Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

నిర్వాసితులను నిండా ముంచారు

పోలవరం ప్రధాన డ్యామ్‌ ఎప్పుడు కడతారు?
పరిహారం చెల్లించేది ఎప్పుడు?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గందరగోళం సృష్టిస్తున్నాయి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
8న విజయవాడలో అఖిలపక్షాలతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం
ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన సీపీఐ రాష్ట్ర ప్రతినిధి బృందం

విశాలాంధ్ర`పోలవరం: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్‌ను ఎక్కడ, ఎప్పుడు కడతారు, నిర్వాసితులకు పరిహారం ఎప్పుడు చెల్లించి, వారి బాధలు తీరుస్తారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లను ప్రశ్నించారు. సీపీఐ రాష్ట్ర ప్రతినిధి బృందం బుధవారం ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును సందర్శించింది. ఈ సందర్భంగా సీపీఐ ప్రతినిధి బృందానికి ప్రాజెక్టులోని స్పిల్‌ వే, కాఫర్‌ డ్యామ్‌ గురించి, వరద ప్రవాహం పై ఎస్‌ఈ కె.నరసింహ మూర్తి వివరించారు. అనంతరం ప్రాజెక్టు కార్యాలయంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం త్యాగం చేసిన నిర్వాసితులను వరదలలో ముంచేశారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టులో ప్రధాన డ్యామ్‌ ఈసీఆర్‌ఎఫ్‌ ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడిరదన్నారు. ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల మధ్య నీళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నిర్వాసితులను గాలికి వదిలేశారని విమర్శించారు. దీనిపై అఖిలపక్షాలతో ఈనెల 8న రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహిస్తునట్లు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పురోభివృద్ధికి వరప్రసాదమని, లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగు నీరు, 960 మెగా వాట్ల జల విద్యుత్‌ ఈ ప్రాజెక్టు ద్వారా అందుబాటులోకి వస్తాయన్నారు. విశాఖపట్నానికి 22 టీఎంసీల నీరు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కావలసిన నీరు, రాయలసీమ, కృష్ణా డెల్టాలకు సమృద్ధిగా నీరు అందించగల సత్తా పోలవరం ప్రాజెక్టు సొంతమని రామకృష్ణ అన్నారు. దీని నిర్మాణం పై ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి 2021 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇస్తామని వాగ్దానం చేశారు. కానీ ఇప్పటి వరకూ ప్రధాన డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, దీని నిర్మాణంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర అంగీకారంతో కాంటూరును తగ్గిస్తామని, నిర్వాసితుల సంఖ్యను తగ్గిస్తామని అంటున్నాయని, అయితే ఈ రెండు ప్రభుత్వాలు ప్రాజెక్టును పూర్తిచేయకుండా ప్రజలలో గందరగోళం సృష్టిస్తున్నాయని రామకృష్ణ విమర్శించారు.
వరద బాధితులకు రూ.2 వేలతో సరా…!
నిర్వాసితుల త్యాగాల ఫలితంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోందన్నారు. నిర్వాసితులు ఇళ్లు, పొలాలు, ఊళ్లు కోల్పోతున్నారని, వారిని వరదలలో ముంచేశారని ధ్వజమెత్తారు. 21 రోజుల పాటు విద్యుత్‌ లేదని, పశువులకు మేత లేదని, బాధితుల పిల్లలకు సరిగా పాల ప్యాకెట్లు కూడా సరఫరా చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా ప్రభుత్వం వరద బాధితులకు కుటుంబానికి రూ.10 వేలు ఇస్తే, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.2 వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని, ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. విలీన మండలాల నిర్వాసితులు విసిగిపోయి మమ్మల్ని తెలంగాణాలో కలపండి అని ధర్నాలు చేస్తున్నారని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటయిన విషయం అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అన్నీ కోల్పోయిన నిర్వాసితులు ఇప్పుడు చాలా బాధ పడుతున్నారని, ప్రాజెక్టు సత్వరమే పూర్తి కావడానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏక తాటి పైకి వచ్చి కేంద్రం పై వత్తిడి తేవాలని కోరారు. పోలవరం పై రాష్ట్రంలోని ఎంపీలందరూ మొద్దు నిద్ర వీడి పార్లమెంట్‌లో గళం ఎత్తాలని అన్నారు. రాష్ట్రం ఖర్చు పెట్టిన రూ.2,700 కోట్లు ఇప్పటివరకూ కేంద్రం ఇవ్వలేదని, తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రూ.30 వేల కోట్లు కేటాయిస్తేనే ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయన్నారు. పోలవరం సత్వర నిర్మాణం కోసం అన్ని రాజకీయ పార్టీలు, నిర్వాసితులు, గిరిజన సంఘాలను కలుపుకుని కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తేవడానికి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి నిర్వాసితులకు న్యాయం చేసే వరకు సీపీఐ పోరాడుతుందని తెలిపారు. పోలవరం సమస్య పరిష్కారం కోసం అన్ని పక్షాలది ఒకే గొంతుక కావాలని, రాజకీయాలకు అతీ తంగా రాష్ట్ర అభివృద్ధికి కలిసి రావాలన్నారు. ప్రాజెక్టు సాకారం కోసం కలసి రానటువంటి వారి దుర్మార్గాన్ని తెలుగు జాతి సహించదన్నారు. భేషజాలు పక్కన పెట్టి, విమర్శలు తగ్గించుకుని, కలసికట్టుగా కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పర్యటనలో ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ అధ్యక్షులు రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ, తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తాటిపాక మధు, అంధ్ర ప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు, సీపీఐ ఏలూరు జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, పోలవరం మండల కార్యదర్శి జల్లేపల్లి వెంకటనరసింహారావు, పార్టీ నాయకులు కొండు రాంబాబు, వి.కొండలరావు, తిరుమలశెట్టి రవికుమార్‌, ప్రసాద్‌, కార్యకర్తలు, ఈ.ఈ.పి. ఆదిరెడ్డి, మేఘా కంపెనీ డీజీఎం రాజేష్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img