బిల్లులు ఎందుకు ఆమోదించడం లేదు
తమిళనాడు గవర్నర్‌కు సుప్రీం ప్రశ్న
కేరళ పిటిషన్‌పై కేంద్రం, రాజ్‌భవన్‌కు నోటీసులు
న్యూదిల్లీ : రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా మూడేళ్లుగా ఎందుకు జాప్యం చేశారని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం సూటిగా ప్రశ్నించింది. శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను ఉద్దేశపూర్వకంగానే గవర్నర్‌లు ఆమోదించకుండా నిలువరిస్తున్నారని తమిళనాడు, కేరళ, పంజాబ్ ప్రభుత్వాలు పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. బిల్లులకు ఆమోదం తెలపకుండా తమిళనాడు గవర్నర్ మూడేళ్లుగా ఏమి చేస్తున్నారని నిలదీసింది. మరోవైపు కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఆయన కార్యాలయంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. బిల్లుల ఆమోదానికి జరుగుతున్న జాప్యానికి కారణాలు వివరించాలని నోటీసుల్లో ఆదేశించింది. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఎందుకు క్లియర్ చేయలేదని అడిగింది. మూడేళ్లుగా ఏమి చేస్తున్నారని గవర్నర్‌ను ప్రశ్నించింది. 2020 నుంచి బిల్లులు పెండిరగ్‌లో ఉన్నాయని తెలిపింది. ఇటీవల గవర్నర్ రవి తిప్పి పంపిన 10 బిల్లులను మళ్లీ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించింది. సీఎం స్టాలిన్ ప్రత్యేక సమావేశంలో ఆ బిల్లులకు మళ్లీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దాంట్లో రెండు అన్నాడీఎంకే సర్కార్ సమయంలో ఆమోదించినవి ఉన్నాయి. తమిళనాడుతో పాటు పంజాబ్, కేరళ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపైనా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో తమిళనాడు గవర్నర్ వైఖరిని నిలదీసింది. అసెంబ్లీలో మళ్లీ బిల్లులు ఆమోదం పొందాయని, వాటిని గవర్నర్‌కు పంపారని, ఆయన ఏమి చేస్తారో చూద్దామని కోర్టు పేర్కొన్నది. ఈ కేసును మళ్లీ డిసెంబర్ ఒకటో తేదీకి వాయిదా వేసింది. కేరళ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా ఆయన… రాజ్యాంగంలోని ఆర్టికల్ 168 ప్రకారం గవర్నర్‌లు శాసనసభలో భాగమనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోర్టుకు విన్నవించారు. అందుకు సంబంధించిన వివరాలను సుప్రీం ధర్మాసనానికి సమర్పించారు. 21 నెలలుగా ఎనిమిది బిల్లులను గవర్నర్ ఆమోదించలేదని గుర్తుచేశారు. కేరళ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పినరయి విజయన్ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. వేణుగోపాల్ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు…విచారణకు రావాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణికి నోటీసులు జారీ చేసింది. లేదంటే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతానైనా రావాలని ఆదేశిస్తూ విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.