Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆ నలుగురు చిన్నారులు సేఫ్..

దట్టమైన అడవి నుంచి సురక్షితంగా బయటపడిన చిన్నారులు
40 రోజుల క్రితం విమానం కూలి నలుగురు చిన్నారులు గల్లంతు
ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి చిన్నారులను గుర్తించిన సైన్యం

అదో పెద్ద దట్టమైన అడవి. వాళ్లంతా చిన్న పిల్లలు. వయసు 13.. ఆ లోపు ఉన్నవారే. విమానం కూలిపోవడంతో ఆ అటవీ ప్రాంతంలో తప్పిపోయారు. చివరికి 40 రోజుల తర్వాత సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఆర్మీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి చివరికి నలుగురు చిన్నారులను గుర్తించింది. సరదాగా కుటుంబ సభ్యులతో చిన్న విమానంలో వెళ్తుండగా.. అది దట్టమైన అడవిలో కూలిపోయింది. ఈ ఘటనలో పిల్లల తల్లి, బంధువుతోపాటు పైలట్.. ముగ్గురు దుర్మరణం చెందారు. అయితే ఆ విమానంలో ఉన్న నలుగురు చిన్నారుల ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. దీంతో సైన్యం రంగంలోకి దిగింది. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి దట్టమైన అడవిలో పిల్లల కోసం గాలింపు చేపట్టారు. పట్టు వదలకుండా 40 రోజుల పాటు ఈ ఆపరేషన్ సాగింది. చివరకు నలుగురు పిల్లలు సురక్షితంగా కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కొలంబియా దేశంలోని అమెజాన్‌ అడవుల్లో జరిగింది.
పిల్లలు సురక్షితంగా బయటపడినట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ట్విటర్ వేదికగా స్పందించారు. చిన్న విమానం కూలిపోయిన ఘటనలో నలుగురు చిన్నారులు 40 రోజుల తర్వాత క్షేమంగా బయటపడ్డారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం చిన్నారులకు వైద్య చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. చిన్నారులు అజేయులుగా బయటికి వచ్చారని తెలిపారు. వారి చరిత్ర కొలంబియా చరిత్రలో నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. పిల్లలను రక్షించేందుకు నేషనల్ లిబరేషన్ ఆర్మీ.. రెబల్ గ్రూప్ ప్రతినిధులు కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశారని గుర్తుచేశారు.

మే 1 న తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పైలట్ సహా నలుగురు పిల్లలు, వారి తల్లి, బంధువు మొత్తం ఏడుగురు ప్రయాణికులు విమానంలో బయల్దేరారు. విమానం గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించాడు. తర్వాత రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయి.. అమెజాన్ అడవుల్లో కూలిపోయింది. ఈ ఘటనలో బయటపడిన చిన్నారుల వయస్సు 13, 9, 4 సంవత్సరాలు మరియు 11 నెలలు మాత్రమే ఉంటుందని తెలిపారు.

ప్రమాదం జరిగినట్లు తెలిసిన వెంటనే సైన్యం రంగంలోకి దిగింది. పిల్లలను గుర్తించేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు. స్నిఫర్ డాగ్స్‌తోపాటు 150 మంది సైనికులు గాలింపు చేపట్టారు. చిన్నారులను కాపాడేందుకు స్థానికంగా నివసించే తెగలకు చెందిన వారు.. సైన్యానికి సాయం అందించారు. పిల్లల ఆచూకీ దొరికిన తర్వాత వారితో కలిసి సైనికులు, వాలంటీర్లు.. పిల్లలతో ఉన్న ఫొటోలను కొలంబియా సైనిక కమాండ్ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టింది.

అమెజాన్ అడవి ప్రాంతంలోని వివిధ నగరాలకు సరైన రోడ్డు మార్గాలు ఉండవు. దీంతో అక్కడి ప్రజలు రాకపోకలు సాగించేందుకు చిన్న చిన్న విమానాలను ఉపయోగిస్తుంటారు. అందులో భాగంగానే ఓ కుటుంబం మే 1 న ఒక చిన్న విమానంలో బయల్దేరారు. మార్గ మధ్యలో సాంకేతిక లోపం కారణంగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. తర్వాత విమానం కూలిపోయింది. ఘటన సమాచారం తెలుసుకున్న అధికారులు.. ప్రమాద స్థలికి చేరుకుని ముగ్గురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నలుగురు చిన్నారుల కోసం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img