Monday, October 3, 2022
Monday, October 3, 2022

వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత అవశ్యం

. అక్టోబరు 14 నుంచి 18 వరకు సీపీఐ జాతీయ మహాసభలు
. చారిత్రక ఆతిథ్యానికి విజయవాడ శ్రీకారం
. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని మోదీకి తాకట్టు పెట్టొద్దు: రామకృష్ణ
. మహాసభల వాల్‌పోస్టరు, కరపత్రాలు ఆవిష్కరించిన ఆహ్వానసంఘం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: జాతీయోద్యమ కాలం నుంచి కమ్యూనిస్టు ఉద్యమాలు, ప్రజా పోరాటాలకు వేదికగా, రాజకీయ రాజధానిగా నిలిచిన విజయవాడ నగరం సీపీఐ 24వ జాతీయ మహాసభలకు ఆతిథ్యం ఇస్తుందని మహాసభల ఆహ్వానసంఘం ప్రధాన కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. విజయవాడ ఎస్‌ఎస్‌ కల్యాణ మండపం వేదికగా అక్టోబరు 14 నుంచి 18వరకు జరగనున్న సీపీఐ జాతీయ మహాసభల వాల్‌ పోస్టరు, కరపత్రాలను విజయవాడ దాసరిభవన్‌లో మంగళవారం మాజీ ఎమ్మెల్సీ, మహాసభల కోశాధికారి జల్లి విల్సన్‌, ఆహ్వానసంఘం ఉపాధ్యక్షుడు(సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు) జి.ఓబులేసు, ఆహ్వానసంఘం కార్యదర్శి(సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు) అక్కినేని వనజ, ఆహ్వాన సంఘం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి(సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు) దోనేపూడి శంకర్‌, ఉపాధ్యక్షులు (పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు) కె. రామాంజనేయులు, ఆహ్వానసంఘం సభ్యులు(విజయవాడ నగర కార్యదర్శి) జి.కోటేశ్వరరావుతో కలిసి ఆయన విడుదల చేశారు. రామకృష్ణ మాట్లాడుతూ సీపీఐ జాతీయ మహాసభలకు అత్యంత ప్రాధాన్యత ఉందన్నారు. మోదీ పాలనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకికశక్తులను ఏకతాటిపైకి తీసుకురావడానికి సీపీఐ జాతీయ మహాసభలు వేదిక కానున్నట్లు తెలిపారు. మూడేళ్లకోసారి నిర్వహించాల్సిన మహాసభలు కరోనా వల్ల నాలుగేళ్లకు జరుపుతున్నామన్నారు. జాతీయ మహాసభలు 47ఏళ్ల తరువాత విజయవాడలో నిర్వహించాలని జాతీయ కమిటీ నిర్ణయించిందన్నారు. ఇదే విజయవాడలో 1961లో సీపీఐ 6వ జాతీయ మహాసభలు, 1975లో 10వ మహాసభలు జరిగాయని గుర్తుచేశారు. అక్టోబర్‌ 14న విజయవాడలో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహిస్తామని, దీనికి పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా తదితర నాయకులు పాల్గొంటారని తెలిపారు. అన్ని రాష్ట్రాల నుంచి 1000 మంది ప్రతినిధులు వస్తున్నారని, ఇతర దేశాల కమ్యూనిస్టు నాయకులు సౌహార్థ ప్రతినిధులుగా హాజరవుతారని పేర్కొన్నారు. సీపీఎం నుంచి సీతారామ్‌ ఏచూరి, ఇతర వామపక్ష పార్టీల జాతీయ నాయకులు సౌహార్థ సందేశం ఇస్తారన్నారు. మోదీ ప్రభుత్వం కేంద్రంలో నియంత పాలన చేస్తోందని రామకృష్ణ విమర్శించారు. ప్రతిపక్షాలను అణచివేయడానికి వ్యవస్థలను వాడుకుంటూ, ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. మోదీ పాలనలో దేశం అన్నివిధాలా నష్టపోయిందని, ప్రజాస్వామ్యానికి పాతరేసి, ఏకవ్యక్తి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తున్నారని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అన్యాయంగా జెళ్లలో పెడుతున్నారన్నారు. సీబీఐ, ఐటీ వాళ్లతో బెదిరిస్తున్నారని, ఇటీవల సోనియాగాంధీని కూడా విచారణ పేరుతో ఇబ్బందులు పెట్టారని చెప్పారు. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో దేశం అప్పుల పాలైందన్నారు. నల్లధనాన్ని వెనక్కి తేలేదని, ఉద్యోగాల ఊసేలేదని విమర్శించారు. మోదీ అధికారం చేపట్టే నాటికి రూ.47 లక్షల కోట్లు అప్పు ఉంటే…ఇవాళ రూ.155 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుపరం చేశారని మండిపడ్డారు. కొత్తగా ఒక్క పరిశ్రమ నెలకొల్పని ఏకైక ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ రికార్డు సృష్టించార న్నారు. పేద, ధనిక వర్గాల మధ్య అంతరాలు పెరిగాయ న్నారు. సర్వం కార్పొరేట్‌ శక్తులకు మోదీ ఊడిగం చేస్తున్నా రని, మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే అంబేద్కర్‌ రాజ్యాంగాన్ని మూలన పడేయడం ఖాయమన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ మోదీ విస్మరించారన్నారు.
మోదీకి సీఎం జగన్‌, టీడీపీ నేత చంద్రబాబు నిస్సిగ్గుగా భజన చేస్తున్నారని రామకృష్ణ మండిపడ్డారు. మోదీతో చంద్రబాబు చేయి కలిపారని, జగన్‌ కలిసి భోజనం చేశారంటూ వారిని వారే తగ్గించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మోదీ చేయివేస్తే పులకరించి పోవడం సరికాదన్నారు. రాష్ట్రానికి రావాల్సినవి అడక్కుండా పూర్తిగా దిగజారి వ్యవహరిస్తున్నారన్నారు. విజయసాయిరెడ్డి ఓ కళాకారుడని, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్నట్లు ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పోరాటాలు వదిలి, వాట్సాప్‌లలో పోరాటాలు చేస్తున్నారన్నారు. ఎంపీలు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని చంద్రబాబు, జగన్‌ దిల్లీలో తాకట్టు పెట్టొద్దని, వ్యక్తిత్వంతో మెలగాలని హితవు పలికారు. మహాసభలు వేదికగా అన్ని అంశాలపై చర్చిస్తామన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర వాదులను ఐక్యం చేస్తామన్నారు. అక్టోబరులో జరిగే జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
ఓబులేసు మాట్లాడుతూ ఉమ్మడి జాబితాలోని అంశాలు విద్య, వైద్యం, నీరు, విద్యుత్‌ తదితరాలను మోదీ ప్రభుత్వం తమ గుప్పెట్లో పెట్టుకుని సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తోందని విమర్శించారు. అందులో భాగంగానే విద్యుత్‌ సంస్కరణలను ప్రవేశపెట్టిందన్నారు. 45 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా సవరించి, దానిని ఆమోదింపచేయడానికి తిరుపతిలో ఈ నెల 25, 26 తేదీలో అన్ని రాష్ట్రాల కార్మిక శాఖాధికారులు, మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. ఆ సందర్భంగా ఏఐటీయూసీ అధ్వర్యంలో నిరసన తెలుపుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాట కార్యక్రమాలను మహాసభల వేదికగా రూపొందిస్తామని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img