కోల్‌కతాలోని వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలు రోజురోజుకీ ఉధృతమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న వైద్యులు వెంటనే సమ్మెలను విరమించాలని, వారి భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించింది. వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ ఘటనను ఖండిస్తూ శుక్రవారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) 24 గంటల సమ్మెకు పిలుపునిచ్చింది. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకూ అన్ని రకాల వైద్య సేవలను నిలిపివేస్తామని ఐఎంఎ ప్రకటించింది. అయితే అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపునిచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగానూ ఈరోజు వివిధ రాష్ట్రాల్లోనూ సమ్మెలు మరింత ఉధృతమయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు అన్ని ఆస్పత్రులలో ఓపీ సేవలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ౌ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటన చేసింది. దేశంలో సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని, ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వైద్యులు వెంటనే విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేసింది. వైద్య వృత్తిలో ఉన్నవారి భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు తెలియజేయాలని కోరింది. కమిటీ ఏర్పాటు చేస్తామని వైద్యులకు కేంద్రం హామీ ఇచ్చింది.