Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

అజెండా ఏమిటి?

స్పష్టత ఇవ్వండి
. మేమిచ్చే 9 అంశాలు చర్చించాల్సిందే
. ప్రధానికి రాసిన లేఖలో సోనియా డిమాండ్‌

న్యూదిల్లీ : స్పష్టమైన అజెండాను ప్రకటించకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ విషయమై తాజాగా కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బుధవారం లేఖ రాశారు. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల అజెండా ఏమిటో బయటపెట్టాలని సోనియా డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున ఈ అజెండాలో 9 అంశాలను చేర్చాలని ఆమె లేఖలో స్పష్టంచేశారు. ఇతర రాజకీయ పార్టీలను సంప్రదించకుండానే పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించారని, ఈ సమావేశాల అజెండా ఏమిటో కూడా తమకు కనీస అవగాహన లేదని సోనియా పేర్కొన్నారు. ప్రత్యేక సమావేశాలు జరిగే మొత్తం ఐదు రోజులు ప్రభుత్వ అజెండాకే కేటాయించినట్లు తమకు తెలుస్తోందని, అయితే వచ్చే సమావేశాల్లో కొన్ని అంశాలను చర్చకు తీసుకురావాలని తాము కూడా కోరుతున్నామని సోనియా గాంధీ లేఖలో తేల్చిచెప్పారు. అదానీ అక్రమాలు, మణిపూర్‌ అల్లర్లు, రైతు సమస్యలు, కనీస మద్దతు ధరపై కేంద్రం ఇచ్చిన హామీ, కులాల వారీగా జనగణన, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రోజురోజుకీ దిగజారుతున్న సంబంధాలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను ఆదుకోవడం, హరియాణా సహా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో చెలరేగుతున్న మత ఘర్షణలు, సరిహద్దుల్లో కొనసాగుతున్న చైనా ఆక్రమణలపై చర్చ చేపట్టాలని ప్రధాని మోదీని సోనియా కోరారు. ఇదిలా ఉండగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాల నేతలు మంగళవారం భేటీ అయిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో కాంగ్రెస్‌, డీఎంకే, ఎన్సీపీ, సీపీఎం, సీపీఐ, ఆప్‌, టీఎంసీ, ఆర్జేడీ, ఎస్పీ, జేఎంఎం తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు. మోదీ చాలీసా కోసం తాము పార్లమెంటుకు వెళ్లబోమని, సమావేశాల్లో ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని భేటీ అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్‌) జైరాం రమేశ్‌ తెలిపారు. సెప్టెంబరు 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ ప్రత్యేకం వెనుక ఆంతర్యం ఏమిటనేదానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే, జమిలి ఎన్నికల కోసం బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు, ఓబీసీ వర్గీకరణ వంటి అంశాలపై చర్చించడానికే ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కాగా, కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ బుధవారం ఏఐసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంటులో చర్చలకు సంబంధించిన అజెండా లేకపోవడం ఇదే మొదటిసారని విమర్శించారు. ప్రత్యేక సమావేశాలు నిర్మాణాత్మకంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, వ్యూహాత్మక గ్రూపు సమావేశ, ఇండియా భాగస్వామ్య పార్టీల సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని జైరాం రమేశ్‌ చెప్పారు. ప్రధాని భయపడుతున్నారని, ఆయన అలసిపోయారని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img