Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

వీసీల భర్తీలో రాజకీయం వీడేనా?

ఏడు విశ్వవిద్యాలయాలకు నియామకాలు
ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల ఉప కులపతులు(వీసీ) నియామకం ఈ సారైనా సక్రంగా జరిగేనా?, లేక ప్రభుత్వానికి వత్తాసు పలికే వారినే నియమిస్తారా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఏడు విశ్వవిద్యాల యాల్లో వీసీల నియామకానికి ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి ప్రకటన జారీజేసింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ద్రావిడ విశ్వవిద్యాలయం, రాయలసీమ విశ్వవిద్యాలయం, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యా లయం, జేఎన్‌టీయూ-అనంతపురం, డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి ప్రకటన వెలువడిరది. ప్రస్తుతమున్న వారి పదవీ కాలం ముగియడంతో వారి స్థానంలో నూతన వీసీలను నియమించనుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో వీసీల నియామకంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. చాలా మంది వీసీలు రాజకీయ కోణంలో పనిచేస్తున్నారనే ప్రచారముంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. సెంట్రల్‌ యూనివర్సిటీ(అనంతపురం)తెలుగు అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల ఇంటర్వ్యూల్లో అర్హతలు లేని వారిని నియమించారంటూ ఇటీవల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాల్లో అడ్డగోలు నియామకాల్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించారు. అటు ప్రతిపక్షాలు సైతం వీసీల వైఖరిని తూర్పారబట్టినా ప్రభుత్వ వైఖరిలో మార్పులేదు. పట్టభద్రుల ఎన్నికల్లో ఆంధ్రా విశ్వవిద్యాలయం వీసీ ఏకంగా వైసీపీ నేతల సమావేశానికి హాజరవ్వడం విమర్శలకు దారితీసింది. నాగార్జున విశ్వవిద్యాలయ వీసీపైనా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాగా రాష్ట్రంలోని చాలా మంది వీసీలు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేయడంతో విశ్వవిద్యాలయాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే విశ్వవిద్యాయాల ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాకింగ్‌ క్రమేపీ దిగజారుతోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఉన్న ఆంధ్రా విశ్వవిద్యాలయం ర్యాంకింగ్‌ తగ్గిపోయింది. దీనికి సమర్థత గల వీసీలను నియమించకపోవడం, విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ప్రభుత్వం తగినంతగా సహకరించకపోవడమే కారణమన్న ప్రచారముంది.
మార్గదర్శకాలు పేరుకేనా?
వీసీల నియామకానికి యూజీసీ నిబంధనలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యామండలి అనేక మార్గదర్శకాలను జారీజేసింది. ఇవి పేరుకేనా?, లేక పటిష్టంగా అమలు చేస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి. ఈ విశ్వవిద్యాలయాలకు మూడేళ్ల కాల పరిమితి ప్రాతిపదికన వీసీలను నియమించనున్నారు. నియమితుల్కెన వారికి యూజీసీ నిబంధనల ప్రకారం రూ.2లక్షల పదివేల వేతనం ఉంటుంది. అత్యున్నత స్థాయి సమర్థత, సమగ్రత, నైతికత, సంస్థాగత నిబద్ధత, విశ్వవిద్యాలయ వ్యవస్థలో ప్రొఫెసర్‌గా కనీసం 10 సంవత్సరాల అనుభవం లేదా తత్సమాన హోదాలో అపారమైన అనుభవం తదితర అర్హతలు గల వారిని ఈ వీసీల పోస్టులకు దరఖాస్తు చేసేలా మార్గదర్శకాలను జారీజేశారు. ఇప్పటికే చాలా విశ్వవిద్యాలయాల్లో అర్హతగల వారిని పక్కనపెట్టి, రాజకీయ జోక్యంతో వీసీలను నియమించినట్లు సమాచారం. ఈ విడతైనా అలా జరగకుండా అర్హతగల వారిని వీసీలుగా నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img