తోరణాలు, కటౌట్లు, బ్యానర్లతో అలంకరణ
హాజరు కానున్న జాతీయ, రాష్ట్ర నాయకులు
రాష్ట్రాన్ని రక్షించండి…దేశాన్ని కాపాడండి అన్న నినాదంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలన పై ప్రజా చైతన్యం కోసం, ప్రజా సమస్యలే ప్రధాన అజెండా గా సీపీఐ నిర్వహిస్తున్న బస్సుయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం బస్సు యాత్ర ముగింపు ర్యాలీ, బహిరంగ సభ తిరుపతిలో జరగనుంది. ఈ ర్యాలీ, బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
విశాలాంధ్ర – తిరుపతి: రాష్ట్రాన్ని రక్షించండి…దేశాన్ని కాపాడండి అన్న నినాదంతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలన పై ప్రజా చైతన్యం కోసం, ప్రజా సమస్యలే ప్రధాన అజెండా గా సీపీఐ నిర్వహిస్తున్న బస్సుయాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. శుక్రవారం బస్సు యాత్ర ముగింపు ర్యాలీ, బహిరంగ సభ తిరుపతిలో జరగనుంది. ఈ ర్యాలీ, బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు బాలాజీ కాలనీ నుంచి భారీ ప్రదర్శన ప్రారంభం కానుంది. సాయంత్రం మూడు గంటలకు నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్ లో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి తిరుపతి నగరంలో భారీ ఏర్పాట్లు చేశారు. ర్యాలీ జరిగే ప్రధాన రహదారులు, కూడళ్లలో పార్టీ కటౌట్లు, బ్యానర్లతో అలంకరించారు. నగరం మొత్తం సీపీిఐ తోరణాలతో ఎరుపెక్కించారు. సభా ప్రాంగణంలో, వేదిక వద్ద చలువ పందిళ్లు, కుర్చీలు ఏర్పాటు చేశారు. బహిరంగ సభకు వచ్చే కార్యకర్తలకు భోజనాలు, తాగునీరు వంటివి ఏర్పాటు చేశారు. సభకు ముఖ్య అతిథులుగా సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, కార్యదర్శులు నారాయణ, వినయ్ విశ్వం, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు హాజరుకానున్నారు. సభకు రాష్ట్ర నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కానున్నాయి. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లను సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి హరినాథరెడ్డి, కార్యవర్గ సభ్యులు రామానాయుడు, జిల్లా కార్యదర్శి మురళి, నగర కార్యదర్శి విశ్వనాథ్, కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు గురువారం పర్యవేక్షించారు. ఈ ప్రదర్శన, బహిరంగ సభలో పాల్గొనేందుకు గురువారం ఉదయం నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పార్టీ శ్రేణులు బయలుదేరి వెళుతున్నారు.