Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కాషాయ కుట్రలు…

బలవంతంగా మతమార్పిడులంటూ వీహెచ్‌పీ ఆరోపణ
ఆరుగురు దళిత క్రైస్తవ మహిళలకు జైలు
పుట్టినరోజు వేడుకలకు మతం రంగు పులిమే యత్నం
ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లో ఘటన

న్యూదిల్లీ : దేశంలో కాషాయ మూకల నయా కుట్రలు కొనసాగుతున్నాయి. కేంద్రంలో మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మైనార్టీలు, దళితులు, ఇతర అణగారిన వర్గాల పై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అమానుషాలకు అంతు లేకుండా పోయింది. అధికార మదంతో, అడ్డగోలుగా, తప్పుడు ఆరోపణలతో సమాజంలో విధ్వంసకర చర్యలకు తెగబడుతోంది. విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) ఫిర్యాదు మేరకు బలవంతపు మతమార్పిడి ఆరోపణల పై ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌లోని మహారాజ్‌గంజ్‌ ప్రాంతంలో జులై 30న ఆరుగురు దళిత`క్రైస్తవ మహిళల పై కేసు నమోదయింది. రాజకీయ లబ్ధి కోసం హిందూత్వ సంస్థ బలవంతపు మతమార్పిడులకు పాల్పడే ప్రయత్నమే పుట్టినరోజు వేడుకగా అభివర్ణిస్తున్నదని మహిళల న్యాయవాదులు, కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇంద్ర కలా, సుభాగి దేవి, సాధన, సవిత, అనిత, సునీత అనే మహిళలను కాలా కుమారుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సమయంలో కాలా ఇంటి నుంచి అరెస్టు చేశారు. వీహెచ్‌పీ బ్లాక్‌ ప్రెసిడెంట్‌ అశుతోష్‌ సింగ్‌ మహిళలపై ఫిర్యాదు చేశారు. ది వైర్‌తో సింగ్‌ మాట్లాడుతూ ‘పుట్టినరోజు వేడుకల ముసుగులో బలవంతపు మతమార్పిడులు జరుగుతున్నాయని మాకు సమాచారం అందింది. మేము విషయాన్ని పోలీసులకు దృష్టికి తీసుకువెళ్లాము. వారు మహిళలను అరెస్టు చేశారని తెలిపారు. ‘మహిళలు మాత్రమే అక్కడ ఉన్నారు. వారు డబ్బుతో ఇతరులను ఆకర్షించి, అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు’ అని ఫిర్యాదుదారు సింగ్‌ వివరించాడు. ‘యేసు మాదిరిగా వారు గాలిలోకి చేతులు ఎత్తారు. వారు దళిత మహిళలను మతం మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. మరొక ఉదాహరణ 12 కిలోమీటర్ల దూరంలో జరిగింది. మేము దానిని కూడా అణచి వేశాము. పుట్టిన రోజు వేడుకలాంటిదేమీ లేదు’ అని పేర్కొన్నారు. పేదలు, మహిళలు, పురుషులను బలవంతంగా మతమార్పిడి చేసేందుకు మహిళలు ప్రయత్నిస్తున్నారని, వేడుకను ఆపేందుకు ప్రయత్నించినప్పుడు తనను బెదిరించి దుర్భాషలాడారని ఫిర్యాదులో తెలిపారు. భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని సెక్షన్లు 504, 506 – శాంతికి భంగం, నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన ఉత్తరప్రదేశ్‌ చట్టవిరుద్ధమైన మత మార్పిడి నిషేధ చట్టం, 2021కి చెందిన సెక్షన్లు 3, 5 కింద కేసు నమోదు చేసినట్లు ‘ది వైర్‌’కి అందిన మొదటి సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) పేర్కొంది. బలవంతపు మతమార్పిడులకు కనీసం రూ.15 వేల జరిమానాతో పాటు ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన మైనర్లను, మహిళలను మతమార్పిడి చేస్తే మూడు నుంచి పదేళ్ల వరకు జైలుశిక్ష విధించేలా చట్టం వీలు కల్పిస్తోంది. అరెస్టు తరువాత, మహిళలను ప్రత్యేక దిగువ కోర్టు ముందు హాజరుపరిచారు. అభియోగాల తీవ్రతను బట్టి బెయిల్‌ నిరాకరించబడిరది. ఈ కేసులో తదుపరి విచారణ ఆగస్టు 16న జరగనుంది. విచారణ సందర్భంగా మహిళలతో పాటు వచ్చిన కార్యకర్త దీనానాథ్‌ జైస్వర్‌ మాట్లాడుతూ ‘ఆరుగురు దళిత`క్రైస్తవ మహిళలు జైలులో మగ్గుతున్నారు. ఇది మహేంద్ర కుమార్‌ కొడుకు పుట్టినరోజు కావడంతో తెలిసిన వ్యక్తులు, స్నేహితులందరూ హాజరయ్యారు. వారు యేసును నమ్మడంతో కేక్‌ కట్‌ చేసే ముందు ప్రార్థనలు చేయాలని నిర్ణయించుకున్నారు. అమిత్‌ సింగ్‌ అనే యువకుడు బలవంతంగా మతమార్పిడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అక్కడికి వచ్చి మహిళలను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఆదివారం కావడంతో మహిళలను స్పెషల్‌ చీఫ్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (సిజెఎం) కోర్టు ముందు హాజరుపరిచారు. అయితే మహిళలకు బెయిల్‌ నిరాకరించి, వారిని జైలుకు పంపారు. మహిళల తరపున వాదిస్తున్న న్యాయవాదులు ఆరోపణలను నిరాధారమైనవిగా పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల కుటుంబాలు వారిపై ఆధారపడిన కారణంగా వారిని తక్షణం విడిచిపెట్టాలని కోరారు. విచారణకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. అయితే రాజకీయ ఒత్తిళ్లు, ‘మార్పిడి నిరోధక’ చట్టంతో ముడిపడి ఉన్న కారణంగా కేసును ఎత్తివేయడం లేదని వారు భావిస్తున్నారు. మహిళల తరపు న్యాయవాది మునీష్‌ చంద్ర ‘ది వైర్‌’తో మాట్లాడుతూ ‘అసలు వాస్తవమేమిటంటే, బలవంతపు మతమార్పిడుల ఆరోపణ ముసుగులో, ప్రజాదరణ పొందడం లేదా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తున్న మితవాద మతోన్మాద సంస్థలచే ప్రజలను లక్ష్యంగా చేసుకుంటున్నారు’ అని తెలిపారు. ‘మహిళలు తమ ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. వారు ప్రార్థనలు చేస్తున్నప్పుడు వీహెచ్‌పీ సభ్యులు మహిళలపై ఫిర్యాదు చేశారు. వారిని మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే మహిళలను సాయంత్రం 6 గంటలకు తీసుకువెళ్లినట్లు పోలీసు డైరీలో ఉంది. మేము వారి బెయిల్‌ కోసం ప్రయత్నించాము. అయితే మహిళలకు బెయిల్‌ ఇచ్చే అధికారం దిగువ కోర్టుకు లేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే మహిళలకు బెయిల్‌ ఇవ్వలేదని భావిస్తున్నాం’ అని చంద్ర అన్నారు. ‘ఒక మహిళ దివ్యాంగురాలు. ఒక మహిళ కుమారులు దివ్యాంగులు. మిగిలిన వారి కుటుంబాలు చాలా బాధలు పడుతున్నాయి. ఎందుకంటే వారందరూ మహిళలపై ఆధారపడి ఉన్నారు’ అని అన్నారు. ‘మత మార్పిడి నిరోధక చట్టం’ కింద ఇలాంటి అనేక అరెస్టులు జరిగాయి. 2021లో క్రైస్తవులపై 300కు పైగా నేరాలు నమోదయ్యాయి. హిందుత్వ గ్రూపులు బలవంతంగా మతమార్పిడి చేశారన్న ఆరోపణలకు సంబంధించి 2021లో క్రైస్తవులపై 300కు పైగా నేరాలు నమోదయ్యాయి. ఇలాంటి దాడుల్లో అత్యధిక శాతం దళిత, గిరిజన వర్గాలకు చెందిన క్రైస్తవులపైనే జరిగాయని నిజనిర్ధారణ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. కాగా దీనిపై మహారాజ్‌ గంజ్‌ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీనియర్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కమలకాంత్‌ వర్మను ‘ది వైర్‌’ అడుగగా, ఆయన స్పందించలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img