Thursday, December 7, 2023
Thursday, December 7, 2023

పేదోడి ‘ఉపాధి’కి గండి

. తలనొప్పిగా తప్పనిసరి ‘యాప్‌’ హాజరీ
. ఇంటర్నెట్‌, విద్యుత్‌, సాంకేతిక సమస్యలతో కార్మికుల తికమక
. చేసిన పనికి అందని కూలీ
. అగమ్యగోచరంగా దివ్యాంగుల స్థితి

న్యూదిల్లీ: పేదోడికి ఉపాధి కల్పించే ఉద్దేశంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉనికిలోకి వచ్చింది కానీ ఈ పథకం కింద ఉపాధి పొందే కార్మికులు ముఖ్యంగా దివ్యాంగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. ఇందుకు కార్మికుల హాజరు నమోదు కోసం యాప్‌ను తీసుకు రావడమే కారణం. యాప్‌ ద్వారా ఉదయం, మధ్యాహ్నం హాజరును అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అయితే ఇంటర్నెట్‌, విద్యుత్‌ సరఫరా సరిగ్గా లేకపోవడం, తరచూ వచ్చే సాంకేతిక సమస్యలు కార్మికులను తిప్పలు పెడుతున్నాయి. దీనికి డిజిటల్‌ నిరక్షరాస్యత తోడవుతుండటంతో లక్షల మంది కార్మికుల ఉపాధికి గండి పడుతోంది. 2021, మార్చి 21న నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) యాప్‌ను గ్రామీణాభివృద్ధి శాఖ ప్రారంభించింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ సమగ్ర అమలు కోసం దీనిని తీసుకు వచ్చింది. జనవరి ఒకటో తేదీన రోజుకు రెండు సార్లు జియోట్యాగ్‌ ఫొటోలు అప్‌లోడ్‌ చేయాలని కేంద్రం ఆదేశించింది. దీని ప్రకారం ఉదయం 11 గంటలకు, మధ్యాహ్నం 2 గంటలకు వారు తమ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలి. ఈ యాప్‌ వల్ల అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు దివ్యాంగురాలైన వితంతువు, ముగ్గురు బిడ్డల తల్లి మమతా (38) తెలిపారు. ఈమె పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌ వాసి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిత్యం రెండుసార్లు ఫొటోను అప్‌లోడ్‌ చేయాల్సి వస్తోంది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ ద్వారా చేసిన పనికి సమయానికి వేతనాలు అందడంలేదు. అధిక పనిగంటలు శ్రమించాల్సి వస్తోంది’ అని ఆమె చెప్పారు. ఉత్తరప్రదేశ్‌, అయోధకు చెందిన కాలురామ్‌, ఆయన భార్య ఇద్దరు దివ్యాంగులు. కాలురామ్‌ 43 రోజులు పనిచేస్తే యాప్‌లో హాజరు అప్‌లోడ్‌ కాని కారణంగా వేతనం అందలేదు. అందుకోసం సూపర్‌వైజర్‌, పంచాయతీని ఆశ్రయించినా ఫలితం లేదు. భార్య అనారోగ్యంతో ఉంటే కనీసం పారసెటమాల్‌ కొనలేని దుస్థితి ఉండటంతో పంచాయతీ సభ్యుల్లో ఒకరు ఆయనకు ఓ కాంట్రాక్టర్‌ వద్ద పనికి కుదిర్చారు. అక్కడ వచ్చిన డబ్బుతో ఆయన ఇంటి రేషన్‌, భార్యకు మందులు తీసుకెళ్లి ఆమె ప్రాణాలు కాపాడుకున్నారు.
ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ మార్గదర్శకాల ప్రకారం కార్మికులు రోజుకు ఏడు నుంచి 12 గంటలు పనిచేయాలి. దివ్యాంగులకు 25శాతం (నాలుగు నుంచి ఐదున్నర గంటలు) మినహాయింపు ఉంటుంది. రాష్ట్రాల ప్రకారం దివ్యాంగుల పనిగంటల్లో మార్పు ఉంటుంది. ఉదాహరణకు తమిళనాడులో వారు రోజుకు కనీసం నాలుగు గంటలు పనిచేస్తే సరిపోతుంది. హరియాణా వంటి రాష్ట్రాల్లో ఈ మార్గదర్శకాలు అమలు కావడం లేదు. వేసవి కాలంలో కూడా ఐదు నిమిషాలు విరామం తీసుకున్నందుకు కూలీడబ్బుల్లో కోత విధిస్తామని దివ్యాంగులకు బెదిరింపులు తప్పడంలేదని దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్‌పీఆర్‌డీ) అఖిలభారత సంయుక్త కార్యదర్శి, హరియాణా వికలాంగ్‌ అధికార్‌ మంచ్‌ ప్రధాన కార్యదర్శి రిషికేశ్‌ అన్నారు. ఎన్‌ఎంఎంఎస్‌ హాజరు తప్పనిసరి చేయడం ద్వారా దివ్యాంగులకు పనిగంటల్లో మినహాయింపు ఇచ్చిన రాష్ట్రాలు కూడా మార్గదర్శకాలను పాటించడం లేదు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో మమత 16 రోజులు పనిచేస్తే ఆమె హాజరు కేవలం ఒకరోజుగా నమోదైంది. పంచాయతీని ఆశ్రయిస్తే మండల అధికారిని కలవమన్నారు కానీ అక్కడా పని జరగలేదు. చాలా సందర్భాల్లో దివ్యాంగ కార్మికులు తమ హాజరును ఎన్‌ఎంఎంఎస్‌ ద్వారా నమోదు చేయలేకపోతున్నారు. సర్వర్‌ పనిచేయకపోవడం లేదా సాంకేతిక సమస్యలు కారణాలు ఉంటున్నాయి. అనివార్య కారణాల్లో మ్యానువల్‌ అటెండెన్స్‌ను అప్‌లోడ్‌ చేయాలని జిల్లా కార్యక్రమ సమన్వయకర్తకు మంత్రిత్వశాఖ సూచించింది కానీ మానవీయంగా హాజరు నమోదు కోసం జిల్లా అధికారులను సంప్రదించే వెసులుబాటు కార్మికులకు ఉండదు. భౌతిక మచ్చర్‌ జాబితాలు అందుబాటులో లేకపోవడం కూడా సమస్యను పెంచింది.
ఈ యాప్‌ను వినియోగించాలంటే కార్మికులందరి వద్ద స్మార్ట్‌ఫోన్లు ఉండాలని తొలుత ప్రచారం జరగడంతో కాలురామ్‌ తన మేకను అమ్మి ఫోన్‌ కొనుగోలు చేశారు. హాజరు నమోదు చేసేది సూపర్‌వైజర్‌/మేట్‌ అని తెలియడంతో తన ఫోన్‌తో ఏమి చేయాలో అర్థం కాక తలపట్టుకున్నారు. తెలంగాణలోని ఖమ్మంకు చెందిన దివ్యాంగ సైట్‌ సూపర్‌వైజర్‌ సురేంద్ర వేణు (32) స్మార్ట్‌ఫోన్‌ కొనేందుకు అప్పు చేశారు. ఫోన్‌ కొనేందుకు, డేటా రీచార్జ్‌ చేసేందుకు ఆర్థిక సాయంలేదని చెప్పారు. ఎన్‌ఎంఎంఎస్‌లో తరచూ వచ్చే సాంకేతిక సమస్యలను ఎలా పరిష్కరించాలన్నది వేణుకు నేర్పలేదు. యాప్‌ పనిచేయకపోతే అన్‌ఇన్‌స్టాల్‌ చేసి, మళ్లీ ఇన్‌స్టాల్‌ చేయాలని సీనియర్లు సూచించారు. అందుకు చాలా సమయం పడుతుండటం, హాజరు అప్‌లోడ్‌ కాకపోవడంతో పనిభారం పెరుగుతుంది. ఎన్‌ఎంఎంఎస్‌ కోసం వినియోగించే ఫోన్‌, సిమ్‌కార్డును ఆ ఆప్‌తో అనుసంధానం చేస్తారు కాబట్టి అదే ఐడీతో మరో ఫోన్‌లో లాగిన్‌ కుదరదు. ఫోన్‌ పనిచేయకపోయినా, ఫోన్‌ నంబరు/ సిమ్‌ మార్చినా యాప్‌ పనిచేయదు. మేట్‌ స్థానంలో దివ్యాంగ మహిళలను నియమించాలని మంత్రిత్వశాఖ సూచించినప్పటికీ అది జరగడం లేదు. ఎందుకంటే చాలా మంది దివ్యాంగ మహిళలకు స్మార్ట్‌ఫోన్‌ కొనే స్థోమత లేదు. చదువుకోకపోవడం, స్మార్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ సౌకర్యం లేకపోవడంతో పేదలకు మేట్‌ ఉద్యోగాలు రావడంలేదు. చదువుకొని, స్మార్ట్‌ఫోన్‌, ఇంటర్నెట్‌ వ్యయాన్ని భరించే స్థోమత ఉన్నవారికే ఈ ఉద్యోగాలు వస్తున్నాయి. బీహార్‌, సమస్తిపూర్‌కు చెందిన 53ఏళ్ల దివ్యాంగురాలు పార్వతి దేవి మాట్లాడుతూ రోజంతా కష్టపడినప్పటికీ తమ హాజరు నమోదు కాకపోవడం వల్ల శ్రమ వృధా అవుతోందని, డబ్బు రానప్పుడు పనిచేయడం దండగని అసహనానికి గురయ్యారు. ఇదిలావుంటే, ఎన్‌ఎంఎంఎస్‌లో హాజరు అప్‌లోడ్‌ చేయాలన్నది ఉపాధి హామీ పథకం చట్టాన్ని, కార్మికుల హక్కులకు విరుద్ధంగా ఉంది. అంధులు, బదురులు, ఆటిజం, మానసిక వికలాంగులు తదితర అంగవైకల్యంతో బాధపడే వారి పరిస్థితి దయనీయంగా మారుతోంది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ మార్గదర్శకాల ప్రకారం పనికల్పనలో దివ్యాంగులకు అధిక ప్రాధాన్యతివ్వాలి. 202021లో కోవిడ్‌ లాక్‌డౌన్‌ వేళ 22లక్షల మందిలో ఆరు లక్షల మందికి మాత్రమే ఉపాధి లభించింది. 202223లో 23లక్షల మందికిపైగా నమోదు చేసుకోగా ఐదు లక్షల మందికి మాత్రమే పని లభించింది. 23,70,182లో 18,79,836 మంది దివ్యాంగుల దరఖాస్తులు (79శాతం) తిరస్కరణకు గురయ్యాయి. 45.6శాతం నిరక్షరాస్యులు, దివ్యాంగులు ఇప్పటికే ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కోసం దరఖాస్తు చేసుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ యాప్‌ జీవనోపాధి హక్కును హరించివేస్తోంది. 1.8 కోట్ల మంది దివ్యాంగ కార్మికుల ఉపాధికి గండి కొడుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img