్యారిస్‌ను ట్రంప్ మార్క్సిస్ట్ గా పేర్కొనగా, ఆమె చిరునవ్వుతో సరిపెట్టారు. ఇదిలాఉంటే.. 2024 ఎన్నికలు కూడా 2020 మాదిరిగానే ట్రంప్, బైడెన్ మధ్య రీమ్యాచ్ అని అనుకున్నారు. కానీ అధ్యక్షుడు జో బైడెన్ చివరి నిమిషంలో ఎన్నిక బిడ్ నుంచి వైదొలిగారు. దాంతో అనూహ్యంగా అధ్యక్ష అభ్యర్థిగా కమల ఖరారు అయ్యారు.
ఇక కమల అభ్యర్థిత్వం ఖరారు అయిన తర్వాత ట్రంప్ గ్రాఫ్ పడిపోవడం గమనార్హం. ట్రంప్ మొదట్లో ముందంజలో ఉన్నారు, కానీ హ్యారిస్ ఎంట్రీ గేమ్‌ను మార్చేసిందని సర్వేలు చెబుతున్నాయి. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ఒకవేళ కమలా హ్యారిస్ గెలిస్తే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఆమె చరిత్రకెక్కుతారు.