. ఇండియా కూటమితోనే మోదీ పతనం
. ఏపీలో విపక్షాలు ఏకం కావాలి
. సీపీఐ కార్యదర్శి నారాయణ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి/దిల్లీ : బీజేపీకి సహకరించే పార్టీలను వ్యతిరేకిస్తామని సీపీఐ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ నొక్కిచెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ ప్రజలకు అన్యాయం చేస్తే ఎండగడతామన్నారు. ఇండియా కూటమి రాజకీయ సమ్మేళనం మోదీ ప్రభుత్వ పతనానికి సంకేతమని తెలిపారు. మణిపూర్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రపతిని సీపీఐ నాయకులు కలిశారన్నారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి పదవులు లేకున్నా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో డబుల్ ఇంజిన్ పాలన సాగుతోందని విమర్శించారు. మోదీకి ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వంత పాడుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో విపక్షాలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. పొత్తులపై ఊగిసలాట తగదని టీడీపీకి హితవు పలికారు. అన్ని విధాలా రాష్ట్రానికి నష్టం చేసిన బీజేపీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించడం తగదని సూచించారు. సీపీఐ, సీపీఎం, జనసేనతో కలిసి కూటమిని ఏర్పాటు చేస్తే బీజేపీ-వైసీపీ డబుల్ ఇంజిన్ ఫెయిల్ అవుతుందన్నారు. నారాయణ బుధవారం దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జాతీయ, తెలుగు రాష్ట్రాల అంశాలను ప్రస్తావించారు. మోదీ ప్రభుత్వ మతతత్వ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. మణిపూర్‌లో పరిస్థితులపై రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా నేతృత్వ బృందం కలిసినట్లు నారాయణ తెలిపారు. ఈశాన్య రాష్ట్రంలో హింసాకాండకు కేంద్రంతో పాటు ఆ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానిదే బాధ్యతన్నారు. మణిపూర్‌లో అడుగడుగునా బారీకేడ్లు ఉన్నాయని, 253 మృతదేహాల్ని అక్కడి ప్రభుత్వం ఇంకా గుర్తించలేదన్నారు. మణిపూర్ సీఎంను తొలగించాలని, ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించేలా చూడాలని రాష్ట్రపతిని కోరినట్లు చెప్పారు. పార్లమెంట్ ఆమోదించిన అటవీ చట్టానికి సంబంధించిన బిల్లుపై సంతకం చేయొద్దని, దాంతో గిరిజనులకు తీవ్ర నష్టం జరుగుతుందని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసినట్లు నారాయణ తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఎన్నికల దృష్ట్యా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.200 తగ్గించిందన్నారు. మోదీకి చిత్తశుద్ధి వుంటే 2014 నాటి గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను అమలు చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. దేశంలో మోదీ గ్రాఫ్ పడిపోతోందన్నారు. మోదీకి వ్యతిరేకంగా ఉండే పార్టీలపై స్వతంత్ర సంస్థలతో దాడులు చేయిస్తూ బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు కేంద్రం పాల్పడుతోందని, ఇందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్ నిదర్శనమని నారాయణ అన్నారు. నాడు కేసీఆర్, ఆయన కుమార్తె కవిత బీజేపీని దుర్భాషలాడారని గుర్తుచేశారు. నేడు ఏపీలో జగన్ తన సోదరుడు, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, తెలంగాణలో కవిత జైళ్లకు వెళ్లకుండా ఉండేందుకు మోదీకి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు లేకపోయినా తెలుగు రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ నడుస్తోందని విమర్శించారు.
బీజేపీ ఏం చెబితే జగన్, కేసీఆర్ ఆచరిస్తున్నారని నారాయణ ఎద్దేవా చేశారు. విభజన హామీల అమలు కోసం కేంద్రాన్ని నిలదీయడంతో ఇద్దరు ముఖ్యమంత్రులు విఫలమయ్యారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి రాజధానికి పునాది రాయి వేసిన ప్రధాని మోదీ, నేడు అక్కడి పరిస్థితేమిటో ఆరా తీయకుండా మౌనంగా ఉండిపోతున్నారని నారాయణ అన్నారు.