Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

సీఎంపీ రూపకల్పనకుఇదే సరైన సమయం

. ఇండియాకు ఊపునిచ్చిన ఉప ఎన్నికల ఫలితాలు
. పార్లమెంటు సమావేశాల తర్వాత ప్రజల్లోకి విపక్షాల రైలు
. సీపీఐ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజాన్‌

న్యూదిల్లీ: కనీస ఉమ్మడి కార్యక్రమం(సీఎంపీ) రూపొందించడానికి ప్రతిపక్ష ఇండియా కూటమికి ఇదే సరైన సమయమని సీపీఐ కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజాన్‌ చెప్పారు. ఘోసి అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో విజయం సాధించిన సమాజ్‌వాదీ పార్టీకి అభినందలు తెలిపారు. ఆరు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష కూటమికి గొప్ప ప్రోత్సాహం ఇచ్చాయని అంజాన్‌ తెలిపారు. బీజేపీ` ఇండియా కూటమి ముఖాముఖి పోటీ చేస్తే కాషాయ పార్టీకి పుట్టగతులుండవని ఆయన స్పష్టంచేశారు. అతుల్‌ కుమార్‌ అంజాన్‌ పీటీఐతో మాట్లాడుతూ కనీస ఉమ్మడి కార్యక్రమం రూపొం దించేందుకు ప్రతిపక్ష కూటమికి ఇదే సరైన సమయమని చెప్పారు.‘సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలపై మేము మార్గదర్శకాలు రూపొందిస్తున్నాం. 2024 లోక్‌సభ ఎన్నికలకు ఇదే పవిత్ర పుస్తకం(మేనిఫెస్టో) అవుతుంది’ అని అంజాన్‌ చెప్పారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల తర్వాత ప్రతిపక్ష రైలు దేశవ్యాప్తంగా పర్యటిస్తోందని తెలిపారు. ప్రతిపక్షాల నాయకులు ప్రజల వద్దకు వెళ్లడం ప్రారంభిస్తారని చెప్పారు. ఘోసిలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి విజయం ఇండియా కూటమికి బంగారు అవకాశమని అంజాన్‌ ఉద్ఘాటించారు. ‘దేశంలో మార్పు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అందువల్ల దీనిని అవకాశంగా తీసుకొని ప్రజల వద్దకు వెళతాం. ఘోసిలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులతో పాటు 36 మంది మంత్రులు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు చైతన్యవంతమై ఎస్‌పీ అభ్యర్థికి అద్భుత విజయం కట్టబెట్టారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం నిత్య పర్యవేక్షణలో ఉన్నారు. ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులకు కొదవే లేదు. ఎంతమంది వచ్చినా అధికార పార్టీ విజయం సాధించలేకపోయింది. దీనికి ప్రధాన కారణం ప్రతిపక్షాల ఐక్యతే’నని అతుల్‌ కుమార్‌ అంజాన్‌ వివరించారు. ఘోసి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి దారాసింగ్‌ చౌహాన్‌పై ఎస్‌పీ అభ్యర్థి సుధాకర్‌సింగ్‌ 42,759 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. ఘోసి ఎన్నికల కోసం ఎస్‌పీ సీనియర్‌ నేతలు శివపాల్‌ యాదవ్‌, రామ్‌గోపాల్‌ యాదవ్‌ ప్రచారం చేశారని చెప్పారు. ఎస్‌పీ అభ్యర్థి కోసం స్థానిక సీపీఐ కార్యకర్తలు పెద్దఎత్తున ప్రచారంలో పాల్గొన్నారన్నారు. సుధాకర్‌ విజయంలో సీపీఐ కూడా భాగస్వామిగా నిలించిదని అంజాన్‌ చెప్పారు. ‘ఒకప్పుడు సీపీఐకి ఘోసి నియోజకవర్గం కంచుకోట. కామ్రేడ్‌ జార్ఖండే రాయ్‌ 1957 నుంచి 1968 మధ్య మూడు పర్యా యాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా గెలిచారు’ అని వివరించారు. 1974`1977 మధ్యకాలంలో సీపీఐ నేత జాఫర్‌ అజ్మీ ఎమ్మెల్యేగా పనిచేశారని గుర్తుచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img