. తీవ్ర ఉష్ణోగ్రతలతో పెరిగిన వినియోగం
. వర్షాభావం, వనరుల కొరతతో తగ్గిన ఉత్పత్తి
. సర్దుబాటు పేరుతో కోతలు అమలు
. ఉక్కపోత, దోమలతో ప్రజల ఇక్కట్లు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలో మళ్లీ అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయి. పది రోజులుగా వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. గతేడాది ఇదే నెలలో రాష్ట్రవ్యాప్తంగా 165 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండగా… ప్రస్తుతం వేసవికాలం తరహాలో 235 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం డిమాండ్ నెలకొంది. మరోవైపు వర్షాభావ పరిస్థితులు, వనరుల కొరత వంటి కారణాలతో విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. ప్రస్తుతం రాష్ట్రంలోని రిజర్వాయర్లన్నీ అడుగంటడంతో జల విద్యుత్ ఉత్పత్తి తగ్గింది. బొగ్గు కొరతతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సామర్థ్యానికి తగిన ఉత్పత్తి జరగడం లేదు. దీంతో ఉన్న విద్యుత్‌ను సర్దుబాటు చేసే ప్రయత్నాల్లో భాగంగా గ్రామాల్లో అనధికార కోతలు విధిస్తున్నారు. సహజంగా ఆగస్టు నెలలో వర్షాలు ఎక్కువగా కురవడం, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద రావల్సి ఉంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో కృష్ణా ప్రాజెక్టులన్నీ ఒట్టిపోతున్నాయి. దీంతో జల విద్యుత్ నిలిచిపోయింది. ఇంకోవైపు వేసవి కాలానికి, వర్షాకాలానికి విద్యుత్ వినియోగం సుమారు 60 నుంచి 80 మిలియన్ యూనిట్లు తగ్గాల్సి ఉండగా…వినియోగం పెరగడంతో లోటు ఏర్పడిరది.
ఒక్క విజయవాడ సర్కిల్ పరిధిలోనే 90 నుంచి 110 మెగావాట్ల విద్యుత్ లోటు ఏర్పడుతున్నట్లు అధికారులు చెపుతున్నారు. సహజంగా వర్షాకాలం విద్యుత్ కోతలు అమలయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ వాతావరణంలో వచ్చిన మార్పులు కారణంగా వినియోగం పెరగడం, ఉత్పత్తి తగ్గడం, ఈ వ్యత్యాసాన్ని అంచనా వేసి భర్తీ చర్యలు చేపట్టాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తూ, అప్రకటిత కోతలు విధిస్తుండటంతో వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. సమయంతో నిమిత్తం లేకుండా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో ఎడాపెడా కోతలు విధిస్తుండటంతో ఎప్పుడు కరెంట్ వస్తుందో, పోతుందో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రంలో సుమారు 2400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కావల్సి ఉండగా బొగ్గు కొరత కారణంగా సగానికి సగం ఉత్పత్తి పడిపోయి 1072 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అలాగే రాయలసీమ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 1650 మెగావాట్ల సామర్థ్యానికిగాను 1061 మెగావాట్లు, కృష్ణపట్నం విద్యుత్ ప్లాంట్‌లో 2400 మెగావాట్లకుగాను 1008 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే అవుతోంది. ప్రస్తుతం రాష్ట్రంంలోని అన్ని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. రోజు వారీ వచ్చే సరఫరాతో అరకొర విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ జరుగుతోంది. అసలే ఉక్కపోత, దానికి తోడు దోమల బెడదను తట్టుకోలేక వృద్దులు, గర్భిణీలు, చంటి పిల్లలు అవస్థలకు గురవుతున్నారు.
ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలు, ముడిసరుకు ధరలు, కస్టమర్ చార్జీల పేరిట పెద్దమొత్తాల్లో వసూలు చేస్తూ, వినియోగానికి తగ్గ విద్యుత్ సరఫరా చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ కోతల్లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని, నిర్దేశిత సమయం ప్రకారం ముందుగా తెలియజేసి కోతలు విధించాలని వినియోగదారులు కోరుతున్నారు.