. ఆయనపై బనాయించిన కేసు ఆరోపణ మాత్రమే
. జగన్‌పై పోరు ఆగదు: లోకేశ్
చంద్రబాబుపై అవినీతి మరక వేసేందుకు సైకో కుట్రలు చేస్తున్నారని, జగన్‌కు ఉన్న అవినీతి బురదను అందరికీ రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అవినీతి అనేది చంద్రబాబు రక్తంలోనే లేదని, ఆయనపై బనాయించిన కేసు ఆరోపణే తప్ప అవినీతి కాదన్నారు.
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: చంద్రబాబుపై అవినీతి మరక వేసేందుకు సైకో కుట్రలు చేస్తున్నారని, జగన్‌కు ఉన్న అవినీతి బురదను అందరికీ రుద్దేందుకు ప్రయత్ని స్తున్నారని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. అవినీతి అనేది చంద్రబాబు రక్తంలోనే లేదని, ఆయనపై బనా యించిన కేసు ఆరోపణే తప్ప అవినీతి కాదన్నారు. ఒళ్లంతా విషం నిండిన జగన్ దొంగ కేసులు పెట్టి తన తండ్రిని జైలుకు పంపారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వంపై తమ పోరు మరింత ఉధృతమవు తుందని హెచ్చరించారు. సీఐడీ అంటే కక్ష సాధింపు డిపార్ట్‌మెంట్‌గా మారిందని ఆయన విమర్శించారు. ప్రజా సంక్షేమమే తప్ప అవినీతి చేయడం తమ కుటుంబం రక్తంలోనే లేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. పాముకు తలలోనే విషం ఉంటుందని, కానీ జగన్‌కు ఒళ్లంతా విషమేనన్నారు. జగన్‌పై 38 కేసులు, 10 సీబీఐ, ఏడు ఈడీ కేసులు, 21 ఇతర కేసులున్నాయని, జగన్‌పై కేసులు పదేళ్లుగా విచారణకు కూడా రావడం లేదన్నారు. జగన్ ఎంతగా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారో దీన్ని బట్టే అర్థమవుతోందన్నారు. బాబాయి హత్య కేసు ముద్దాయిలను సైకో జగన్ కాపాడు తున్నారని, పోలీసులను అడ్డుపెట్టి అవినాశ్ రెడ్డి అరెస్టు కాకుండా జగన్ కాపాడారని లోకేశ్ ధ్వజమెత్తారు. తనపై హత్యాయత్నం సహా 20 కేసులు పెట్టారని, రూ.42 వేల కోట్లు మింగిన జగన్ ఇవాళ బయట తిరుగు తున్నారని, బాబాయిని చంపిన అవినాశ్‌రెడ్డి బయట తిరుగుతున్నారని ఆరోపించారు. ఏ తప్పు చేయని తమపై అక్రమ కేసులు పెడితే ఊరుకుంటామా? సైకో జగన్‌ను వదిలిపెట్టేది లేదని, ప్రజల్లోకి వెళ్లి పోరాడతానని లోకేశ్ హెచ్చరించారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి బంద్‌ని విజయవంతం చేశారన్నారు. బంద్ విజయవంతంలో సహకరించిన అన్న లాంటి పవన్ కల్యాణ్, అన్ని రాజకీయ పార్టీలకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుపై దొంగ కేసు పెట్టి మంత్రులు సంబరాలు చేసుకున్నారంటేనే ఎంత కక్ష సాధింపు ఉందో తెలుస్తోందన్నారు. తాను నేను రాజమండ్రి లోనే ఉన్నానని, తాను ఎక్కడికీ పారిపోలేదని, తననూ అరెస్టు చేయాలనుకుంటే రావచ్చని వ్యాఖ్యానించారు. ఎన్ని రోజులు తమను జైల్లో పెట్టుకుంటారో పెట్టుకోండని, తమ పోరాటం ఆగదని, చంద్రబాబుని అరెస్టు చేయించిన జగన్ పెద్ద మూల్యం చెల్లించుకోబోతున్నారని లోకేశ్ హెచ్చరించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో నాడు ప్రధాన భూమిక పోషించిన అధికారులు అజయ్ కల్లం, ప్రేమ్ చంద్రారెడ్డి ఇప్పటి ప్రభుత్వంలో సలహాదారులుగా ఉన్నారని, వారి పాత్రపై సీఐడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకి ఏ రూపేణా డబ్బులు వచ్చాయో ప్రభుత్వం నిరూపించాలన్నారు.