యమునా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. ఆగ్రాలో చారిత్రక తాజ్ మహల్ కట్టడం గోడ వరకూ వరద నీరు చేరుకుంది. 45 ఏళ్ల తర్వాత తాజ్ మహల్ గోడను తాకుతూ యమునా నది ప్రవహిస్తోంది. తాజ్ మహల్ ముందున్న ఉద్యానవనంలోకి వరద నీరు చేరింది. తాజ్ మహల్ వద్ద యమునా నది గరిష్ట నీటి మట్టం 495 అడుగులు కాగా.. ప్రస్తుతం వరద ప్రవాహం 497.9 అడుగులను దాటింది. చివరిసారిగా 1978 వరదలు సమయంలో యమునా నది ప్రవాహం తాజ్ మహల్ వెనుక గోడను తాకిందని కన్జర్వేషన్ అసిస్టెంట్ ప్రిన్స్ వాజ్‌పేయి ుూI ప్రతినిధికి తెలిపారు. అయితే, యమునా నది ఉధృతి మరింత పెరిగినా.. ఈ చారిత్రక కట్టడానికి ముప్పేమీ లేదని ఆయన చెప్పారు. వరద ఉధృతి పెరిగినా.. ఇక్కడి ప్రధాన సమాధిలోకి నీరు ప్రవేశించని విధంగా తాజ్ మహల్‌ను నిర్మించారని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు తెలిపారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ వారసత్వ కట్టడానికి వరదల వల్ల ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. చివరిసారిగా 1978లో యమునా నదిలో నీటి మట్టం 508 అడుగులకు పెరగడంతో తాజ్ మహల్ స్మారకంలోని నేలమాళిగలోని 22 గదుల్లోకి నీరు చేరింది. ఈ ఘటన తర్వాత అధికారులు చెక్క తలుపులను తొలగించారు. దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో పొడి వాతావరణం ఉండగా.. ఉత్తర భారతదేశంలో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఐటీవో వారధిపై మరో గేటును తెరిచినట్లు ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. ఢిల్లీలో 26 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 47 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల బీభత్సం కొనసాగుతోంది. దీంతో యమునా నదిలోకి భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. ఉత్తరాఖండ్‌లో వరదల బీభత్సం కొనసాగుతోంది. గంగోత్రి – యమునోత్రి నేషనల్ హైవేపై భారీగా కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఆ జాతీయ రహదారిని మూసివేశారు. మనేరి, హెల్గుగాడ్, సయాంజ్ ప్రాంతాల్లో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది.మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాల కారణంగా జలాశయాలు వేగంగా నిండుతున్నాయి. కృష్ణా నది, దాని ఉపనదుల్లో భారీగా వరద నీరు చేరుతోంది. కర్ణాటకలోని ఉడిపి, దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.