Wednesday, September 28, 2022
Wednesday, September 28, 2022

ఖాకీ మయం

ఉద్యోగులపై ఉక్కుపాదం

. సీపీఎస్‌ రద్దు ఉద్యమాన్ని అణచివేసే చర్యలు
. సీఎం ఇంటి దగ్గర భారీ బందోబస్తు
. విజయవాడ సరిహద్దుల్లో జల్లెడ
. అడుగడుగునా ఆంక్షలు`నిర్బంధాలు
. 15 వేల మందికి పైగా పోలీసుల పహరా
. ప్రభుత్వ చర్యలపై సీపీఐ, సీపీఎం, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ధ్వజం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఉద్యోగులు, ఉపాధ్యాయులపై జగన్‌ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. పోలీసులతో ఉద్యమ అణచివేత చర్యలకు దిగుతూ, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తోంది. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌) రద్దు కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మరోమారు ఉద్యమానికి సన్నద్ధమయ్యాయి. ప్రభుత్వం అప్రమత్తమై పోలీసుల ద్వారా ఎక్కడికక్కడే బైండోవర్‌ కేసులు, ముందస్తు నోటీసులతో సీపీఎస్‌ ఉద్యోగ సంఘాలు, వారికి మద్దతిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను బెదిరింపులకు పాల్పడుతోంది. జిల్లాల నుంచి అడుగు బయటకు పెట్టకుండా ముఖ్యనేతలను నిర్బంధిస్తున్నారు. మరోవైపు సెప్టెంబరు 1న ఉద్యోగులెవరూ కారణం లేకుండా సెలవులు పెడితే, దానిని అనుమతించవద్దనీ, అలాంటి వారిపై కఠిన చర్యలుంటాయని ఆయా జిల్లా కలెక్టర్లు, డీఈవోల ద్వారా ప్రధానోపాధ్యాయులకు ఉత్తర్వులు జారీజేశారు. ప్రభుత్వానికి దొరికిందే అవకాశం అన్న రీతిలో, పోలీసుల ద్వారా ఉద్యమకారులపై ఒత్తిళ్లు ప్రారంభించారు. ఇతర ప్రాంతాల నుంచి చలో సీఎం ఇంటి ముట్టడికి, చలో విజయవాడకు ఉపాధ్యాయ, ఉద్యోగులు రాకుండా, వారం రోజుల నుంచి పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. వారి ద్విచక్ర వాహనాలు, కార్లను పోలీసుస్టేషన్లలోకి తీసుకెళ్లిపోయారు. ఉద్యమం అణచివేతకు విజయవాడలో పోలీసులు పెద్దఎత్తున ట్రయిల్‌ బందోబస్తు రన్‌ నిర్వహించారు. నిబంధనలను అతిక్రమించి ఎవరైనా తరలివస్తే, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీపీఎస్‌ రద్దుపై జరగబోయే ఉద్యమాన్ని అణచివేసేందుకు 15 వేలకు పైగా రిజర్వుడు, సివిల్‌, ప్రత్యేక దళాల పోలీసు బెటాలియన్లను విజయవాడ నగరంలోకి దించారు. సీఎం ఇంటి పరిసర ప్రాంతాల్లో బందోబస్తు భారీగా పెంచేశారు. అక్కడ ప్రత్యేక దళాలను ఏర్పాటు చేశారు. విజయవాడ నగర సరిహద్దు ప్రాంతాలు, ముఖ్యకూడళ్లలో పోలీసులు పహారా కాస్తున్నారు. బారికేడ్లను ఏర్పాటు చేసి, అనుమానితులపై ఆరా తీస్తున్నారు. విజయవాడకు వచ్చే అన్ని రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లలో నిఘా ఉంచారు. ఈ ఉద్యమానికి మద్దతిస్తున్న వివిధ పార్టీ కార్యాలయాలు, ప్రజా సంఘాల నేతల కార్యాలయాలపై పోలీసులు దృష్టి సారించారు. గత చలో విజయవాడ ఉద్యమం విజయవంతాన్ని దృష్టిలో ఉంచుకుని, కళ్యాణ మండపాలు, ఉద్యోగ సంఘాల కార్యాలయాలను పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పోలీసు చర్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయిశ్రీనివాస్‌, తిమ్మన్న తదితర సంఘాలు ఖండిరచాయి. సీపీఎస్‌ రద్దు కోసం చేపట్టబోయే ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
1న చలో సీఎం నివాసం: ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
సీపీఎస్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ, సెప్టెంబరు 1వ తేదీన చలో సీఎం నివాసం చేపడుతున్నామని, దీని విజయవంతానికి పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన విద్యా విధానంతో మొత్తం ప్రైవేటీకరణ వైపు మళ్లిస్తున్నారన్నారు. రాబోయే 15 ఏళ్లలో విద్యా విధానంలో సమూల మార్పులు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రకు పాల్పడుతోందన్నారు. ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉందని అన్నారు. అగ్రిగోల్డ్‌ అసోసియేషన్‌ అధ్వర్యంలో గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం ఒకవైపు చేపడుతుంటే, మరోవైపు శాసనమండలిలో చర్చించామని గుర్తుచేశారు. చేనేత కార్మికులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, రైతుల సమస్యలపై శాసనమండలిలో ప్రస్తావించామని వివరించారు. కరోనా రెండవ దశలో 7 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు మృతి చెందారని, వారి కుటుంబాలను ఆదుకునేందుకు కృషి చేశామన్నారు. సెప్టెంబర్‌ 1న సీపీఎస్‌ రద్దు చేయాలని కోరుతూ చలో ముఖ్యమంత్రి నివాసం కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు.
సీపీఎస్‌ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: ఎస్టీయూ
సీపీఎస్‌ ఉద్యమానికి సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎల్‌.సాయిశ్రీనివాస్‌, హెచ్‌.తిమ్మన్న తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టీయూ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమం విజయవంతానికి కృషి చేయాలన్నారు. పోలీసు నోటీసులకు, బైండోవర్‌ కేసులకు భయపడవద్దని కోరారు. సెప్టెంబర్‌ 1, 2004న రాష్ట్రంలో సీపీఎస్‌ ప్రవేశ పెట్టిన రోజు అయినందున, ఆ రోజును విద్రోహ దినంగా పాటించాలని కోరారు. రాష్ట్ర స్థాయి నాయకులు నల్ల బ్యాడ్జ్జి, నల్ల చొక్కాలు, మహిళా ఉపాధ్యాయులు నల్ల దుస్తులు ధరించి కలెక్టరేట్ల ఎదుట ఆ రోజు నిరసనల్లో పాల్గొంటామన్నారు. ఎన్నికల మేనిఫెస్టో బైబిల్‌, ఖురాన్‌, భగవద్గీతని సీఎం జగన్‌ హామీ ఇచ్చి, దానిని నిలబెట్టుకోలేక పోయారన్నారు. చర్చలతో సమస్యలు పరిష్కరించాలేగానీ, ఉద్యమాలను అణచివేయడం తగదన్నారు. శాంతియుత ఉద్యమాలను రెచ్చగొట్టడం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విరుద్ధమని విమర్శించారు. సీపీఎస్‌, జీపీఎస్‌ ఆలోచన పక్కకు పెట్టి తక్షణమే పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌)పై చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌ రాష్ట్రంలో 5 లక్షల మంది ఉద్యోగులకు ఓపీఎస్‌ పునరుద్ధరణ చేయగా, రాష్ట్రంలో కేవలం రెండు లక్షల మంది ఉద్యోగులకు ఎందుకు అమలు చేయలేరని ప్రశ్నించారు.
ఉపాధ్యాయులపై నిర్బంధాన్ని ఆపండి : సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు
సీపీఎస్‌ వ్యతిరేకంగా సెప్టెంబరు 1న చలో విజయవాడ పిలుపును భగ్నం చేసేందుకు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించడాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఖండిరచారు. తక్షణం ఈ నిర్బంధాన్ని ఆపి శాంతియుతంగా జరిపే విజయవాడ ప్రదర్శనకు అనుమతించా లని, ఉపాధ్యాయ సంఘాలతో సీపీఎస్‌పై చర్చించాలని డిమాండ్‌ చేశారు. నాడు సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ హామీ ఇచ్చి, ఇవాళ ఉద్యోగులకు భ్రమలు కల్పించారన్నారు. ప్రభుత్వం మధ్యలో జీపీఎస్‌ను తెరపైకి ప్రభుత్వం తెచ్చి ప్రజలను, ఉద్యోగులను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. ఈ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేస్తోందని విమర్శించారు. ఉపాధ్యాయులపై పెట్టిన బెండోవర్‌ కేసులను తక్షణం ఉపసంహరించుకోవాలని, ఉపాధ్యాయుల పట్ల శత్రు వైఖరిని విడనాడి వారితో చర్చలు జరిపి సామరస్యంగా పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img