. స్పీకర్ ఏకపక్ష వైఖరికి నిరసన
. మంత్రులతో గంటల తరబడి మాట్లాడిస్తున్నారు
. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : స్పీకర్ తమ్మినేని సీతారాం ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ శాసనసభ వర్షాకాల సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు శుక్రవారం ప్రకటించారు. రెండోరోజు కూడా టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాకు తమ నిర్ణయాన్ని వెల్లడిరచారు. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం చాలా స్పష్టంగా ఉందని, ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఒక్క అక్షరం పొల్లుపోకుండా చదవాల్సిన స్పీకర్…దాన్ని పక్కన పెట్టడం బాధాకరమని అచ్చెన్నాయుడు చెప్పారు. ‘చంద్రబాబు నాయుడిపై అక్రమకేసులు వెంటనే ఎత్తి వేయాలి… ఆయన విషయంలో తప్పుచేసినందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ మేం వాయిదా తీర్మానం ఇచ్చాం. కానీ స్పీకర్ వాటిని తిరస్కరిస్తున్నారు.
పైకి మాత్రం చర్చకు సిద్ధమని ప్రజలను మభ్యపెడుతున్నారు. గతంలో శాసనసభలో చర్చలు ఎలా జరిగాయో ఒక్కసారి గుర్తుచేసుకుంటే మంచిది’ అని ఆయన అన్నారు. నాలుగున్నరేళ్ల నుంచి చట్టసభల్లో చంద్రబాబునాయుడిపై దుమ్మెత్తి పోయడం తప్ప… ఏనాడైనా ఈ ప్రభుత్వం ప్రజాసమస్యలపై చర్చించిందా అని ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల, సభలో అధికారపక్షానిది పైచేయి అవుతోందని, నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ ప్రతిపక్షానికి అవకాశమివ్వలేదన్నారు. సభలో తాము మాట్లాడకుండా మైకులు కట్ చేస్తూ వాళ్లు మాత్రం సినిమా చూపిస్తున్నారని, ప్రజా సమస్యలపై చర్చించే అవకాశం ఇవ్వకుండా… ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడూ టీడీపీ ప్రభుత్వం చేసిన పనులపైనా, చంద్రబాబునాయుడిపై దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. తాము వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తే మైకులు ఆపేస్తున్నారన్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటినుంచీ ఇదే జరుగుతోందని, శాసనసభను వైసీపీ కార్యాలయం కంటే దారుణంగా మార్చిన ఘనత స్పీకర్‌కు దక్కుతుందన్నారు.
తమను ‘యూజ్‌లెస్ ఫెలోస్’ అన్నారని, స్పీకర్ స్థానం విలువను ఎలా కాపాడాలో కూడా ఆయనకు తెలియకపోతే ఎలా అని ప్రశ్నించారు. తమను యూజ్‌లెస్ ఫెలోస్ అని, వైసీపీ వాళ్లను ‘మన సభ్యులు’ అని గౌరవంగా మాట్లాడటం ఏమిటని నిలదీశారు. సాక్షి సిబ్బందిని సభలోకి అనుమతించి తాము మాట్లాడేది మాత్రమే చూపిస్తూ…అధికారపక్ష సభ్యుల వీరంగం ప్రజలకు తెలియకుండా చేస్తుంటే తాము వీడియోలు తీయక ఏమి చేయాలన్నారు. సభలో జరిగేవి ప్రజలకు తెలియకుండా స్పీకర్ కట్టడి చేస్తున్నందునే తాము సెల్‌ఫోన్లలో వీడియాలు తీయాల్సి వస్తుందని అచ్చెన్నాయుడు వివరించారు. తాము ఎప్పుడూ ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించామని, ఈ ముఖ్యమంత్రి చేసే దుర్మార్గాలు, శాసనసభ ముసుగులో ఇష్టానుసారం రెచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు.
తమ వాయిదా తీర్మానం చదవడానికి కూడా స్పీకర్ నోరు తెరవనందునే సభను బహిష్కరించి…బయటకు వచ్చామన్నారు. ప్రభుత్వం, స్పీకర్ వైఖరికి తీవ్రంగా కలతచెంది సమావేశాలు ముగిసేవరకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉభయసభలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నామని తెలిపారు.