కొందరు సాయుధ దుండగులు ప్రయాణికులను బస్సుల నుండి దింపి, వారి గుర్తింపులను తనిఖీ చేసిన తర్వాత కాల్చి చంపినట్లు పాకిస్థాన్ మీడియా సోమవారం తెలిపింది. బలూచిస్థాన్‌లోని ముసాఖేలో జరిగిన ఈ ఘటనలో 23 మంది మరణించారు. అసిస్టెంట్ కమిషనర్ ముసాఖైల్ నజీబ్ కాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. ముసాఖేలోని రరాషమ్ జిల్లాలో రహదారిపై ఆయుధాలు ధరించిన కొందరు వ్యక్తులు బస్సులను అడ్డుకున్నారు. ప్రయాణికులను కిందకి దింపి, వారి గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. అనంతరం వారిపై కాల్పులు జరిపారు. పది వాహనాలకు నిప్పుపెట్టారని అన్నారు. మృతులు పంజాబ్ ప్రావిన్స్‌కి చెందిన వారుగా గుర్తించారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఉగ్రవాద ఘటనను బలూచిస్థాన్ సిఎం సర్పరాజ్ బుగ్తీ తీవ్రంగా ఖండించారు.