. వెంటాడుతున్న ఓటమి భయం
. ఇప్పటికే దేశ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత
. మధ్య ప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బరిలో కేంద్ర మంత్రులు, ఎంపీలు
. తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లోనూ…
కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం గడ్డుకాలం ఎదుర్కొంటోంది. త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఆ పై రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, మతోన్మాదం, ప్రభుత్వ రంగాల ప్రైవేటీకరణ, బడా కార్పొరేట్‌లకు మోకరిల్లే వైఖరి అనుసరిస్తున్న బీజేపీ పట్ల దేశ ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ పార్టీని గద్దె నుంచి దించేందుకు సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారం నిలుపుకునేందుకు కాషాయ పార్టీ నానాతంటాలు పడుతోంది.
న్యూదిల్లీ : ఈ ఏడాది చివరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలతోపాటు కేంద్రంలో తిరిగి అధికారం సాధించాలని ఉవ్వీళ్లూరుతున్న బీజేపీ అనేక రాష్ట్రాలలో గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగనున్న మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లో ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నట్టు సమాచారం. ఉత్తరాదిలో తమకు తిరుగులేదని బీజేపీ నేతలు చెప్పే మాటల్లో మేకపోతు గాంభీర్యమే తప్ప వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని తెలుస్తోంది. మధ్య ప్రదేశ్‌లో 72 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించగా… అందులో సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. వరుసగా 18 ఏళ్లకు పైగా సీఎంగా ఉన్న చౌహాన్‌కు టికెట్ ప్రకటించకపోవడానికి కారణం ఆయన ఓడిపోతారనే భయమే అయి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఓటమి భయంతోనే మధ్య ప్రదేశ్, రాజస్థాన్‌లో కేంద్ర మంత్రులు, ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించుతున్నట్టు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ, చత్తీస్‌గఢ్‌లోనూ కేంద్ర మంత్రులను బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం.
మధ్యప్రదేశ్ బరిలో ముగ్గురు కేంద్ర మంత్రులు, ఏడుగురు ఎంపీలు
మధ్య ప్రదేశ్‌లో ఏడుగురు ఎంపీలను బీజేపీ బరిలోకి దించింది. వీరిలో ముగ్గురు కేంద్ర మంత్రులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ కూడా ఉన్నారు. ముగ్గురు కేంద్ర మంత్రులలో నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, ఫగన్ సింగ్ కులస్తే ఉన్నారు. కైలాష్ విజయ వర్గీయను దశాబ్దం తర్వాత ఇండోర్ నుంచి బరిలోకి దించింది. తోమర్ రెండు దశాబ్దాల తర్వాత గ్వాలియర్ నుంచి బరిలో దిగుతున్నారు. సీనియర్ నేతలను బరిలోకి దించడం ద్వారా అయినా గెలుపు అవకాశాలు మెరుగుపడుతాయని బీజేపీ భావిస్తోందని చెబుతున్నారు. ఏడుగురు ఎంపీలను బరిలోకి దించడమే బీజేపీకి ఓటమి భయానికి సంకేతమని రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. ఇదిలాఉండగా, బీజేపీ తన ఓటమిని ముందే అంగీకరించిందని మధ్య ప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ అన్నారు. రాష్ట్రంలో మునిగిపోతున్న పడవను కాపాడేందుకే కేంద్ర మంత్రులను, ఎంపీలను బరిలోకి దించిందని కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా విమర్శించారు.
రాజస్థాన్‌లోనూ అదే పరిస్థితి
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ కేంద్ర మంత్రులను బీజేపీ బరిలోకి దించుతోంది. కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో పాటు ఎంపీలు దియా కుమారి, రాజ్యవర్ధన్ రాథోడ్‌ను అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దించింది. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వస్తే గజేంద్ర సింగ్ ముఖ్యమంత్రి పదవికి గట్టి పోటీదారు అవుతారు. అయితే ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటిస్తే మాజీ సీఎం వసుంధర రాజే నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తున్నది. దీంతో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండా గెలిచిన ఎమ్మెల్యేలే శాసనసభా పక్ష నేతను ఎన్నుకుంటారనే సంకేతాన్ని బీజేపీ ఇస్తోంది.